ఎన్నికలు రాగానే హడావుడి కాకుండా.. ఓటు వేసే ముందు అభ్యర్థుల పనితనం, పార్టీల చరిత్ర చూడలన్నారు సీఎం కేసీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక్క ఆయుధం ఓటు అని చెప్పారు. మీ ఓటు మీ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పారు. మధిరలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమేనని అన్నారు సీఎం కేసీఆర్. పదేళ్ల పాలనలో చిత్తశుద్ధితో పనిచేశామని చెప్పారు సీఎం. తెలంగాణను అన్ని రంగాల్లో మొదటిస్థానంలో నిలపామన్నారు. మధిరలో కాంగ్రెస్ గెలిచినా ఎప్పుడు కూడా వివక్ష చూపించలేదని చెప్పారు. తెలంగాణ ప్రతి అంగుళం నాదేనని, ఏ ప్రాంతం బాగుపడ్డ తనకు గర్వకారణమేనని చెప్పారు.
కాంగ్రెస్ చరిత్ర అంతా మోసాలనే అన్నారు సీఎం కేసీఆర్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు ఎలా బతికారో అందరికీ తెలిసిందేనన్నారు. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని చెప్పారు. బలవంతంగా తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బంది పెట్టారన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందన్నారు.
కాంగ్రెస్ లో డజన్ మంది సీఎం క్యాండిడెట్లు ఉన్నారని సీఎం విమర్శించారు. వాళ్లు గెలిచేదే లేదన్నారు. మళ్లీ కాంగ్రెస్ కు 20 సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు. పూర్తి మెజార్టీతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మధిరలో కమల్ రాజ్ ను గెలిపించాలని కోరారు. కమల్ రాజ్ ను గెలిపిస్తే మధిరలో ప్రతి ఒక్క కుటుంబానికి దళితబంధు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.