బీఆర్ఎస్ గెలిస్తే రైతు బంధు రూ.16 వేలు ఇస్తాం : సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రైతుబంధు రూ. 16 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఎలా ఉందో.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలన ఎలా ఉందో ఆలోచించాలని పేర్కొన్నారు.

ఎన్నికలు అనగానే ఎందరో వస్తున్నారు.. ఏవేవో మాట్లాడుతున్నారని ఎన్నికల ముందు ఆగమాగం కావద్దని.. ఓటు వేసేముందు అన్నీ ఆలోచించి వేయాలని కేసీఆర్ చెప్పారు. నియోజకవర్గం బాగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని సూచించారు. మంది మాటలు విని ఆగమైతే ఐదేళ్లపాటు కష్టాల పాలవుతారని అన్నారు. నిజానిజాలు గమనించి ఓటు వేయాలని కేసీఆర్ ప్రజలను కోరారు. 

24 గంటల కరెంట్ వద్దని.. 3 గంటలు చాలని.. పీసీసీ అధ్యక్షుడే బల్లగుద్ది చెబుతున్నాడని కేసీఆర్ తెలిపారు. 50 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పరిపాలన చేసింది.. మన బతుకులు మారాయా అని ప్రజలను ప్రశ్నించారు. వ్యవసాయం మీద రేవంత్ రెడ్డికి అవగాహన లేదని చెప్పారు. కాంగ్రెస్ కు చాలా అవకాశాలు ఇచ్చామని తెలిపారు. ధరణిని రద్దు చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేసీఆర్ అన్నారు.