తెలంగాణను కేసీఆర్​ నంబర్​ వన్​ చేసిండు : హరీశ్​ రావు

తెలంగాణను కేసీఆర్​ నంబర్​ వన్​ చేసిండు : హరీశ్​ రావు

హుస్నాబాద్, వెలుగు:  దేశంలో రాష్ట్రాన్ని కేసీఆర్​ నంబర్​వన్​గా నిలిపి, అద్భుత విజయాలు సాధించారని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఇప్పుడు ఆ అద్భుతాలకు, కాంగ్రెస్​ అబద్ధాలకు నడుమ ఎన్నికల్లో పోటీ వచ్చిందని, ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు. తెలంగాణపై బీజేపీకి బరువు లేదని, కాంగ్రెస్​కు బాధ్యత లేదని విమర్శించారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో  ఇంటిగ్రేటెడ్​ ఆఫీస్​ కాంప్లెక్స్​(ఐవోసీ)ను మంత్రి హరీశ్​రావు ఓపెన్​ చేశారు. 


అనంతరం అందులోని మీటింగ్ ​హాల్​లో మీడియా తో, ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు రాగానే టెంట్లు వేసి స్టంట్లు చేసేది కాంగ్రెస్​ పార్టీ అని విమర్శించారు. ‘‘గడ్డుకాలంలో తెలంగాణ పాలన పగ్గాలందుకున్న కేసీఆర్.. రాష్ట్రాన్ని నంబర్​వన్​గా నిలిపి, అద్భుత విజయాలు సాధించారు. ప్రజలు అద్భుతాలకు ఓటు వేస్తరా? కాంగ్రెస్​ అబద్ధాలను నమ్ముతరా? చెప్పాలి” అని అన్నారు. తెలంగాణలో డెవలప్​మెంట్​ను చూసి ఓర్వలేక కాంగ్రెస్​ నాయకులు సీఎం కేసీఆర్​ను తిడితే, కేసీఆర్​ మాత్రం  ప్రజలకు మందులు, పోషకాహార కిట్లు ఇస్తున్నారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలోళ్లు కాళ్లల్ల కట్టెవెట్టినా తాము గౌరవెల్లి ప్రాజెక్టును కట్టి తీరినమని తెలిపారు. కొద్దిరోజుల్లోనే సీఎం కేసీఆర్​ ప్రాజెక్టు కట్క వొత్తి పంటలకు నీళ్లు విడుదల చేస్తారన్నారు. తొమ్మిదేండ్లలో హుస్నాబాద్​ నియోజకవర్గంలో రూ.7,752 కోట్ల పనులు చేసినట్టు వివరించారు.  

ALSO READ: రేపే(సెప్టెంబర్ 15న) టెట్.. నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ

ఈ నెల 16న సీఎం కేసీఆర్​ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారని, దీనిని చూసి ప్రతిపక్షాలు ఆగమవుతున్నాయన్నారు. కాంగ్రెస్​ డిక్లరేషన్లను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. ‘‘2009లో కాంగ్రెస్​ మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదు” అని ఆరోపించారు. అబద్ధాల కాంగ్రెస్​కు అభివృద్ధిలో అద్భుతాలు చేసిన బీఆర్​ఎస్​కు మధ్య పోటీ ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ బిచానా ఎత్తేసిందని, ఆ పార్టీ జమిలీ ఎన్నికలను నమ్ముకుంటే తాము ప్రజలను నమ్ముకున్నామని అన్నారు. 

దేశంలో కేసీఆర్​ను మించిన హిందువు ఉన్నరా?

‘‘సీఎం కేసీఆర్​ నిఖార్సయిన హిందువు. దేశంలో ఆయనను మించిన హిందువు ఎవరూ లేరు” అని హరీశ్​ తెలిపారు. హుస్నాబాద్​ మండలం పొట్లపల్లిలో రూ. 40 లక్షలతో రామాలయ పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి, మాట్లాడారు. అందరూ హిందువు అని ప్రదర్శనలకే పరిమితమైతే కేసీఆర్​ ఆచరణలో అసలైన హిందువు అని నిరూపించుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్​కు దైవభక్తి ఉంది కనుకనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటున్నదని అన్నారు.  పొట్లపల్లిలోని -శివాలయ గాలి గోపురం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.