జాతీయ రాజకీయాల..దూకుడు తగ్గిందా?

చాక చక్య రాజకీయ నాయకుడిగా పేరు ఉన్న కేసీఆర్.. జాతీయ పార్టీ ఉంటేనే తనకు బలం చేకూరుతుందని గ్రహించారు. అందుకే ఆయన ఎన్ని విమర్శలొచ్చినా ధైర్యంగా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌గా మార్చారు. అప్పటి నుంచి జాతీయ స్థాయిలో మహాయుద్ధాలు జరుగుతాయనుకున్నారు. తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా మారింది.. ఇక భారతదేశాన్ని మారుస్తానని కేసీఆర్ అన్నారు. కానీ అకస్మాత్తుగా ఆయన సైలెంట్​అయిపోయారు. కేసీఆర్ మౌనంగా ఉంటూ పోరాటానికి సిద్ధం చేసుకున్న మహా ఖడ్గాన్ని ఆయన దాచుకున్నారు. కేసీఆర్ సీరియస్​గానే ఉన్నారా అని, నిజంగానే ఆయన దగ్గర జాతీయ యు ద్ధం చేయడానికి పదునైన కత్తి ఉందా ? లేదంటే ఆయనది‘సినిమా కత్తి’ మాత్రమేనా? దేశమంతటా తిప్పుతానని కేసీఆర్ చెప్పిన ‘న్యాయం’ అనే కత్తి ఇప్పుడు ఎక్కడున్నదనేది చర్చనీయాంశంగా మారింది.

 కేసీఆర్ అనుచరులు చాలా మంది భారతదేశం అంతటా వెళ్లి.. కేసీఆర్ తెలంగాణను ఎలా బంగారుమయం చేశారో, భారతదేశాన్ని కూడా బంగారుమయం చేస్తార ని ఆయన సందేశాన్ని ప్రచారం చేశారు. అయితే విచిత్రమేమిటంటే కేసీఆర్ కత్తిలా ఇప్పుడు ఆయన అనుచరులు కూడా దాక్కుంటున్నారు. కేసీఆర్ చాకచక్యంతో మౌనంగా ఉండడానికి కారణం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉన్నప్పుడు తాను దేశవ్యాప్తంగా పోరాడలేనని కేసీఆర్ గ్రహించారు. జైలులో ఉన్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌‌‌‌ భయభ్రాంతులకు గురవుతున్న దృశ్యం కేసీఆర్‌‌‌‌ను హెచ్చరించినట్టేనా?  పిరికితనం కంటే చావును కూడా లెక్కచేయని రాజపుత్రులతో కేసీఆర్​ను పోలుస్తూ పొగిడిన వారు కూడా ఇప్పుడు మౌనంగా ఉన్నారు. కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యారని విపక్ష నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ఎప్పుడూ ఒక ఆంగ్ల సామెతను చెబుతుంటేవారు. సమస్యను ఇగ్నోర్​ చేస్తే అదే పోతుందులే అన్నట్లు.. కేసీఆర్​ కూడా మౌనంగా ఉన్నారేమో ?

విపక్షాల సభకు వెళ్లడం లేదు!

విపక్షాల నాయకత్వానికి కాంగ్రెస్‌‌‌‌ పనికిరాదని, దాన్ని ఎదిరించిన కేసీఆర్.. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఏర్పాటుతో తనను తాను జాతీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే బీఆర్‌‌‌‌ఎస్ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించి ప్రతిపక్ష నేతలను కలిశారు. అందులో భాగంగానే కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో చర్చలు జరిపారు. ఇరు నేతల భేటీ మీడియాలో అత్యంత ప్రాధాన్యత గల అంశంగా ప్రచారమైంది. దాంతో కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామితో కలిసి కేసీఆర్ దిమ్మతిరిగే పోరాటం చేస్తారని అందరూ భావించారు. కానీ కేసీఆర్ కుమారస్వామిని పక్కనబెట్టగా, కర్నాటక ఎన్నికలను అసలే పట్టించుకోలేదు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్​కు కోపం తెప్పించడం బహుశా ఆయనకు ఇష్టం లేదేమో! రాహుల్​అనర్హత వేటు, అదానీ హిండెన్​బర్గ్ ​విషయంలో ఢిల్లీలో కాంగ్రెస్‌‌‌‌ పార్టీతో పోరాడేందుకు కేసీఆర్ తన ఎంపీలను పంపారు. 

