ఓటేసే ముందు ఆగమాగం గాలిగాలి కావొద్దన్నారు సీఎం కేసీఆర్. వర్దన్నపేట బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్ కు అధికారం తప్ప అభివృద్ధి అవసరం లేదని విమర్శించారు. ఎవరో చెప్పారని ఓటు వేయకుండా.. వాస్తవాలు ఎంటో తెలుసుకుని ఆలోచించి ఓటెయ్యాలన్నారు. కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కొందరు దుర్మార్గులు విజయం కోసం షార్ట్ కట్ పద్దతిని ఎంచుకుంటున్నారని చెప్పారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలన్నారు.
రైతుబంధు వృథా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. 3 గంటల విద్యుత్ చాలని పీసీసీ చీఫ్ రేవంత్ అంటున్నారని.. ధరణి తీసేస్తే రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ధరణి వద్దంటున్న కాంగ్రెస్సోళ్లను బంగాళఖాతంలో కలపాలన్నారు. రైతుబంధు పదం పుట్టిందే కేసీఆర్ నుంచి అని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు కొందరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
- ALSO READ | ధరణి తీసేస్తే మళ్లీ కథ మొదటికొస్తది: కేసీఆర్
ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు కేసీఆర్.. తెలంగాణ వచ్చాక ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. 20 ఏళ్ల కింద పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించామని..అపుడు ఎవరికీ నమ్మకం లేదన్నారు. ఎంతో మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి సన్న బియ్యం ఇస్తామన్నారు కేసీఆర్. దశల వారీగా పెన్షన్ పెంచుతామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలన్నారు. రైతుబీమా తరహాలో అందరికీ బీమా కల్పిస్తామన్నారు.