- సెంటిమెంట్ప్రకారం ఈసారీ హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ప్రచారం
- మొదటి సభ ఇక్కడ నిర్వహిస్తే విజయం ఖాయమని బీఆర్ఎస్ నేతల నమ్మకం
హుస్నాబాద్/మహబూబ్‌నగర్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచే ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు కూడా ఇక్కడే మొదటి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నెల 15న ‘ప్రజా ఆశీర్వాద సభ’ పేరుతో ఎన్నికల సభ పెడుతున్నారు. సీఎం కేసీఆర్హుస్నాబాద్నుంచి ఎన్నికల కదనానికి వెళ్లడం వెనుక.. ఉత్తర దిక్కు నుంచి వెళ్తే రాజ్యం దక్కుతుందనే నమ్మకం ఉన్నట్లు చర్చ నడుస్తున్నది.
లక్కీ నెంబర్6 వచ్చేలా 15(1+5 = 6)నే సభ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 15న తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫామ్‌లు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అనంతరం తన సెంటిమెంట్సంఖ్యకు అనుగుణంగా ఎంచుకున్న నాయకులతో హుస్నాబాద్వెళ్తారు. ఎప్పట్లాగే అక్కడ కెప్టెన్లక్ష్మీకాంతరావు ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించనున్నారు.
తన వద్ద ఉన్న పండితుల సూచన మేరకు హుస్నాబాద్ నుంచి జనగామ, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్‌లో వరుసగా నాలుగు రోజులపాటు సీఎం బహిరంగ సభలు నిర్వహిస్తారని సమాచారం. ఇక్కడి ప్రజలను ప్రభావితం చేస్తే గెలుపు ఖాయమని ఆయన నమ్ముతున్నట్లు తెలుస్తున్నది.
సీఎం బాటలోనే ఎమ్మెల్యేలు..
షెడ్యూల్వచ్చి ఆరు రోజులవుతున్నా రూలింగ్ పార్టీ క్యాండిడేట్లు సప్పుడు చేయడం లేదు. అంతకుముందు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పల్లెల నుంచి పట్టణాల దాకా వీధులు, వార్డుల్లో తిరుగుతూ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కోడ్అమల్లోకి రాగానే అన్ని కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. మరుసటి రోజు నుంచే ఎలక్షన్ క్యాంపెయినింగ్ ప్రారంభించాల్సి ఉన్నా.. అమావాస్యకు ముందు రోజులు కావడంతో చేదు అనుభవాలు ఎదురవుతాయని చాలా మంది క్యాండేట్లు భావిస్తున్నారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారంలో ఆకట్టుకునేలా స్పీచ్‌లు ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. శనివారం సోమవారం నుంచి నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల క్యాంపేయినింగ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ప్రచార రథాలు సిద్ధం చేసుకున్నారు.