పోడు సమస్యల పరిష్కారం ఎన్నడు?

తెలంగాణ ఏర్పాటు తర్వాత పోడు భూముల సమస్యపై సీరియస్ గా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. తానే నేరుగా క్షేత్ర స్థాయికి వెళ్లి కుర్చీ వేసుకొని మరీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే 2021 డిసెంబర్ లో ఓ అత్యున్నత స్థాయి కమిటీ వేసి సమగ్ర సర్వే ద్వారా పోడు భూములను గుర్తించి, వాటి హక్కు దారులందరికీ పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ నేటికీ ఎలాంటి సర్వే జరగలేదు. పోడు భూముల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే సామెతను గుర్తు చేస్తుండటం బాధాకరం. సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లోని అడవుల్లో పోడు రైతులు, ఫారెస్ట్​ఆఫీసర్ల మధ్య తరచూ యుద్ధ వాతావరణం నెలకొంటోంది. రెండేండ్ల క్రితం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన పోడు వివాదం వార్తల్లోకెక్కింది. ఇటీవల కూడా చాలా చోట్ల అధికారులు, పోడు రైతుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్​ఉన్నతాధికారులు, అటవీ శాఖ మంత్రి పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం లేదు. సీఎం సారు ఆలోచిస్తున్నారు.. త్వరలో నే సమస్య పరిష్కారం అవుతుందనే ముక్తాయింపు నివ్వడం తప్ప కనుచూపుమేరలో పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న దాఖలాలు కనపడటం లేదు. 

పోడు హక్కుల పేరిట కబ్జాలు..

అడవిని తల్లిగా భావించే ఆదివాసీలు అందులో దొరికే తేనె, బంక, ఇప్ప పువ్వు, వంట చెరకు వంటి ఉత్పత్తులపై ఆధార పడి జీవనం సాగిస్తారు. అయితే స్వార్థ పరులైన కొంత మంది గిరిజనేతరులు, లీడర్లు అడవులను తెగనరుకుతూ తమకూ పోడు హక్కులు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని పకడ్బందీ చట్టాలు తెచ్చినా వారు అడవులను ఆక్రమించుకుంటూనే ఉన్నారు. 2006లో భారత ప్రభుత్వం అటవీ విధానాలను సవరిస్తూ.. అటవీ భూములలో 2005వ సంవత్సరం వరకు సేద్యం చేస్తున్న గిరిజన పేదలకు ఒక కుటుంబానికి10 ఎకరాల భూములపై సేద్యపు హక్కులు(యాజమాన్యపు హక్కులు కాదు) ఇవ్వాలని ప్రతిపాదించింది. అదే గిరిజనేతరులైతే కనీసం 75 సంవత్సరాలకు తగ్గకుండా సదరు అటవీ భూముల్లో సేద్యం చేస్తుంటే వారికి ఆ భూములపై సేద్యపు హక్కులను ఇవ్వడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ, సబ్ డివిజనల్, డివిజన్, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటులో భాగంగా గ్రామ సర్పంచ్, ఆ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన పెద్దలతో పాటు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న రెవెన్యూ, సర్వే సిబ్బంది, అటవీశాఖ అధికారులతో సదరు దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే హక్కుల ఉత్తర్వులు జారీ చేయాలి. అయితే ఎంతో పకడ్బందీగా రూపొందించిన ఈ షరతులన్నింటినీ బేఖాతర్ చేస్తూ.. రాజకీయ నాయకులు, వారి బినామీలు నేటికీ యథేచ్ఛగా అటవీ భూముల కబ్జా కొనసాగిస్తున్నారు. దాదాపు లక్ష ఎకరాలకు మించిన అటవీ భూములపై అనర్హులైన వ్యక్తులే దొడ్డిదారిన హక్కులు పొందారని,  అందులోనూ రిజర్వ్ అడవుల మధ్యలో రెవెన్యూ పట్టాలు ఎలా జారీ చేశారో తమకే అర్థం కావడం లేదని అటవీశాఖ అధికారులే నివ్వెర పోయారు. తెలంగాణలో 66 లక్షల ఎకరాల విస్తీర్ణంలోనున్న అడవుల్లో ఇదివరకే 8 లక్షల ఎకరాల అడవులు కబ్జాలతో కనుమరుగైతే మరో10 లక్షల ఎకరాల అడవులు నేడు కబ్జా కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి.

రికార్డుల మధ్య తేడా.. 

