ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల కల సాకారం చేసిన సీఎం కేసీఆర్

పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. దశాబ్దాలుగా సాగు నీటి కోసం కలలు గంటున్న పాలమూరు జిల్లా ప్రజల కోరికను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నార్లాపూర్ వద్ద ప్రారంభించారు సీఎం కేసీఆర్. దశబ్దాలుగా దుమ్ము రేగిన భూములు  ఇప్పుడు కృష్ణమ్మ నీటితో సస్యశ్యామలం కానున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు సాగు, తాగు నీరు లేక గొంతెండిన ఉమ్మడి  నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజల గొంతు తడపనుంది.. దశాబ్దాలుగా ఫ్లోరైడ్ తో బాధపడుతున్న మునుగోడు నియోజకవర్గ ప్రజల దాహార్తిని పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు తీర్చునుంది. 

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును  ప్రారంభించారు సీఎం కేసీఆర్. నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న తొలి పంపును స్విచ్ ఆన్ చేసి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు సీఎం. అనంతరం పాలమూరు రంగారెడ్డి పైలాన్ ను ఆవిష్కరించారు.  అంజనగిరి రిజర్వాయ్ లోకి చేరిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్. 

పాలమూరు- రంగారెడ్డి ఎత్తి పోతల పథకం ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు లిఫ్ట్ చేసేలా ఎత్తిపోతలు, 6 జలాశయాల నిర్మాణం జరిగింది.  ఈ ప్రాజెక్టు ద్వారా 6 జిల్లాలో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగు, 1226 గ్రామాలకు తాగునీరు సౌకర్యం అందుతుంది. 

ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మ‌ల్లారెడ్డి, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డితో పాటు ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజ‌నీ కుమార్‌, స్మితా స‌బ‌ర్వాల్‌తో పాటు ఇరిగేష‌న్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.