బడ్జెట్​ బడుల్లో ఉచిత విద్య ఏది? : కిన్నెర సిద్ధార్థ

తెలంగాణ రాష్ట్రంలో 12,193 గుర్తింపు పొందిన ప్రైవేటు బడులుండగా, వీటిలో 2,489 కార్పొరేట్, మరో 150 బడులు సీబీఎస్​ఈ, ఐసీఎస్​ కేంబ్రిడ్జి, సిలబస్​తో నడుస్తుండగా, 9556 వరకు సాధారణ ప్రైవేటు బడ్జెట్ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ బడుల్లో ఒక్కో విద్యార్ధికి ఏటా రూ.65 వేలు, గురుకుల పాఠశాలల్లో ఏటా ఒక్కో విద్యార్థికి రూ. 1.20 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, కార్పొరేట్ బడుల్లో ఒక్కో విద్యార్థికి ఏటా రూ. 70 వేల నుంచి -2 లక్షల వరకు, ఇంటర్ నేషనల్ బడుల్లో  ఏటా ఒక్కో విద్యార్థికి 3.-10 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తుండగా..  ప్రైవేటు బడ్జెట్ బడులు మాత్రం ఏటా రూ. 40 వేల లోపు ఫీజులు మాత్రమే వసూలు చేస్తూ  పేద, దిగువ మధ్య తరగతి విద్యార్ధులకు అతి తక్కువ ధరలో        నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. తక్కువ ధరలో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ విద్యా నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వ, కార్పొరేట్ బడుల కంటే మెరుగైన ఫలితాలు బడ్జెట్ బడులు సాధిస్తున్నాయి. 10వ తరగతి పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో A1 మార్కులు 90% ఆపైన పొందిన వారికే 10జీపీఏ వస్తుంది. 2022లో అన్ని బడుల్లో చదివిన విద్యార్థులకు కలిపి 11,343 మందికి 10 జీపీఏ రాగా, వారిలో 8000 మంది విద్యార్థులు బడ్జెట్ బడులకు చెందిన వారే ఉండడం గమనించొచ్చు. ప్రభుత్వ బడులు, ఎయిడెడ్, జిల్లా పరిషత్తు సంక్షేమ పాఠశాలలు ఇలా 11 రకాల విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు కేవలం 16 శాతం మందికే 10జీపీఏ వచ్చిందంటే ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

రాష్ట్రంలోని 26,053 ప్రభుత్వ బడుల్లో 1,40,295 ఉపాధ్యాయులు 10,689 మంది బోధనేతర సిబ్బంది పని చేస్తుండగా, 12,193 ప్రైవేట్ బడుల్లో 1,76,885 ఉపాధ్యాయులు, 46,952 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో 4,000 బడులు ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో, 8,000 బడులు ఇద్దరు ఉపాధ్యాయులతో నడుస్తుండగా.. బడ్జెట్ బడులు మాత్రం తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి తక్కువ ధరలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఇంత తక్కువ ధరలో ఫీజులు వసూలు చేస్తూ కూడ ఒంటరి మహిళల పిల్లలకు ఫీజులో రాయితీలివ్వడంతో పాటు, ముగ్గురు పిల్లలున్న వారిలో ఒకరికి ఉచితంగా విద్య నందిస్తూ పూర్తిగా స్థోమతలేని వారికి ఉచితంగా విద్య నందిస్తూ తమ వంతు సహాయ సహకారాలను సమాజానికి అందిస్తున్నాయి ప్రైవేటు బడ్జెట్ బడులు.

బడ్జెట్ బడులను దగా చేసిన కేసీఆర్​

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రా కార్పొరేట్ విద్యా సంస్థల ఆధిపత్యం తగ్గి తమకు లాభం జరుగుతుందని ఉద్యమ సమయంలో కేసీఆర్​ చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మిన తెలంగాణ ప్రైవేట్ బడ్జెట్ బడుల వారు టీఆర్​ఎస్​పార్టీ సభలకు, సమావేశాలకు ఆర్థిక సహకారం అందించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్​ ఆంధ్రా కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కై లాభాలలో వాటాలు పంచుకుంటూ తెలంగాణ విద్యా సంస్థలకు నమ్మక ద్రోహం చేయడమే కాక, ప్రైవేట్ బడ్జెట్​ బడుల ప్రాపర్టి ట్యాక్స్ ను 5 రెట్లు పెంచడంతో పాటు కరెంటు బిల్లు, నీటి బిల్లులు వాణిజ్య పన్నుల ఖాతాలో వసూలు చేస్తూ ప్రైవేట్ బడ్జెట్ బడులను కోలుకోలేని దెబ్బతీశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో మార్చి 14, 2020న ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించడమే కాకుండా  ప్రైవేట్ బడులకు ఎవరూ ఫీజులు కట్ట వద్దని,  ఎవరైనా ఫీజులు అడిగితే 100 కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని మరీ ప్రెస్​మీట్ పెట్టి  కేసీఆర్​ బహిరంగంగా చెప్పడంతో ప్రైవేట్ బడ్జెట్ బడులు 40% మేరకు ఫీజులు నష్టపోయి తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సివచ్చింది. బడ్జెట్ బడులలో 6546 బడులకే సొంత భవనాలుండగా మిగతా 3010 బడులు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. వీరందరూ కరోనా లాక్ డౌన్ సమయంలో బడులు నడవకున్నా, ఫీజులు రాకున్నా కిరాయిలు కట్టి లక్షలాది రూపాయల అప్పుల్లో కూరుకుపోయారు. అప్పులు కూడా పుట్టని వందలాది మంది బడులను మూసివేయగా అప్పుల భారాన్ని తట్టుకోలేని వారు 250 మంది ఆత్మహత్యలకు పాల్పడినారు.

ఉచిత విద్యను దూరం చేస్తున్న కేసీఆర్​

కరోనా సమయంలో ఫీజులు రాని కారణంగా ప్రైవేట్ బడ్జెట్ బడులు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేకపోవడంతో వాటిల్లో పని చేసే వారిలో 50 వేల మందికి పైగా ఉపాధ్యాయులు వేరే వృత్తిలోకి మారారు. కరోనా అనంతరం కూడా వీరు తమ విధుల్లో చేరలేదు. ఈ కారణంగా బడ్జెట్ బడులన్నీ ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం పేదలకు 25% సీట్లు కేటాయించడానికి మేము సిద్దంగా ఉన్నామని బడ్జెట్​​బడుల యజమానులు ప్రభుత్వాన్ని కోరినా కేసీఆర్​ పెడ చెవిన పెట్టి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండ అడ్డుకుంటున్నాడు. బడ్జెట్​ బడులలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు లభించే నాణ్యమైన విద్యను, విద్యాహక్కు కింద పేద విద్యార్థులకు లభించే ఉచిత విద్యను దూరం చేయవద్దని కేసీఆర్​ సర్కార్​కు మా వినతి. బడ్జెట్​ బడుల కష్టనష్టాలను తీర్చాలి. బడ్జెట్​ బడులలో లభించాల్సిన ఉచిత విద్యకు ఎగనామం పెట్టకుండా పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ను పాలకులు ఇప్పటికైనా మరవొద్దు.

- కిన్నెర సిద్ధార్థ, జాతీయ అధ్యక్షులు ఉచిత విద్యా, వైద్యం సాధన సమితి