సీఎం కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారా?

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత​కేసీఆర్ ప్రయాణం నల్లేరుపై నడకలా సాగింది. కానీ ఇప్పుడు తొలిసారిగా కేసీఆర్ ఆత్మరక్షణలో పడినట్టుగా కనిపిస్తోంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్​ ఒకేసారి పుంజుకోవడంతో ఆయన తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒక్క హుజూరాబాద్​ సీటు పోతే మాకొచ్చే నష్టం ఏమిటి? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకట్రెండు సీట్లు ఓడిపోతే మా పార్టీకి పోయేదేమీ లేదు అనడం చూస్తుంటే.. ఓటమికి ముందే సిద్ధపడినట్టుగా కనిపిస్తోంది. హుజూరాబాద్​ ఎన్నిక ఫలితమే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా ప్రతిబింబించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాల్లోనూ మార్పు కనిపిస్తోంది. వారికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీల వైపు బీసీల చూపు మర్లుతున్నది.


కేసీఆర్ అపర చాణక్యుడు. జనం నాడిని ఔపోసన పట్టిన సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న వ్యక్తి. తన శక్తియుక్తులను ఉపయోగించి ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థుడు. ఇవన్నీ హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు ఉన్నటువంటి విశ్లేషణలు, నిపుణుల అభిప్రాయాలు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పలికింది. తెలంగాణ ఉద్యమ సారథిగా ప్రజలు కొంతకాలం కేసీఆర్​ పట్ల విశ్వాసం ఉంచిన మాట నిజమే. అయితే రానురాను ఆయనలో వచ్చిన మార్పును ప్రజలు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించడం, ఉద్యమకారులను పక్కన పెట్టి మాది మఠం కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించడంతో నిజమైన ఉద్యమకారులే కాదు సామాన్య జనాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం లాంటిదేనని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్​కు తగిన గుణపాఠం చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురుచూశారు. వారికి హుజూరాబాద్​ ఉప ఎన్నిక రూపంలో మంచి అవకాశం వచ్చింది. ఉప ఎన్నికలో ఓటు ద్వారా కీలెరిగి వాత పెట్టారు.

ఫుల్​జోష్​తో బీజేపీ
ఒకప్పుడు ఒకట్రెండు ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైన బీజేపీ.. 2019 జనరల్​ ఎలక్షన్స్​లో నాలుగు ఎంపీ స్థానాలను గెలవడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పోటాపోటీగా సీట్లు దక్కించుకోవడం ఆ తర్వాత దుబ్బాక, ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడం కమలం పార్టీకి నూతన జవసత్వాలను అందజేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినప్పటి నుంచి బండి సంజయ్ దూకుడు పార్టీ కార్యకర్తల్లో జోష్​ నింపుతోంది. తాజాగా హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​ గెలుపుతో రానున్న సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ బలం గణనీయంగా పెరుగుతుందనే విశ్వాసాన్ని పెంచింది. ఆపరేషన్​ ఆకర్ష్​తో బలమైన నాయకులు, ఉద్యమకారులను వరుసగా బీజేపీలో చేర్చుకుంటూ తన బలం పెంచుకుంటోంది. బలహీన వర్గాల్లో గట్టి పట్టున్న ఈటల లాంటి మరో వ్యక్తి మరే పార్టీలో కూడా లేకపోవడం, రాష్ట్రంలో మొదటి నుంచీ రాజకీయాలను శాసిస్తున్న బలమైన రెడ్డి సామాజిక వర్గం ఈటలకు సహకరించడం లాంటి అంశాలతో బీజేపీ హైకమాండ్​ ఈటలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఆయన సారథ్యంలో ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. అందుకు ఆయన సమర్థుడు కూడా.