1967లో అమలులోకి వచ్చిన అటవీ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం నోటిఫికేషన్ ద్వారా అటవీ భూముల్లో సేద్యం చేస్తున్న గిరిజనులు వారి భూ హక్కుల కేటాయింపు కోసం రెవెన్యూ అధికారులను ఆశ్రయించాల్సి ఉంటుంది. వారి దరఖాస్తులను స్వీకరించిన తర్వాత సెటిల్ మెంట్ ఆఫీసర్ గా నియమితులైన రెవెన్యూ అధికారి ఆ ప్రాంత అటవీశాఖ అధికారుల సాయంతో సమగ్ర విచారణ జరపాలి. పోడు హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న భూములు రెవెన్యూ భూముల్లో లేదా అటవీశాఖకు చెందిన రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో ఉన్నాయో తేల్చాల్సి ఉంటుంది. ఏదైనా వివాదం ఉంటే సెక్షన్15 ప్రకారం దాన్ని పరిష్కరించి సర్వే నంబర్లు భూ విస్తీర్ణంతో సహా  ప్రొహిబిటరీ ఆర్డర్స్ బుక్ లో వివరాలు నమోదు చేసి ఫైనల్ నోటీస్ ద్వారా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. ఈ ప్రక్రియ ఏటా రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఉమ్మడిగా నిర్వర్తించి ప్రొహిబిటరీ ఆర్డర్స్ బుక్ ను చట్టబద్ధంగా నిర్వహిస్తే  పోడు భూముల వివాదాలే వచ్చేవి కాదు. ఇవేవీ చేయకుండానే రిజర్వ్ ఫారెస్ట్ లోని భూములపై రాజకీయ ఒత్తిళ్లతోనో మరో కారణంతోనో గిరిజనులకు హక్కులను ఆపాదిస్తూ పట్టాలను జారీ చేస్తుండటం పరిపాటిగా మారింది. రిజర్వ్ ఫారెస్ట్ భూములపై సైతం హక్కులను ఆపాదిస్తూ పట్టాలు జారీ చేసిన కొంతమంది అధికారులు సస్పెండ్​అయి, జైలు పాలయ్యారు. అయినా అలాంటి వారి వైఖరిలో ఎటువంటి మార్పు రావడం లేదు. ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అటు ఫారెస్ట్​ అధికారులు, ఇటు పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలకు గల కారణాలపై కూడా శాస్త్రీయ విశ్లేషణ జరడం లేదు. దీంతో ఘర్షణలు జరిగిన ప్రతీసారి అయితే ఆదివాసీలు, లేదంటే ఫారెస్ట్​ సిబ్బంది తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.

అటవీ విధ్వంసాన్ని ఆపాలంటే.. 

రాష్ట్రంలో 24 శాతం అడవులున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఉన్న అడవులను కాపాడుతూనే కొత్తగా మొక్కలు పెట్టాల్సిన అవసరం ఉంది. అడవులను కాపాడాలంటే పోడు భూములు, అటవీ హక్కుల సమస్యని ప్రభుత్వం వేగంగా పరిష్కరించాలి. రెవెన్యూశాఖ, అటవీశాఖల మధ్య సమన్వయ లోపం ఫలితంగానే చాలా చోట్ల పోడు సమస్యలు పెద్దవవుతున్నాయి. ఇరు శాఖల అధికారులు అడవులను ఆనుకొని, అడవిలో భాగంగా కొనసాగుతున్న భూములు ప్రభుత్వ భూములా? అటవీ భూములా ? అనేది తేల్చాలి. ఆ తర్వాతే.. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి ముందుకు కదలాలి. అప్పుడే ఆ కార్యక్రమం విజయవంతమవుతుంది. ఒక వేళ సదరు భూములు పోడు భూములేనని తేలితే వాటి వివరాలను ప్రివెంటివ్ ఆర్డర్ బుక్ లో చేర్చి హరితహారం కోసం ఆ భూముల జోలికి వెళ్లకూడదని అటవీశాఖాధికారులకు తగిన ఆదేశాలివ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్లు అడవి లోపల అడవే ఉండాలి తప్ప వేరెవరూ ఉండరాదనే కోరిక నెరవేరాలంటే పోడు భూములు,అటవీ హక్కుల వివాదాలు శాశ్వతంగా పరిష్కారం కావాల్సి ఉంది. ఈ రాష్ట్రంలో మానవ మనుగడకే కాదు సకల జీవ జాతుల మనుగడకూ అటవీ సంరక్షణ ఎంతో ముఖ్యం.

:: నీలం సంపత్, సామాజిక కార్యకర్త