జాతిపిత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 162 సిల్ట్ కార్టింగ్ వెహికల్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శాంతియుతంగా పోరాటం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్... కులమతాలకు అతీతంగా ప్రజలకు పాలనను అందిస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలోనే దళితబంధు లాంటి స్కీమ్ పెట్టలేదన్నారు కేటీఆర్. కొంతమంది నాయకులు ఢిల్లీలో కూర్చొని నినాదాలు ఇస్తున్నారని, గాంధీ ఫోటోలు పెట్టుకోని ఫోజులు ఇవ్వడం తప్ప ఆచరణలో ఉండదని విమర్శించారు.
GHMC కార్మికులను గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు మంత్రి కేటీఆర్. సపాయన్నా నీకు సలాం అన్నా అని అన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. GHMC కార్మికులకు మూడుసార్లు జీతాలు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. కార్మికులను కడుపులో పెట్టుకోని చూసుకునే ప్రభుత్వం కేసీఆర్ ది అని అన్నారు. 162 వెహికిల్స్ కు కోటికి పైగా నిదులను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. దళితబంధు పథకం అందాల్సిన వాళ్లు ఇంకా లక్షల్లో ఉన్నారన్న మంత్రి - .. రాబోయే రోజుల్లో అందరికీ తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు.