వరంగల్, వెలుగు : వరంగల్ నగరానికి సీఎం కేసీఆర్ రూ. 2,700 కోట్లు బాకీ ఉన్నారని రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ చెప్పారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం నగరంలోని విశాల్ భవన్‌లో పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంటకనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో వరంగల్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ మిగతా నిధులతో సంబంధం లేకుండా నగరానికి ఏటా రూ. 300 కోట్లు రిలీజ్ చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
తొమ్మిదేళ్లు అవుతున్నా ఆ నిధులు ఇవ్వడం లేదన్నారు. కుడా మాస్టర్ ప్లాన్‌ను మూడేళ్లుగా సీఎం కేసీఆర్ తన ఆఫీస్‌లోనే పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర సంపద మొత్తాన్ని గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌కు ఎయిర్‌పోర్టు, ఐటీ హబ్ ఇస్తామని చెప్పి మాట మార్చారన్నారు. కాకతీయ యూనివర్సిటీని నిర్వీర్యం చేశారని, మెగా టెక్స్‌టైల్ పార్క్ పేరుతో రెండు, మూడు కంపెనీలే వచ్చాయని, అందులోనూ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శించారు. గ్రేటర్ ముంపునకు పాలకుల తీరే కారణమని నాయిని రాజేందర్‍రెడ్డి అన్నారు.
వరంగల్‌ను ఆరు జిల్లాలుగా విభజించి ఎంతో నష్టం చేశారన్నారు. వరద నష్టంతో పాటు, కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన హామీల మేరకు ఫండ్స్‌ను రిలీజ్ చేయాలని కోరారు. ఈ నెల 25 వరకు ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. ప్రజా సంఘాల నేత తిరుణహరి శేషు, వివిధ పార్టీల లీడర్లు భిబిక్షపతి, నూనె అప్పారావు, కన్నం సునీల్, సయ్యద్ ఉల్లాఖాద్రీ, సోను రామ్మూర్తి, సాయిని నరేందర్, తిరుపతి యాదవ్, పిట్టల శ్రీనివాస్, మంద వీరస్వామి, బాబా ఖాదర్ అలీ, శివాజీ, నమిండ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, తోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.