
సిద్దిపేట, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి బీఆర్ఎస్ ను గెలిపించాలని మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనిత పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలో పలు వార్డుల్లో మంత్రి హరీశ్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ను ఇచ్చామని కాంగ్రెస్ గొప్పలు చెబుతున్నా డిసెంబర్ 9న ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంటే ప్రాణాలను పణంగా పెట్టి కొట్లాడి సాధించుకున్నామన్న విషయం మరిచిపోవద్దని సూచించారు. ఈ ఎన్నికల్లో మనం తప్పు చేస్తే తెలంగాణ మరో యాభై ఏండ్లు వెనక్కి పోతుందని, అలా జరగకుండా మీరే చూడాలని కోరారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్రావుకే ఓటు వేయడమే కాకుండా మీ మిత్రులు, బంధువులకు చెప్పి బీఆర్ఎస్ కే ఓట్లు పడేలా చూడాలని అభ్యర్థించారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావుకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు.
సిద్దిపేట రూరల్: మండలంలోని రాఘవపూర్ గ్రామంలో శ్రీనిత, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రావు, బాల కిషన్ రావు లతో కలసి ఇంటిటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్దిపేట మొత్తం తమ కుటుంబమే అన్నారు. రేవంత్ రెడ్డి లంబాడీలకు సంబంధించిన సేవాలాల్ దేవుడిని అవమానించారని, కానీ హరీశ్ రావు ప్రతి కులాన్ని ప్రతి దేవుడిని నమ్ముతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శేరుపల్లి యాదగిరి, మండల అధ్యక్షుడు ఎర్ర యాదయ్య, జడ్పీటీసీ శ్రీహరి గౌడ్, సర్పంచ్ రమేశ్ పాల్గొన్నారు.