టార్గెట్ కాంగ్రెస్... ప్రగతి భవన్లో ఆరు వార్ రూంలు

టార్గెట్ కాంగ్రెస్... ప్రగతి భవన్లో ఆరు వార్ రూంలు
  • వ్యూహాలకు పదును పెడుతున్న కేసీఆర్
  • పలువురు డీసీసీ చైర్మన్ల్ తో నేతల కాంటాక్ట్
  • టికెట్ రాకుంటే కండువా కప్పేలా ప్లాన్స్
  • లేదా రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దింపే యోచన
  • ఓట్లు చీలితే గెలుపు సునాయసమన్న ఎత్తుగడ
  • తిరుగుబాట అభ్యర్థి గెలిస్తే పార్టీలో  చేర్చుకొనే ప్లాన్
  • హ్యాట్రిక్ లక్ష్యంగా వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు

హైదరాబాద్: వైరల్ ఫీవర్ నుంచి తేరుకున్న కేసీఆర్ ఎన్నికల హోం వర్క్ లో బిజీ బిజీగా ఉన్నట్టు సమాచారం.  గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ ఆరు వార్ రూంల నుంచి కార్యాచరణ ప్రారంభించినట్టు సమాచారం. సెగ్మెంట్ల వారీగా సర్వే నివేదికలు పరిశీలిస్తూనే.. వీక్ గా ఉన్న చోట్ల బలమైన ప్రత్యర్థి ఎవరు..? ఎలా దారికి తెచ్చుకోవాలి..? ఎవరిని రంగంలోకి దించితే పనిజరుగుతుంది..? అనే అంశాలపై స్టడీ చేస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో సదరు అభ్యర్థి బలాలు, బలహీనతలపైనా ఓ నజర్ వేశారు. దారికి రాని పక్షంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తే వర్కవుట్ అవుతుందనే అంశాలపైనా ఆరా తీస్తున్నట్టు  సమాచారం. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఫాంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ మీటింగ్ ఏర్పాటు.. ఆరు గ్యారెంటీల ప్రకటన జోష్ నింపాయి. పలు సర్వేలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటంతో గులాబీ బాస్ పూర్తి స్థాయిలో అలెర్టయ్యారు. 

ప్రగతి భవన్ లో ఆరు వార్ రూంలు

సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ఆరు వార్ రూంలు  నడుస్తున్నాయి. అభ్యర్థులకు ఎదురవుతున్న నిరసనలు, నిలదీతలు పరిశీలిస్తూనే.. వీక్ గా ఉన్న గ్రామాల్లో ప్రగతి భవన్ డైరెక్షన్ లో సర్వేలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నిరసనల వెనుక ఉన్నదెవరు..? వారిని ఎలా దారికి తెచ్చుకోవాలనే అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు  సమాచారం. పలు సెగ్మెంట్లలో అసంతృప్త నేతలను దారికి తెచ్చుకొనేందుకు అప్పటికప్పుడు నామినేటెడ్  పదవులను కేటాయించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా  వ్యూహరచన కొనసాగుతున్నదని తెలుస్తోంది.  ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులనే టార్గెట్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే మేడ్చల్ మల్కాజ్ గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ను పార్టీలో చేర్చుకున్న బీఆర్ఎస్. రెండు రోజుల వ్యవధిలోనే ఆయనకు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. మెదక్ టికెట్ ఆశించి భంగపడ్డ డీసీసీ చైర్మన్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. టికెట్ల రేసులో 13 మంది డీసీసీ చైర్మన్లున్నారు. వారిలో ఎంత మందికి టికెట్లు వచ్చే అవకాశం ఉంది.. రాని వారిని పార్టీలో చేర్చుకునేందుకు ఎవరి ద్వారా రాయబారం నడపాలి? వాళ్లకు  సన్నిహితులెవరు..? అనే అంశాలపై డీప్ స్టడీ జరుగుతోందని సమాచారం. ఇప్పటికే కొంత మంది డీసీసీ అధ్యక్షులను గులాబీ టీం కాంటాక్ట్ చేసిందని తెలుస్తోంది. పలువురు రాష్ట్ర స్థాయి నేతలు, సీనియర్‌‌లతోనూ మంతనాలు జరిపినట్టు సమాచారం. 

లిస్ట్ రిలీజ్ అయితే జంపింగ్స్!!

 119 సెగ్మెంట్ల లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా టికెట్ల కోసం వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో ఏఐసీసీ సభ్యులు,  రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు. చాలా చోట్ల ఇద్దరు ముగ్గురు కీలక నేతలు  పోటీ పడుతున్నారు. టికెట్ రాని వారిని తమవైపు తిప్పుకొనేందుకు గులాబీ బాస్ పావులు కదుపుతున్నట్టు సమాచారం. జాబితా విడుదలైన మరుక్షణం కండువా మార్చుకునేందుకు పలువురు ఇప్పటికే రెడీ అయిపోయారనే టాక్ నడుస్తోంది.

ALSO READ: డబ్బు కొట్టు.. సీటు పట్టు : గ్లోబల్ లీడర్ కె.ఏ.పాల్.. గూగుల్ పే అప్లికేషన్స్

రెబల్స్ ను రంగంలోకి దింపి..

కాంగ్రెస్  టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను రంగంలోకి దింపి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయించే మరో వ్యూహం కూడా గులాబీ పార్టీ అమ్ముల పొదిలో ఉందని తెలుస్తోంది. కీలక నేతలను తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దింపి.. కావాల్సిన ఖర్చులను పెట్టేందుకు వెనుకాడరని తెలుస్తోంది. ఈ వ్యూహం అమల్లోకి తేవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలహీన పడటం, ఓట్లు చీలడంతో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందన్న భావన గులాబీ బాస్ లో ఉంది. ఒక వేళ అలా జరగని పక్షంలో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన వ్యక్తి గెలిస్తే గులాబీ కండువా కప్పేందుకు ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా ఒకటి రెండు సీట్లు తగ్గినా ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.