ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నరు

  •     నాలుగు చోట్ల మళ్లా గెలిపించాలె
  •     జగదీశ్ రెడ్డి రుణమాఫీ కోసం కొట్లాడిండు
  •     సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్‌

నల్గొండ, సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారని,  నాలుగు చోట్ల మళ్లా గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.  ఆదివారం సూర్యాపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.  ముందుగా కలెక్టరేట్‌ను ఆర్అండ్‌‌బీ మంత్రి ప్రశాంత్​ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి చేతుల మీదుగా ప్రారంభించి..  కలెక్టర్​ వెంకట్‌రావును కుర్చీలో కూర్చోబెట్టి సత్కరించారు. అనంతరం ఎస్పీ ఆఫీస్‌ భవనాన్ని డీజీపీ అంజన్​ కుమార్​ చేతుల మీదుగా ఓపెన్‌ చేసి ఎస్పీ రాజేంద్రప్రసాద్​ను కుర్చీలో కుర్చోబెట్టి సన్మానించారు.

అలాగే ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​మంత్రి నిరంజన్​ రెడ్డి, పార్టీ ఆఫీస్‌ను జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ​ప్రారంభించగా..  సీఎం జెండా ఆవిష్కరించారు.  మెడికల్​ కాలేజీ భవనాన్ని ఎమ్మెల్యే గాదరి కిషోర్​ కుమార్​ ,​ఎస్పీ ఆఫీసులో చాంబర్​ను  ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఓపెన్​ చేశారు. అన్ని చోట్ల సర్వమత ప్రార్థనలు చేశారు.  

మంత్రిపై ప్రశంసలు

అనంతరం నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్‌‌ మాట్లాడుతూ  మంత్రి జగదీశ్‌ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి మస్తు హుషారున్నారని,  ఏమి అడగనని జిల్లాకు వస్తే చాలని చెప్పి.. ఇప్పుడు కోరికలు ముందు పెట్టాడని చమత్కరించారు. మొన్న మంత్రివర్గ సమావేశంలో కచ్చితంగా రుణమాఫీ చేయాలని వాదించాదని గుర్తుచేశారు. ప్రజలు జగదీశ్‌ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి హోదా ఇవ్వడమే కాకుండా సూర్యాపేటను జిల్లా కేంద్రంగా మార్చామని,  నియోజకవర్గాన్ని వందల కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పారు. గోదావరి నీళ్లను సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి నియోజజకవర్గాలకు రప్పించడంలో కృషి చేశారని,  సాగర్​ ఎడమకాల్వ లైనింగ్​ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి కోరడంతో వెంటనే పనులు ప్రారంభించామని చెప్పారు.

ఇన్నేళ్ల నుంచి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పట్టించుకోలేదని, సైదిరెడ్డి, కిషోర్ కుమార్​ లాంటి ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనుల కోసం తీవ్రంగా శ్రమించారని సీఎం పొగడ్తల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో సీఎస్​ శాంతికు మారి, డీజీ అంజీనీ కుమార్​, మంత్రులు నిరంజన్​ రెడ్డి, ప్రశాంత్​ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, కిషోర్​ కుమార్​, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్​, కార్పొరేషన్​ చైర్మన్​లు దూదిమెట్ల బాలరాజు, జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వ రెడ్డి, సూర్యాపేట నల్గొండ, యాదాద్రి జిల్లాల  ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

దేశానికి  అన్నం పెట్టే స్థాయికి ఎదిగినం: మంత్రి 

ఒకప్పుడు ప్లోరోసిన్ భూతం, రాజకీయ ఘర్షణణలతో చితికిపోయిన ఉమ్మడి నల్గొండ ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థితికి ఎదిరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్‌‌ కేవలం మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సూర్యాపేటను సస్యశ్యామలం చేశారని కొనియాడారు.  నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉన్న సూర్యాపేట జిల్లా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేసే స్థాయికి చేరిందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, 60 ఏండ్లలో చెయ్యాల్సిన అభివృద్ధిని ఆరేండ్లలో చేసి చూపించామని స్పష్టం చేశారు.  దశాబ్దాలుగా సూర్యాపేట పట్టణ ప్రజలు తాగుతున్న మూసినీటి నుంచి విముక్తి చేసి మిషన్ భగీరథతో సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని చెప్పారు.  కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీస్‌తో పాటు మెడికల్ కాలేజీ,  ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రెండు మినీ ట్యాంక్  బండ్లు, 14 పార్కులతో సూర్యాపేట రూపురేఖలే మారిపోయాయన్నారు.

శ్మశాన వాటికలో ప్రీ వెడ్డింగ్ షూట్‌ చేసుకోవచ్చు

సూర్యాపేట శ్మశాన వాటిక అద్భుతంగా కట్టారని, ప్రీ వెడ్డింగ్ షూట్‌ కూడా చేసుకోవచ్చని సీఎం కేసీఆర్  మంత్రిని అభినందించారు.  మెడికల్ కాలేజీ ఓపెన్ చేసి మినీ ట్యాంక్ బండ్ మీదుగా కలెక్టరేట్ వెళ్లే మార్గంలో సీఎం,  మంత్రి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి శ్మశాన వాటికలో నిర్మించిన శివుడి విగ్రహం ముందు జనాలు సెల్ఫీ తీసుకుంటున్నారని సీఎంతో చెప్పగా... సెల్ఫీలే కాదు ప్రీ వెడ్డింగ్ వీడియోలు కూడా తీసుకొనే రోజు వస్తుందని సీఎం అన్నారు.  చాలా బాగా కట్టించారని మంత్రిని అభినందించారు.