రేవంత్ పై కాంగ్రెస్ ఆశలు
మరోవైపు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ లో నూతనోత్సాహం వెల్లివిరిస్తోంది. హుజూరాబాద్​ ఉప ఎన్నికలో ఆ పార్టీ ఓటమి పాలైనా దాని ప్రభావం రేవంత్​ సారథ్యంపై అంతగా పడలేదు. సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత వ్యక్తం కావడం రేవంత్​కు కాస్త మైనస్​ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీ హైకమాండ్​ మాత్రం రేవంత్​రెడ్డిపై పూర్తి నమ్మకం ఉంచినట్టుగా కనిపిస్తోంది. అయితే సొంత పార్టీలో తనను వ్యతిరేకించే వారిని, సీనియర్లను రేవంత్​ ఎంతమేరకు కలుపుకొని వెళ్లగలుగుతారనేది వేచి చూడాల్సిందే. అన్ని నియోజకవర్గాల్లో సహజంగానే కాంగ్రెస్ కు ఉండే ఓటు బ్యాంకు, రేవంత్ రెడ్డి వాగ్దాటి పార్టీకి కలిసి వచ్చే అంశాలు. అయితే వీటిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓట్లుగా మార్చుకోవడం అనేది కాంగ్రెస్​ పార్టీ పనితీరుపైనే ఆధారపడి ఉంది.
బీసీల్లో పెరుగుతున్న అసంతృప్తి
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ సమాజంలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గాలు ఇప్పటికీ ఓట్లేసే యంత్రాలుగానే ఉన్నాయి తప్ప వారికి నిజమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్ర్యం మాత్రం రాలేదు. ప్రస్తుతం చట్టసభల్లో వెనుకబడిన తరగతుల అతి తక్కువ ప్రాతినిథ్యమే దీనికి నిదర్శనం. ఇప్పుడున్న తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలకుగానూ బీసీ ఎమ్మెల్యేలు 23 మాత్రమే ఉండగా, కౌన్సిల్ లో 40 మంది ఎమ్మెల్సీలకుగానూ 8 మంది మాత్రమే ఉన్నారు. అంటే సమాజంలో ఉన్న బీసీలు 60 శాతం కాగా.. అసెంబ్లీలో వారి శాతం 19, కౌన్సిల్ లో అయితే 15% గా ఉంది. అంటే జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిథ్యం పొందాలంటే ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందనే ఆవేదన, అసహనం బీసీల్లో వ్యక్తమవుతున్నది. రాజ్యాధికారానికి దూరంగా ఉన్నామనే భావన వారి ఆలోచనా విధానంలో మార్పులకు శ్రీకారం చుడుతున్నది. బీసీలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీల వైపు వారి చూపు మర్లుతున్నది. అది గమనించిన పార్టీలు మనుగడ సాగించాలంటే సరైన బీసీ ఎజెండా లేకుండా ముందుకు సాగడం కష్టమనే నిర్ణయానికి వస్తున్నాయి.
ముందే ఓటమికి సిద్ధవుతున్న టీఆర్ఎస్
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ బలం చూపించలేకపోయాయి. దీంతో కేసీఆర్ ప్రయాణం సాఫీగా సాగిపోయి అధికారం చేపట్టగలిగారు. కానీ ఇప్పుడు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు రేవంత్​ నేతృత్వంలోని కాంగ్రెస్ పుంజుకున్నాయి. ఈ పరిణామాలతో కేసీఆర్ తొలిసారి ఆత్మరక్షణలో పడ్డారు. హుజూరాబాద్ పోతే మాకొచ్చే నష్టం ఏంటి అని అనడం, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకట్రెండు సీట్లు ఓడిపోతే పోయేదేమీ లేదని అనడం టీఆర్ఎస్​ ముందే ఓటమికి సిద్ధపడినట్టుగా కనబడుతోంది. ఇకపై జరిగే ఎన్నికల్లో హుజూరాబాద్ ఫలితమే రిపీట్​ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దళితబంధు రాష్ట్రమంతా అమలు చేయాలంటే బడ్జెట్ సరిపోదు. కాబట్టి అది మెడలో గుదిబండ కాబోతోంది. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్నారు గనక సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఇక బీసీలు కూడా నెమ్మదిగా తమకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ సమీకరణాలన్నీ టీఆర్ఎస్ కు ప్రతికూలాంశాలుగా మారుతున్నాయి.

మార్పు సాధ్యమని నిరూపించిన హుజూరాబాద్
నోముల నరసింహయ్య మరణించడంతో వచ్చిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో మొదటిసారి బీసీవాదం గట్టిగా వినిపించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో అది ఇంకాస్త బలపడింది. వాస్తవానికి రాష్ట్రంలోని కులసంఘాలన్నింటితో మమేకమైన ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ మాత్రమే. ఈనాడు రాష్ట్రంలోని బీసీలకు కనబడుతున్న భవిష్యత్ ఆశాదీపం ఈటలే. కేసీఆర్ పూర్తిస్థాయిలో తన అధికార బలాన్ని, శక్తియుక్తులను ప్రదర్శించినప్పటికీ ఆయనను ఎదుర్కొని ఎన్నికలో గెలిచారు. ఈ విజయం బీసీ వర్గాల్లోనే కాకుండా ప్రస్తుత రాజకీయాల్లో కేసీఆర్ నియంతృత్వ ధోరణితో విసిగిపోయి మార్పు రావాలని ఎదురుచూస్తున్న కోట్లాది మంది కళ్లలో వెలుగు నింపింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎంత అధికార బలమున్నా, ఎన్ని డబ్బులు పంచినా ప్రజలు గట్టిగా నిర్ణయం తీసుకుంటే మార్పు సాధ్యమే అని హుజూరాబాద్ ఉప ఎన్నిక నిరూపించింది. 

 - సంగెం సూర్యారావు, బీసీ టైమ్స్ వ్యవస్థాపకుడు