ఉద్యమకారులను హీనంగా చూస్తున్న కేసీఆర్

పాల్వంచ, వెలుగు: సీఎం కేసీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న ఉద్యమకారులను హీనంగా, ద్రోహులను వీరులుగా చూస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి కృష్ణ ధ్వజమెత్తారు. ఉద్యమకారులకు గౌరవం ఇవ్వాలనే డిమాండ్ తో 24 గంటలపాటు పాల్వంచలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉద్యమకారులకు బుధవారం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరిట రూ.100 కోట్లు కేటాయించిన సీఎం, ఉద్యమకారులకు కనీస గుర్తింపు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నా రు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ లో ఉద్యమకారుల కుటుంబాలకు భృతి, ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు నూకల రంగారావు, కొండం వెంకన్న, బద్ధి కిషోర్, భత్తుల వెంకటేశ్వరరావు, చంద్రగిరి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారులు మంజూర్, గౌస్, ఉబ్బన శ్రీను, రాము, పెద్దిబాబు తదితరులు పాల్గొన్నారు.