మంత్రి హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా టాస్క్

  • ఉమ్మడి జిల్లాపై బీఆర్ఎస్ పట్టు సాధించేందుకు బాధ్యతలు
  • లీడర్లు కారు దిగేందుకు సిద్ధమవడంతో దిద్దుబాటు చర్యలు 
  • 2018లోనూ బలమైన ప్రతిపక్ష నేతల్ని ఓడించే పని హరీశ్​కే

హైదరాబాద్, వెలుగు: మంత్రి హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా టాస్క్ అప్పగించారు. ఆ జిల్లాలోని బలమైన నేతలంతా కారు దిగుతుండటంతో ఎట్లాగైనా పట్టు నిలుపుకోవాలనే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నారు. అందుకే జిల్లాలో పార్టీని చక్కదిద్దే బాధ్యతను మరోసారి హరీశ్ చేతుల్లో పెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ ప్రతిపక్షంలో బలమైన నేతలను ఓడించే టాస్క్ హరీశ్ కే అప్పగించారు. ఇప్పుడు  ఖమ్మంలో బలమైన శక్తిగా బీఆర్ఎస్ ను మరోసారి నిలబెట్టే కీలక బాధ్యతలు కట్టబెట్టారు. దీనికి ఎంట్రీ పాయింట్ గా ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఇన్ చార్జీగా హరీశ్ ను రంగంలోకి దించారు. గులాబీ బాస్ ఆదేశాలతో హరీశ్ బుధవారం నుంచి ఖమ్మంలో పర్యటించనున్నారు.  జిల్లాలోని పది నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. బయటకు బహిరంగ సభ పేరు చెప్తున్నా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట ముఖ్య నేతలెవ్వరూ వెళ్లకుండా కట్టడి చేసే బాధ్యతను హరీశ్ కు అప్పగించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

ఖమ్మంలో మిగతా పార్టీలే స్ట్రాంగ్  

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు గాను ఒక్క చోటనే బీఆర్ఎస్ గెలిచింది. 2014 ఎన్నికల తర్వాత ఇతర పార్టీల్లో గెలిచి గులాబీ గూటికి చేరిన వారిలో ఒక్క పువ్వాడ అజయ్‌‌ మాత్రమే 2018 ఎన్నికల్లో గెలిచారు. మిగిలిన సిట్టింగులందరూ ఓడిపోయారు. రాష్ట్రం మొత్తం కారు జోరు కొనసాగినా.. ఖమ్మంలో మాత్రం కారు బోల్తా కొట్టింది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఖమ్మం పార్లమెంట్‌‌ను 2019లో మొదటిసారి గెలిచింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో పార్టీ చాలా కష్టపడి గెలిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ టీడీపీకి పట్టుంది. కాంగ్రెస్‌‌కు కూడా బలమైన నాయకత్వం ఉంది. జిల్లాలో బీఆర్‌‌ఎస్‌‌ కన్నా మిగతా పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంది. దీనికి తోడు పార్టీలోని బలమైన నేతలు కమలం గూటికి చేరడం దాదాపు ఖాయం అయ్యింది. ఈ పరిస్థితులను చక్కదిద్దకపోతే వచ్చే ఎన్నికల్లో చావు దెబ్బ తప్పదని గుర్తించిన కేసీఆర్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 

జిల్లా లీడర్లపై నమ్మకం లేకే.. 

2018కి ముందు రాష్ట్రంలో ఏ కీలక ఎన్నిక అయినా కేసీఆర్ ఆ టాస్క్ ను హరీశ్ కే ఇచ్చేవారు. 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఇన్‌చార్జీగా కేటీఆర్ వ్యవహరించారు. దుబ్బాక, హుజూరాబాద్​ బైపోల్ ఇన్‌చార్జీగా హరీశ్ కు, జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్ చార్జీగా కేటీఆర్‌కు గట్టిదెబ్బ తగిలింది. మునుగోడులో పార్టీ, ప్రభుత్వం మొత్తం మోహరించినా నామమాత్రపు గెలుపు దక్కింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వొద్దనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఖమ్మంలో ఈసారి కనీసం ఆరేడు ఎమ్మెల్యే స్థానాలు గెలవాలని భావిస్తున్నారు. అందుకే ఖమ్మం కేంద్రంగా బహిరంగ సభతో సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే, అక్కడి నేతలను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమనే హరీశ్ ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.