- సీఎం హామీలిచ్చిన పనులన్నీ పెండింగే
- రెండేళ్లు కావస్తున్నా అతీగతి లేదు
గద్వాల, వెలుగు: సీఎం కేసీఆర్, మినిస్టర్ కేటీఆర్ రావడం శంకుస్థాపనలు చేయడం, పనులు ఆగిపోవడం నడిగడ్డలో సర్వసాధారణంగా మారిపోయింది. గతంలో కేసీఆర్ గద్వాలకు వచ్చి ఎన్ని కోట్లు కావాలో తీసుకోండి.. పనులు చేసుకోండి.. నియోజకవర్గానికి ఐదువేల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తాను, ఆర్డీఎస్ దగ్గర కుర్చీ వేసుకొని పనులు చేపిస్తాను.. దీవి గ్రామమైన గుర్రం గడ్డకు రెండు కాకుంటే మూడు కోట్లతో బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడతాం.. తుమ్మిళ్లలో మూడు రిజర్వాయర్ లు కంప్లీట్ చేస్తాం, గద్వాలకు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు ఇస్తాం, జోగులాంబ ఆలయ అభివృద్ధికి వంద కోట్లు కేటాయిస్తాం అంటూ హామీలు ఇచ్చారు. వాటిలో ఇప్పటివరకు ఒక్కటి కూడా కంప్లీట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు కలెక్టరేట్ ఓపెనింగ్ పేరుతో గద్వాలలో అడుగు పెడుతున్నారు. మళ్లీ ఇప్పుడు ఏ హామీ ఇస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. 2021 సెప్టెంబర్14న మంత్రి కేటీఆర్ గద్వాలకు వచ్చి 100 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఏడాదిలోగా అన్ని కంప్లీట్ చేయాలని దిశా నిర్దేశం చేశారు. కానీ రెండేళ్లు అవుతున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కేవలం మంత్రులు, సీఎం వచ్చినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా పనులు చేస్తున్నారు. ఆ తర్వాత పనులు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. జూరాల ప్రాజెక్టు దగ్గర గార్డెన్ అభివృద్ధి పనులు జరగడం లేదు. సమీకృత మార్కెట్ యార్డ్ పనులు నత్త నడకన సాగుతున్నాయి. ఇలా చాలా పనులు పెండింగ్ లోనే ఉన్నాయి.