నవంబర్ 5న ఖమ్మంలో సీఎం కేసీఆర్​ సభ

ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలో ఆదివారం నిర్వహించే బీఆర్ఎస్​ ప్రజా ఆశీర్వాద సభకు ఆదివారం సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఎస్ఆర్​అండ్​ బీజీఎన్​ఆర్​ కాలేజీ గ్రౌండ్​ లో మధ్యాహ్నం 2 గంటలకు సభ జరుగనుంది. సభా ఏర్పాట్లను శనివారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ గుండాల కృష్ణ పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ బహిరంగ సభకు ఖమ్మం నగర ప్రజలు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. గ్రౌండ్​ లో వాకర్స్​ కోసం నిర్మించిన వేదికను సీఎం కేసీఆర్​ భద్రత దృష్ట్యా తొలగించామని, మీటింగ్ తర్వాత దాన్ని యథాప్రకారం నిర్మిస్తామని చెప్పారు.

దీని కోసం కోసం రూ. 1 లక్షను కాలేజీ అకౌంట్ లో డిపాజిట్ చేశామని, ఇది తెలియని కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఎంపీ నామా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్​ను బలపర్చేందుకు ప్రజలు ఓటుతో మద్దతివ్వాలని కోరారు. వారి వెంట మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, మార్కెట్ చైర్ పర్సన్​ దోరేపల్లి శ్వేత, జహీర్ అలీ, టౌన్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.  

కొత్తగూడెంలో... 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీఎం కేసీఆర్​ మూడోసారి కొత్తగూడెం రానున్నారు. పట్టణంలో ఆదివారం పర్యటించనున్నారు. ప్రకాశం స్టేడియంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. సభా ఏర్పాట్లను కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్​ఎస్​ అభ్యర్థి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు.