ధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తారా?.. అది భూమాతనా.. భూమేతనా?...: కేసీఆర్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తారట.. మరి రైతుబంధు ఎలా ఇస్తారని సీఎం కేసీఆర్ నిలదీశారు. భూమాత తెస్తారట.. అది భూమాతనా.. భూమేతనా... అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామని 2004లో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని తెలిపారు. అలుపెరుగక పోరాటం చేస్తే కాంగ్రెస్ దిగొచ్చి.. తెలంగాణను ఇచ్చిందని చెప్పారు. 

నల్గొండ జిల్లా నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా ప్రజాఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ జిల్లా వట్టికోట ఆళ్వారుస్వామి పుట్టిన జిల్లా అని సీఎం కేసీఆర్ అన్నారు. 

తెలంగాణ వచ్చిననాడు తాగు, సాగునీళ్లు లేవు.. కరెంట్ లేదని కేసీఆర్ చెప్పారు. పేదల సంక్షేమానికి మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చినమని.. విధివంచితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. 

ఎవరు ప్రజల కోసం పనిచేస్తారో ఆలోచన చేయాలని.. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోమన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే.. రైతుబంధు ఎకరాకు రూ. 16వేలకు పెంచుతామని వెల్లడించారు. ఓటు వేసే ముందు ఓటర్ల అంతా గ్రామాల్లో చర్చలు జరిపి.. పార్టీ అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.