
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించారు. ఫ్యాక్టరీ నిర్వహణకు కావాల్సిన నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వెంటనే విశాఖకు వెళ్లి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల్లో అధికారులు బృందం విశాఖకు వెళ్లనుంది. . వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సేకరించాలనుకుంటున్న నిధులెన్ని, తద్వారా తిరిగిచ్చే ఉత్పత్తులు లేదా నిధులను తిరిగిచెల్లించే విధానాలు, ఇతర నిబంధనలు, షరతులను కూలంకషంగా అధ్యయనం చేయనుంది.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ మార్చి 27న యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఈవోఐ దాఖలు చేసే సంస్థలు ఉక్కు లేదంటే ఉక్కు తయారీ ముడిపదార్థాల వ్యాపారం చేసి ఉండాలి. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని బట్టి చూస్తుంటే ఏపీలోని ఉత్తారాంధ్రపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ఉత్తారాంధ్రకు సెంటిమెంట్ గా ఉంది.
ఇప్పటికే టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు విశాఖ ఉక్కుపై ఉద్యమాలు చేస్తున్నాయి. వీటితోపాటు కమ్యూనిస్టులు రెండేళ్లుగా విశాఖ ఉక్కుపై ధర్నాలు, నిరసనలు చేస్తున్నాయి. తెలంగాణలో ఎటూ కమ్యూనిస్టులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని.. ఏపీలో విశాఖ ఉక్కుపై ఫోకస్ చేశారు సీఎం కేసీఆర్. ఈ పరిణామంతో బీఆర్ఎస్ పార్టీకి.. కమ్యూనిస్టులు ఏపీలోనూ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. ఉత్తరాంధ్రలో బీఆర్ఎస్ అడుగులు గట్టిగానే పడనున్నాయి. సీఎం కేసీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమంలోకి వస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేనలు ఎలా రెస్పాన్స్ అవుతాయి అనేది ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్రింగ్ డిస్కషన్ గా మారింది.