గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దుకు.. సీఎం కేసీఆర్​దే బాధ్యత : బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల రద్దుకు కేసీఆరే బాధ్యత వహించి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి నిరుద్యోగికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్షా 60 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. కేసీఆర్ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని ఆరోపించారు. 

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని సోమవారం కరీంనగర్​లోని మహాశక్తి ఆలయం వద్ద సంజయ్ మొక్కలు నాటారు. తర్వాత బీజేపీ ప్రచార రథాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇతర పార్టీల నేతలతో పాటు తన మాట వినని సొంత పార్టీ లీడర్లు కూడా నాశనం కావాలని కోరుకుంటూ వేరే రాష్ట్రాలకు వెళ్లి కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. గణేశ్ మండపాలకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.3 కోట్లు ఇస్తూ యువతను బీఆర్ఎస్ వైపు ఆకర్షించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

 కరీంనగర్​లో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయని, డబ్బు ఆశ చూపి ఇతర పార్టీల లీడర్లను బీఆర్ఎస్ లోకి లాగుతున్నారని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు పైసలిస్తామని ఆశ చూపి లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. చిట్టచివరి వ్యక్తిదాకా ప్రగతి ఫలాలు అందాలని దీన్ దయాళ్ కోరుకున్నారన్నారు. ఆయన చెప్పిన మాటలు అమలు చేస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు.