హుజూరాబాద్​పై కేసీఆర్​ అతిప్రేమ ఈటలకే ఫాయిదా

కొద్ది రోజులుగా హుజూరాబాద్‌ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్‌‌ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతో ఈటల ఇమేజీ అమాంతం పెరిగిపోతోంది. హుజూరాబాద్ లో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వరుసగా పూర్తిచేస్తున్నారు.  దళితబంధు పథకానికి పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ను ఎంపికచేయటం, రెండో విడత గొర్రెల పంపిణీ, దళిత కాలనీల్లో సౌలతుల ఏర్పాటు, భవనాల నిర్మాణాలకు నిధులు, పెండింగ్ లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ డబ్బులు చెల్లించడం, రోడ్లు వేయించటం లాంటివన్నీ చకచక జరిగిపోతున్నాయి. కేవలం ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చుపెడుతోంది. ఇదంతా చూసిన తర్వాత ఈటలను ఓడించలేమనే భయంతోనే నియోజకవర్గ ప్రజలపై కేసీఆర్ ప్రేమ చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలు పరిశీలిస్తే సీఎం కేసీఆర్ వైఖ‌‌రిపై అందరిలో అనుమానాలు కలుగుతున్నాయని స్పష్టమవుతోంది. మంత్రివర్గం నుంచి ఈటల బహిష్కరణ, ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి కేసీఆర్ ప్రతిరోజూ హుజూరాబాద్ నియోజకవర్గం జపం చేస్తున్నారు. త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఎలాగైనా ఈటలను ఓడించాలని కేసీఆర్‌‌ పట్టుదలగా ఉన్నారు. మరోవైపు మళ్లీ తానే గెలవాలని ఈటల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈటలను ఓడించే విషయంలో కేసీఆర్ మొండిపట్టును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

బీసీలపై అనుమానంతో ఎస్సీ ఓట్లపై దృష్టి
హుజూరాబాద్​లో బీసీల ఓట్లు లక్షదాకా ఉన్నాయి. ఈటల కూడా బలమైన బీసీ నేత కావడంతో బీసీల్లో అత్యధికులు ఈటలకే మద్దతుగా నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. బీసీల ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్ కు పడేది అనుమానమవటంతోనే కేసీఆర్ దృష్టి ఎస్సీల ఓట్లపై పడింది. ఇక్కడి ఎస్సీ నేత బి.శ్రీనివాస్​ను ఎస్సీ కొర్పొరేషన్ కు చైర్మన్ చేశారు. మరోవైపు రెడ్లను ఆకట్టుకునేందుకే పార్టీలో చేరిన పదిరోజులకే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేశారు. ఇపుడు ఉపఎన్నిక వచ్చింది కాబట్టే, ఈటలను ఓడించాలనే పట్టుదల వల్లే నియోజకవర్గంలో కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కాబట్టి నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీలతో పాటు ఇతర సామాజికవర్గాల ఓట్లు ఎవరికి పడతాయనేది సస్పెన్సుగా మారింది. 

దళితులపై ఒక్కసారిగా  ప్రేమ
హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ దళిత బంధు ముందుకు తీసుకొచ్చారు. ఈటలను ఓడించడం కోసం కేసీఆర్​ సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు దీంతో స్పష్టమవుతోంది. ఈ పథకం ద్వారా ఆ నియోజకవర్గంలో ఉన్న 50 వేల పైచిలుకు ఎస్సీ ఓట్లలో కనీసం 25వేలు టీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవాలని నానా తిప్పలు పడుతున్నారు కేసీఆర్. మరోవైపు ఈ ఎత్తుగడ విక‌‌టించే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఓట్ల కోసమే దళితులపై కేసీఆర్ కు హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందని ఆ వర్గాల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి దళితులపై వరాల జల్లు కురిపించారు. దళితుల అభ్యున్నతి కోసం ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయనున్నట్లు గా ప్రకటించారు. యాదాద్రి జిల్లాలో వాసాలమర్రి ని దత్తత తీసుకున్న కేసీఆర్​ ఆ ఊర్లో ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇచ్చిన వైనాన్ని చూశాం. ఆ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేయడం కోసం కరీంనగర్ కలెక్టర్ ఖాతాలో రూ.500 కోట్లు జమ చేసినట్లు జీవో విడుదల చేశారు.

అధికార పార్టీ నేతలకేనా 
దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ  నేతలు, కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పథకానికి అసలు విధివిధానాలు రూపొందించారా?..  అనే అనుమానాలు కలుగుతున్నాయి. దళితులపై ప్రేముంటే రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ రూ.10 లక్షలు కేటాయించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే దళితులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకు లోన్ లు ఇప్పించాలి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి భర్తీ కానీ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. జస్టిస్ పున్నయ్య కమిటీ, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలి. ఏడేండ్లలో దళితుల అభివృద్ధికి చేపట్టిన ఏ పనీ సరిగ్గా పూర్తి చెయ్యని టీఆర్ఎస్ సర్కారు..  ఎత్తుకున్న దళిత సాధికారత రాగం కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల ఊరింపే అని ఆ వర్గాలు అనుకుంటున్నాయి.

దళితులకిచ్చిన హామీలెన్ని.. అమలెట్లుంది
2014 ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి దళితుడిని మొదటి సీఎం చేస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్.. ఆ తర్వాత తనే ముఖ్యమంత్రి పీఠమెక్కారు. ఆ తర్వాత దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకూ 6890 మందికి 16.418 ఎకరాల భూమి మాత్రమే ఇచ్చారు. ఈ పథకం అమలై ఉంటే మూడు లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి జరిగేది. ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్ నిధుల్లో చాలా వరకు పక్కదారి పట్టించారు. నికరంగా ఆ వర్గాలకు ఖర్చుచేసింది చాలా తక్కువే. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, లోయర్ ట్యాంక్ బండ్ లో 15 అంతస్థుల అంబేద్కర్ టవర్స్, దళితులకు ఇంటి జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు సాయం చేస్తానన్న హామీలేవి అమలు కాలేదు. ఇవన్నీ టీఆర్​ఎస్ ప్రభుత్వం దళితులకు చేసిన పెద్ద మోసంగా చూడాల్సి ఉంటుంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో దాదాపు 64,48258 మంది దళితులు ఉన్నారు. అంటే రాష్ట్రంలో జనాభా దాదాపు 18. శాతం ఇందులోని దాదాపు సగం మందికి గుంట భూమి కూడా లేదని సమాచారం. దీంతో రాష్ట్రంలో దళితుల జీవితాలు ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

- మన్నారం నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్ సత్తా పార్టీ