దాన్ని బట్టి కేసీఆర్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌తో పోట్లాడరనే సంకేతం వెలువడింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జూన్ 23న పాట్నాలో భారీ ప్రతిపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దానికి కేసీఆర్ హాజరు కావడం లేదు. ఆయన హస్తం పార్టీతో కలవకపోవడానికి తెలంగాణ ఎన్నికలు ముగిసే వరకు కాంగ్రెస్‌‌‌‌తో పొత్తుపెట్టుకున్నట్లు చూడకూడదనేది ఒక్కటే కారణం కావొచ్చు. తాజాగా మహారాష్ట్రలో కేసీఆర్ సభలు నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ పంచాయతీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తానని చెప్పారు. కేసీఆర్ తీరుపై సీనియర్ నేత శరద్ పవార్ తదితరులు మండిపడుతున్నారు. అయిదు నెలల్లో తెలంగాణకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతానికి బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ దూరంగా ఉంటూనే ప్రజల వద్దకు వెళ్లాలని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌‌‌‌తో దోస్తీ కట్టాలని కేసీఆర్​ భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌‌‌లో కాంగ్రెస్ అరెస్టులకు డిమాండ్ చేస్తుందని పూర్తిగా తెలుసు కాబట్టి, కేసీఆర్ కాంగ్రెస్ నేతలను దుర్భాషలాడటం మానేశారు. ప్రస్తుతం కేసీఆర్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌కు మిత్రుడు, శత్రువు కూడా.

కేసీఆర్ ​ముందు ఉన్న ప్లాన్స్

కేసీఆర్ చాలా కోణాల్లో పోరాడాలని కోరుకోవడం లేదు. కాంగ్రెస్, బీజేపీ రెండింటితో ఎందుకు పోరాడాలి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల రాజకీయంగా నష్టపోకుండా ప్రతిపక్షాలు తనకు ఆశ్రయం ఇస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన దేశ పొలిటికల్​టూర్​లను నిలిపివేశారు. తెలంగాణ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని గులాబీ బాస్ ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే కత్తి దూస్తారు. ఓడిపోతే కత్తి విసిరేస్తారు. తెలంగాణలో కేసీఆర్‌‌‌‌కు గెలుపు కీలకం. కేసీఆర్ ఓడిపోతే ఆయనకు నమ్మకమైన అనుచరులంతా కనుమరుగై, ఆయన అధికారులంతా పారిపోతారు. ఇలాంటి పరిస్థితి ఆయన తెచ్చుకోరు. చాలా రాష్ట్రాల్లో కేసీఆర్ నిశ్శబ్దంగా నేతలను చేర్చుకుంటున్నారు. తెలంగాణలో ఓడిపోతే, ఆ నాయకులను కుమారస్వామిలా మరిచిపోతారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేయలేరు. 

స్టాలిన్, మమతా బెనర్జీ, థాక్రే, శరద్ పవార్, నితీష్ కుమార్‌‌‌‌లతో కేసీఆర్ ఎలా పోరాడగలరు? కాంగ్రెస్‌‌‌‌ బలంగా ఉన్న రాజస్థాన్‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లలో కూడా కేసీఆర్‌‌‌‌ ఎన్నికల్లో పోరాడేందుకు సాహసించకపోవచ్చు. దేశ భవిష్యత్ మార్చేందుకు వచ్చిన వీర యోధుడు కేసీఆర్ అని చాలా మంది అనుకున్నారు ! కానీ ఆయన ఇప్పుడు పోరాడటానికి ముందుకు రావడం లేదు. సమకాలీన రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తులు మనకు గొప్ప రాజకీయ యోధులుగా కనిపిస్తారు. అందులో ఒకరు కేసీఆర్, మరొకరు కేజ్రీవాల్. వీళ్లు ఇప్పుడు స్విట్జర్లాండ్​ సైన్యంలా మారారు. ఆ సైన్యానికి గొప్ప యూనిఫామ్, ఆయుధ సంపత్తి, సాంకేతికత ఉంటుంది.. కానీ ఎప్పుడూ యుద్ధాలు చేయదు. స్విస్​ సైన్యం వందల ఏండ్లుగా 
పోరాడడం లేదు.

తెలంగాణ ఎన్నికల తర్వాత ఏంటి?

తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే మళ్లీ జాతీయ స్థాయిలో యుద్ధాల ప్రణాళికలు మొదలవుతాయని నా అంచనా. సమయం, ఆటుపోట్లు ఎవరి కోసం వేచి ఉండవు అన్నట్లు.. బహుశా కేసీఆర్ ఇప్పటికే తన చారిత్రాత్మక జాతీయ స్థాయి రాజకీయ అవకాశాన్ని కోల్పోయి ఉండవచ్చు. కర్నాటక ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌ బరిలోకి దిగే గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. కేసీఆర్ తన ఛాన్స్ మిస్ చేసుకున్నారో లేదో కాలమే సమాధానం చెప్పాలి. కచ్చితంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసీఆర్, కేజ్రీవాల్ ఇద్దరినీ ప్రభావితం చేసింది. సమస్య నుంచి ఇద్దరూ పారిపోవడం బాధాకరం. ఇంగ్లండ్‌‌‌‌లో భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ కూడా పారిపోయి ఉంటే, అతను ప్రధాని అయ్యేవాడు కాదు. అదృష్టం ఎప్పుడూ ధైర్యవంతుల వెంటే ఉంటుందంటారు.

- డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్