
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు … తన మిత్రుడు, నిజామాబాద్ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వేంకటేశ్వరరావును కలిశారు. పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ఆహ్వానంతో…. మండవ వేంకటేశ్వరరావు టీఆర్ఎస్ లోచేరేందుకు నిర్ణయించుకున్నారు.
ఈ మధ్యాహ్నం సికింద్రాబాద్ పాస్ పోర్టు ఆఫీసుకు వెళ్లారు సీఎం కేసీఆర్. విదేశాల్లో పర్యటించేందుకు వీలుగా డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ కోసం ఆయన సికింద్రాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పని ముగిసిన తర్వాత.. నేరుగా టీడీపీ సీనియర్ నేత మండవ వేంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు కేసీఆర్. మండవతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ తో కలిసి పనిచేయాలని.. టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు మండవ ఈ సందర్భంగా ప్రకటించినట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
మండవ వేంకటేశ్వరరావుతో ఈ ఉదయం కొందరు టీఆర్ఎస్ నాయకులు సమావేశం అయ్యారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మరికొందరు నేతలు కూడా మండవతో సమావేశమై చర్చించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వేంకటేశ్వరరావుతో సమావేశమయ్యారు. పార్టీలోకి చేర్చుకునే అంశంపై చర్చించారు. ఒకట్రెండు రోజుల్లోనే మండవ వేంకటేశ్వర రావు టీఆర్ఎస్ లో చేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మండవ.. నిజామాబాద్ కు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా సేవలందించిన ఆయనకు.. నిజామాబాద్ జిల్లాలో మంచి పట్టు ఉంది. డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లనుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగానూ పనిచేశారు. మధ్యలో రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఉత్సాహం చూపించినా పొత్తులో భాగంగా మండవకు నిజామాబాద్ రూరల్ టీడీపీ టికెట్ దక్కలేదు.
టీడీపీలో ఉన్నప్పటినుంచి కేసీఆర్, ఎం.వేంకటేశ్వరరావు ఇద్దరూ మంచి మిత్రులు. ఇద్దరి మధ్య టీడీపీలో 25 ఏళ్ల స్నేహం, అనుబంధం ఉంది. ఆ తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించారు. సెటిలర్ అయిన మండవ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా.. కేసీఆర్ ఆహ్వానించడంతో.. టీఆర్ఎస్ లోకి రావాలని నిర్ణయించుకున్నారు.
నిజామాబాద్ లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ .. మండవ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం… రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.