- ప్రచారం పైనే బీజేపీ ఫోకస్
- నవంబర్ 1న కాంగ్రెస్ మహిళా గర్జన
నల్గొండ, వెలుగు : మునుగోడు ఎన్నికల ప్రచారానికి నాలుగు రోజులే గడువు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు బహిరంగసభల పైన ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్ చండూరులో భారీ బహిరంగ సభకు ప్లాన్చేసింది. మండలంలోని బంగారిగడ్డలో సీఎం సభ ఏర్పాట్లు జరుగుతున్నా యి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్చార్జిలుగా ఉన్న ఒక్కో ఎంపీటీసీ పరిధి నుంచి 15 వందల మంది చొప్పున లక్ష మందిని తరలించాలని టార్గెట్ పెట్టారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాక మునుగోడులో జరిగిన బీజేపీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చా రు. దీంతో పోలిస్తే రేపు జరిగే చండూరు సభకు భారీగా జనాన్ని తరలించాలని హైకమాండ్ ఆదేశించింది. ఎన్నికల ప్రచార ముగింపుకు రెండు రోజుల ముందు జరుగుతున్న సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పైగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న ఈ సభ కోసమే పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొనుగోళ్ల ఘటనపైన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ నోరు మెదపొద్దని మంత్రి కేటీఆర్ఆదేశించి న నేపథ్యంలో బహిరంగసభలో సీఎం దీనికి గురించే ప్రస్తావించే అవకాశం ఉండొచ్చని పార్టీ ముఖ్యనేతల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ సమస్యలపైన స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం, సీపీఐ మెమోరాండం తయారు చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రేపు జరిగే సభలో ఆపార్టీల నేతలు కూడా పాల్గొంటారు కాబట్టి కొత్త హామీలు, ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం పై సీఎం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉండొచ్చని పార్టీ సీనియర్ లీడర్ ఒకరు చెప్పారు.
ప్రచారం పైనే బీజేపీ ఫోకస్...
ఎన్నికల ప్రచారానికి తక్కువ టైం ఉన్నందున ఇంటింటికి తిరిగే ప్రచార కార్యక్రమాల పైనే బీజేపీ ఫోకస్పెట్టింది. 31న జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో భారీ సభ పెట్టాలని ప్లాన్ చేశారు. కానీ బహిరంగ సభల వల్ల ప్రచారానికి సమయం సరిపోదని భావించిన పార్టీ ముఖ్యనేతలు నాలుగు రోజులు ఇంటింటికి తిరిగే ప్రచార కార్యక్రమాన్నే మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. బూత్ ఇన్చార్జిలతోపాటు, పార్టీ ముఖ్యనేతలందరూ ప్రతి ఇంటి గడప తొక్కాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ మహిళా గర్జన..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఒక్కో ఓటర్ను నాలుగైదు సార్లు కలిసిన కాంగ్రెస్శ్రేణులు ఈ నాలుగు రోజులు ప్రచారాన్ని మరింత స్పీడప్ చేసేందుకు ప్లాన్ చేంజ్ చేశారు. సర్వే నివేదికలపైన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లస్టర్ ఇన్చార్జిలతో సమీక్ష చేశారు. దీని తర్వాత ప్రచార సరళిలో మార్పులు చేశారు. ప్రతి బూత్‌కు ఐదుగురు ఇన్చార్జిలను పెట్టారు. ఒక ఇన్చార్జి 150 మంది ఓటర్లను కలవాల్సి ఉంటుంది. అలాగే నవంబర్1న చండూరులో మహిళా గర్జన మీటింగ్పెట్టాలని నిర్ణయించారు. బూత్‌కు 50 నుంచి 100మంది చొప్పున 20వేల మంది మహిళలను మీటింగ్‌కు తరలించాలని టార్గెట్ పెట్టారు.