రేవంత్ రెడ్డి అహంకారానికి హద్దుల్లేవు : సీఎం కేసీఆర్

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయని, ప్రజలెవరూ ఆగం ఆగం కావొద్దన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికల్లో నేతలు కాదు.. ప్రజలే గెలవాలన్నారు. మంచేదో చెడేదో ప్రజలు గమనించాలని కోరారు. మనదేశంలో ప్రజాస్వామ్య పరిణితి ఇంకా రాలేదన్నారు. తెలంగాణను బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లో కలిపారని చెప్పారు. ఉధృతమైన పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. మన తెలంగాణ మనకు ఉంటే ధనిక రాష్ట్రంగా ఉండేదన్నారు. తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని,  వాటిని పరిష్కరించుకుంటూ ఒక క్రమ పద్ధతిలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. 

అభ్యర్థి గుణగణాలు చూసి ఓట్లు వేయాలన్నారు కేసీఆర్. రాష్ట్రం వచ్చిన కొత్తలో  ముందుగా కరెంటు సమస్య పరిష్కరించుకున్నామన్నారు. దేశంలోనే 24  గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం మనదే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలోనూ 24 గంటల కరెంటు లేదన్నారు. మిషన్ భగీరథ ద్వారా మారుమూల గ్రామాలకు, తండాలకు నీరు అందిస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతలోనూ రాష్ట్రం పురోగమిస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం తీసుకురాని విధంగా రైతు బంధు, దళిత బంధు తీసుకొచ్చామన్నారు. ఇప్పటికే సీతారామ ప్రాజెక్టు 70 శాతం పూర్తైందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఎవరి భూములు వారిపేర్లపైనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదని అన్నారు. 

ధరణి పోర్టల్ తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు తెలియనిది కాదన్నారు. బాధ్యత లేని కాంగ్రెస్ పార్టీ.. రైతుల పట్ల ఏ మాత్రం సానుభూతి లేని పార్టీ నాయకులు ధరణి తీస్తేస్తామంటూ మాట్లాడుతున్నారని చెప్పారు. ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడి ( రేవంత్ రెడ్డి) అహంకారానికి హద్దులే లేవన్నారు. ఆయనకు ఉన్న అవగాహన, తెలివి ఏందో తెలియట్లేదన్నారు. రైతు బంధు దుబారా చేస్తున్నామంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు బంధు డబ్బులు దుబారానా..? అని ప్రశ్నించారు. 3 గంటల కరెంటు సరిపోతుందా..? అని అడిగారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 26  వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. వాటిపై ఉన్న కేసులను కూడా ఎత్తివేశామని చెప్పారు.
ALSO READ :- కార్తీకమాసంలో ఏ రోజు ఏ పూజ చేయాలంటే...