30 ఏళ్ల క్రితమే భూ భారతి వచ్చింది.. దానివల్ల ఏమీ కాలేదు: కేసీఆర్

30 ఏళ్ల క్రితమే భూ భారతి వచ్చింది.. దాని వల్ల ఏమీ కాలేదు.. అందుకే ధరణి తెచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు ఏ పద్దతిలో వస్తాయని నిలదీశారు. ధరణి లేకపోతే లంచాలు, దళారులు వస్తారని చెప్పారు. గడప దాటకుండా.. ఏ దరఖాస్తు పెట్టకుండా డబ్బులు వస్తున్నాయని.. ధాన్యం కొన్న డబ్బులు కూడా ఖాతాలో పడుతున్నాయని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నీ తారుమారు అవుతాయని తెలిపారు. 

కాంగ్రెస్ వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తారు.. 10 హెచ్ పీ మోటర్ ఎవరు కొనాలని ప్రశ్నించారు. రైతుబంధు ఎత్తేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుందని.. ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేనని కేసీఆర్ అన్నారు. రైతుల కష్టాలు తీరేలా ఒక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రమంతా రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నామని చెప్పారు.

తెలంగాణ అప్పుడెట్లా ఉండే.. ఇప్పుడెలా ఉందో ఆలోచించాలని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే మోసపోతారని.. రాష్ణ్రాన్ని ప్రగతిపథంలో ఎవరు తీసుకెళ్తారో ఆలోచించి ఓటు వేయాలని.. లేకపోతే ఐదేళ్లు నష్టపోతారని తెలిపారు. 

ఎన్నికలు వచ్చాయని ఆగం కావొద్దని.. వెయ్యి కోట్లతో కొండగట్టును అభిృద్ధి చేస్తామని..అంజన్న దీవెనలు బీఆర్ఎస్ కి ఉండాలని కేసీఆర్ కోరారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేశామని తెలిపారు. ఈ పదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశామని.. రైతాంగానికి సాగునీరు ఉచితంగా ఇచ్చామని.. రైతు బంధు పేరుతో రైతులకు సాయం అందించామని కేసీఆర్ తెలిపారు.