సీఎం కేసీఆర్ హామీ నెరవేరలేదు.. సర్పంచుల అసహనం

పెద్దపల్లి, వెలుగు : ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బంది పడుతుంటే మళ్లీ రూ. 10 లక్షల పనులు చేస్తే ఎప్పటికి వస్తాయోనని పెద్దపల్లి జిల్లాలోని ఆయా గ్రామాల సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.  గతేడాది ఆగస్టులో పెద్దపల్లి కలెక్టరేట్​ ప్రారంభానికి వచ్చిన సీఎం కేసీఆర్​ జిల్లాలోని 265 గ్రామ పంచాయతీలకు ఒక్కో దానికి స్పెషల్​ డెవలప్​మెంట్​ఫండ్​(ఎస్​డీఎఫ్) రూ.10 లక్షల చొప్పున తక్షణమే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో సర్పంచుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పంచాయతీలకు వచ్చే పైసల్ని ఎలా ఉపయోగించాలో ప్రపోజల్స్​ రెడీ చేసుకున్నారు. కానీ ఏడాది గడిచినా ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. కాగా గత నెల 28న జిల్లా కలెక్టర్​ సీఎం ప్రకటించిన ఫండ్​కు సంబంధించిన పనులు ఎలా చేయాలో ప్రొసీడింగ్స్​ ఆయా సర్పంచులకు ఇచ్చారు.  దీనిపై సర్పంచులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.  గతంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇప్పటి వరకు రాలేదు.  ఇప్పుడు రూ.10 లక్షల పనులు చేస్తే ఈ డబ్బులు ఎప్పటికి వస్తాయో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి అభివృద్ది పనులు చేయలేమని చాలా మంది సర్పంచులు చెబుతున్నారు.   సీఎం తక్షణమే రూ. 10 లక్షలు రిలీజ్​ చేస్తామంటే సంతోషించామని, ఇలాంటి మెలిక పెడతారనుకోలేదని సర్పంచులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రొసీడింగ్స్​ కు సర్పంచుల నో రెస్పాన్స్​ 

పెద్దపల్లి జిల్లా పరిషత్​ చైర్మన్​ పుట్ట మధు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి స్పెషల్​ ఫండ్​ ప్రకటించాలని సీఎంను ప్రత్యేకంగా కోరారు.  దీంతో సీఎం కేసీఆర్​ జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు తక్షణమే రీలీజయ్యేలా ఆదేశిస్తాని హమీ ఇచ్చారు.  ఫైనాన్స్​ కమీషన్లకు సంబంధం లేకుండా స్పెషల్​ ఫండ్​ కాబట్టి ఇన్​స్టంట్​ ఎమౌంట్​ రిలీజ్​ అవుతుందని, డైరెక్టుగా జీపీ ఎకౌంట్​లో పడుతాయని సర్పంచులు ఆశపడ్డారు.  కానీ సీఎం ప్రకటించిన ఫండ్​కు సంబంధించి చేయాల్సిన పనుల ప్రొసీడింగ్స్​గత నెల 28న పెద్దపల్లి జిల్లా కలెక్టర్​ రిలీజ్​ చేశారు.  ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి ఎంబీలు పెట్టుకోవాలని సూచించారు.  దీంతో సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. ప్రొసీడింగ్స్​ పై  సర్పంచులు ఎవరూ రెస్పాండ్​ కావడం లేదు.   సీఎం ప్రకటించిన నెలలోపే ప్రొసీడింగ్స్​ ఇచ్చినా ఇప్పటి వరకు పనులు పూర్తి చేసేవాళ్లమని కొందరు సర్పంచులు చెబుతున్నారు. గతంలో జనరల్​ ఫండ్స్​ ద్వారా చేసిన అభివృద్ది పనులు పెండింగ్ లో  పడినా, నాణ్యత లేకపోయినా ఆయా గ్రామ సర్పంచ్​లపై కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు.   సీఎం ప్రత్యేక టైంలో  ప్రకటించిన స్పెషల్​ఫండ్​ కావడంతో పనులు చేసినా, చేయకపోయినా తమకేమీ నష్టం లేదు కాబట్టి, అప్పులు చేసి అభివృద్ధి చేయబోమని సర్పంచులు అంటున్నారు.  

ఎంబీ రికార్డు కాగానే  పైసలు పడేలా చూడాలి

గతంలో చేసిన పనుల బిల్లులు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పుడు ఎస్​డీఎప్​ పనులు చేయాలంటే మళ్లీ అప్పులు చేయాల్సి ఉంటుంది. గతంలో చేసిన అప్పులతోనే ఇబ్బంది పడుతున్నాం. మరోసారి అభివృద్ధి పనులు చేయాలంటే అప్పులు చేయాలి.  చేసిన పనులకు సంబంధించి ఎంబీ రికార్డు కాగానే పైసలు రిలీజ్​ అయ్యేలా చూస్తామంటే పనులు చేస్తం.
- సముద్రాల రమేశ్​​, సర్పంచ్, ఖమ్మంపల్లి, పెద్దపల్లి జిల్లా