- రోజుకు రూ. కోటికి పైగా వడ్డీలకు చెల్లింపు
- ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితి
- ఫండ్స్లేక ఒకటికి 4 సార్లు బిల్లులు చెకింగ్
హైదరాబాద్,వెలుగు: అప్పుల పాలైన బల్దియాను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోవైపు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ఇస్తున్న నిధులను కూడా ఇవ్వకుండా వేరే పనులకు మళ్లిస్తుంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్ర ఫైనాన్స్కమిషన్ బల్దియాకు రూ.2453 కోట్లు కేటాయించింది. ఇందులో కేవలం రూ.1,014 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీంతో బల్దియా వద్ద నిధులేక అప్పుల పాలైంది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరింది. అయినా రాష్ట్ర సర్కార్ ఆదుకునేందుకు ముందుకు రావడంలేదు. బల్దియా చేసిన అప్పులకే ప్రతిరోజూ రూ. కోటికి పైగా వడ్డీ చెల్లిస్తుంది. బల్దియా చేపట్టిన ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి నయాపైసా రాకపోగా పూర్తి చేసేందుకు రూ.4,590 కోట్ల అప్పులు చేసింది. ఇన్ని అప్పులు తెచ్చినా కూడా బల్దియా గట్టెక్కడంలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వని సర్కార్ కొత్త ప్రాజెక్టులను అమలు చేయాలంటూ బల్దియాపైనే భారం పెడుతుంది. దీంతో ఓ వైపు జీతాలు, మరో వైపు మెయింటెనెన్స్ పనులను చేసేందుకు బల్దియాకు కష్టంగా మారింది. ఒకటో తేదీ నుంచి జీతం ఎప్పుడొస్తుందోనని ఉద్యోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫండ్స్ లేకపోవడంతో ఫైనాన్స్ విభాగం అధికారులు బిల్లుల విడుదలలో ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకున్నాకే ఇస్తున్నారు. వెంటనే ప్రభుత్వం బల్దియాకు నిధులు ఇవ్వాలని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ఇస్తున్న నిధులను కూడా తిరిగి బల్దియాకు కేటాయించాలని పేర్కొన్నారు.