జూన్ చివరిలోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీ

కాళేశ్వరం పర్యటన ముగించుకున్న తర్వాత సీఎం కేసీఆర్.. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో మంత్రులతో పాటు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సాగునీటి రంగం పై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా, సాగునీటి లక్ష్యాల సాధనకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాలను పునర్ వ్యవస్థీకరణ చేస్తామన్నారు సీఎం కేసీఆర్. సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలు ఒకే దగ్గర చేరుస్తామన్నారు. సాగునీటి ఇంజనీరింగ్ వ్యవస్థను 11 సర్కిళ్లుగా విభజించి.. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్ ఉంటారన్నారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాలలో ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశించారు.

ఏప్రిల్ నెలాఖరులోగా ఇరిగేషన్ అధికారులు, సిబ్బందికి క్వార్టర్స్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు సీఎం. 530 TMCల గోదావరి జలాలను ఎత్తి పోసేలా అధికారులు  సంసిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యచరణ సిద్ధం చేయాలని కోరారు. సాగునీటి కాలువలకు మే నెలాఖరులోగా అవసరమైన అన్ని మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. కరీంనగర్ తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ల స్థానంలో కొత్త కలెక్టరేట్ల నిర్మించాలన్నారు. కొత్త కలెక్టరేట్ లను మంజూరు చేయాల్సిందిగా సీఎస్ ను ఆదేశించారు సీఎం కేసీఆర్. నీటిపారుదల అధికారులతో పాటు.. జిల్లాకు చెందిన అన్ని శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.