తెలంగాణ ఆవిర్భవించి ఆరేండ్లు పూర్తయింది. పోరాడి.. కొట్లాడి.. ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకొచ్చి, గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్ పాలనకు కూడా ఆరేండ్లు పూర్తి కావస్తోంది. ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ.. వారి ఆకాంక్షలను నీరుగారుస్తూ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నది. రాష్ట్రం ఏర్పడితే అన్ని సమస్యలు, వెనుకబాటుతనం పరిష్కారమై ‘బంగారు తెలంగాణ’గా మారుతుందని చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలాయి. ఆరేండ్లలో రాష్ట్రం సమగ్రాభివృద్ధికి నోచుకోలేదు. నియంతృత్వ, అవకాశవాద పోకడలతో పాలన సాగుతోంది.
వ్యవ‘సాయం’అందడం లేదు
ఏ ఒక్క రైతు వ్యవసాయం వల్ల నష్టపోకుండా లాభసాటిగా చేస్తానని రెండోసారి అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతుల పంటకు మద్దతు ధర ఇప్పిస్తామని, ఆత్మహత్యలు జరగకుండా నివారిస్తామని హామీనిచ్చారు. రాష్ట్రంలో 57,88,644 మంది రైతులుండగా.. ఇందులో 7,97,868 మంది రైతులు ఇప్పటి వరకూ రైతుబంధు లబ్ధి పొందలేదు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకపోతే రైతుబంధు నిలిపివేస్తామని, మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయమని రైతులను బెదిరిస్తుండటం సిగ్గుచేటు.
ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టారు
రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కోటి ఎకరాలకు సాగు నీరందిస్తామని, అనేక ప్రాజెక్టులకు రీ-డిజైన్, రీ-ఎస్టిమేట్స్ చేసి రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టి, మరో రూ.20 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. ఏయే ప్రాజెక్టులపై ఎంత ఖర్చు పెట్టారు? ఏ ప్రాజెక్టు ఎన్ని ఎకరాలకు నీరందిస్తుందో? వైట్పేపర్ రిలీజ్ చేయాలి. మిషన్ కాకతీయకు రూ.2,600 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా అనేక చెరువుల మరమ్మతులు మిగిలే ఉన్నాయి. మిషన్ భగీరథ పేరుతో రూ.50 వేల కోట్లు ఖర్చు చేసినా.. ఇంటింటికీ నల్లా కాదు కదా ఇంకా కొన్ని గ్రామాలకే నీరందడం లేదు.
భూపంపిణీ ఆమడదూరం
దళిత, గిరిజనులకు భూపంపిణీ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించి అమలులో ఆమడదూరంలో ఉన్నారు. రాష్ట్రంలో 3 లక్షల మంది భూమి లేని దళితులుండగా.. ఈ ఆరేండ్లలో 6,104 కుటుంబాలకు 15,447.74 ఎకరాలనే పంపిణీ చేశారు. గిరిజనులకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2.16 లక్షల మందికి 13.04 లక్షల ఎకరాలు పట్టాలు ఇవ్వాల్సి ఉండగా లక్ష మందికి 8.47 లక్షల ఎకరాలకే పట్టాలిచ్చారు. కానీ ప్రభుత్వం పట్టాలిచ్చిన భూములనే చెట్ల పెంపకం పేరుతో లాక్కొనేందుకు ప్రయత్నిస్తోంది. పోడు భూముల సమస్యపై ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి.
ఇంటికో ఉద్యోగం ఏదీ?
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటనలు చేశారు. ఇప్పుడు మాత్రం అసలు ఇంటికో ఉద్యోగం ఇవ్వడం ఎలా సాధ్యమంటూ వితండవాదం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా.. వాటిని భర్తీ చేయడం లేదు. కనీసం నిరుద్యోగభృతి కూడా ఇవ్వడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో ఏండ్ల తరబడి పని చేస్తున్నారు. వారిని పర్మినెంట్ చేయకుండా చాలీచాలని జీతాలతో పని చేయించుకుంటూ అన్యాయం చేస్తున్నారు.
బడులమూత దిశగా..
పేద స్టూడెంట్లకు విద్యను దూరం చేసేలా ప్రభుత్వ చర్యలున్నాయి. కేజీ టు పీజీ వరకూ ఉచిత విద్యనందిస్తామని చెప్పి.. అనేక ప్రభుత్వ బడులే మూసేయడానికి సిద్ధమవుతోంది. మరోవైపు ప్రైవేటు ఇనిస్టిట్యూషన్లకు పెద్ద ఎత్తున అనుమతులిస్తున్నారు. హాస్టల్ స్టూడెంట్లకు మెస్ ఛార్జీలు పెంచకుండా, ఇచ్చే నిధులను కూడా ఇవ్వడం లేదు.
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలే
ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఆశ కల్పించారు. అక్కడక్కడ కొన్ని మోడల్ హౌస్లు కట్టి వాటినే చూపిస్తూ.. అందరికీ ఇండ్లు ఇస్తున్నామని భ్రమలకు గురి చేస్తున్నారు.
– జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
For More News..