ఢిల్లీ పార్టీలకు ఓటెందుకెయ్యాలె .. రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగమే : కేసీఆర్

  • ఢిల్లీ పార్టీలకు  ఓటెందుకెయ్యాలె .. 
  • రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగమే: కేసీఆర్
  • ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు సొంతంగా కథ ఉండది
  • అక్కడ స్విచ్ వేస్తేనే ఇక్కడ లైట్ వెలుగుతది
  • ఢిల్లీ గులాములకు మనం గులాములవుదామా?
  • పువ్వులా చూసుకునే పువ్వాడ కావాల్నా.. తుమ్మ ముల్లు లాంటి తుమ్మల కావాల్నా?
  • ఎలక్షన్ వస్తే చాలు బూతులు తిట్టుడు.. అబద్ధాలు చెప్పుడు.. మోసపూరిత 
  • వాగ్దానాలు ఇచ్చుడు తంతుగా మారింది
  • తిట్టాలంటే తిట్లు తక్కువున్నయా.. అరాచకంగా మాట్లాడొద్దు కదా
  • ప్రజలు మంచి చెడు విచారించి ఓటేస్తే ఇంకా మంచి జరుగుతుందని కామెంట్
  • ఖమ్మం, కొత్తగూడెంలో ప్రజా ఆశీర్వాద సభలు
నాకే మంత్రి పదవి ఇప్పిచ్చిండట

ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తుల గుణగణాలన్నీ మీకు తెలుసు. ఒకాయన చాలా గొప్పవాడు. ‘పోయినసారి ఓడిపోతే మంత్రి పదవిచ్చిన’ అని నేను చెబితే, నాకే మంత్రి పదవిప్పిచ్చిన అని ఆయన (తుమ్మల) చెబుతున్నడు. ఇదే అజయ్ చేతిలో ఓడిపోయి మూలనపడి ఉంటే పిలిచి.. అందరినీ సమన్వయం చేద్దామని మంత్రిని చేసి జిల్లా అప్పగించిన. కానీ ఆయన సాధించిన ఫలితం గుండు సున్నా. ఖమ్మంలో ఒక్క అజయ్ తప్ప ఇంకెవరూ గెల్వలే. ఈ జిల్లాలో కరటక దమనకులు ఉన్నరని సత్తుపల్లి సభలో చెప్పిన. వాళ్ల సంగతి తెల్వాలంటే చిన్నయ్య సూరి రాసిన కథ తెల్వాలె. ఖమ్మానికి వాళ్లిద్దరి పీడ వదిలింది. ఖమ్మం జిల్లాలో ఈసారి మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు.  

 -  కేసీఆర్​

ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : దేశంలో రాబోయే కాలమంతా ప్రాంతీయ పార్టీల యుగమేనని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. ఢిల్లీ పార్టీలకు ఓటెందుకెయ్యాలని ప్రశ్నించారు. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవడన్నా, ఎప్పుడన్నా మన తెలంగాణ జెండా ఎత్తిండా? తెలంగాణ ఉద్యమాన్ని భుజాన ఏసుకున్నడా? మనం ఎత్తుకున్నప్పుడల్లా మనల్ని అవమానపరిచిన్రు. కాల్చి చంపిన్రు. జైళ్ల పెట్టిచ్చిన్రు. వీళ్లకెందుకు ప్రేముంటది? ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు సొంతంగా కథ ఉండది. ఢిల్లీలో స్విచ్ వేస్తేనే ఇక్కడ లైట్ వెలుగుతది. మరి ఈ ఢిల్లీ గులాముల కింద ఉండి మనం కూడా గులాములు అవుదామా? ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటేనే ప్రజల ప్రయోజనాలు కాపాడుతరు. కడుపులో పెట్టుకుంటరు” అని చెప్పారు.

మంత్రమేస్తేనో, మాయ చేస్తేనో కాదు..

‘‘ఖమ్మం పట్టణాన్ని చూసి గర్వపడుతున్న. గతంలో నేను ఖమ్మంలో పాదయాత్ర చేసిన. గోళ్లపాడు ఎంత మురికిగా ఉండె. ఎలాంటి స్లమ్స్ ​ఉండె. ఎన్నేండ్లు ఆ స్లమ్స్‌‌ను భరించినం. లకారం చెరువు ఎంత వికారంగా ఉండె. ఇప్పుడు ఎంత సుందరంగా మారింది. నేనే అజయ్‌‌కి రూ.100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేయాలని చెప్పిన” అని కేసీఆర్ అన్నారు. 

‘‘విషయాలు చిన్నగనే కనపడతయి. ఆలోచిస్తే అవి పెద్ద సామాజిక అవసరాలు. వైకుంఠధామాలు గానీ, ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లు కానీ ఎలా ఉండేవి.. హైదరాబాద్‌తో సహా అంతటా అదే దుస్థితి. మోరీల మీద పెట్టి అమ్మితే ముఖ్యమంత్రి సహా అందరూ అవే కూరగాయలు తినాల్సిందే. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లలో శుభ్రంగా అమ్మకాలు జరుగుతున్నాయి” అని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఖమ్మం అంటే ఇరుకు సందులు ఉండేవని, ఇప్పుడు వెడల్పాటి రోడ్లు ఉన్నాయని, సందుల్లో కూడా తెల్లటి వైట్ టాప్ రోడ్స్, దారిపొడవునా లైట్లు, పచ్చటి చెట్లతో కనిపిస్తున్నాయని చెప్పారు. ఇదంతా మంత్రమేస్తేనో, మాయ చేస్తేనో జరగలేదని, మంత్రి చేస్తే జరిగిందని అన్నారు. ‘‘గతంలో ఖమ్మం పట్టణంలో రోడ్ నెట్ వర్క్ 400 కిలోమీటర్లు ఉండేది. ఇవాళ 1,115 కిలోమీటర్లకు తీసుకెళ్లారు. డ్రెయిన్స్ పొడవు 205 కిలోమీటర్లు ఉండే.. ఈరోజు 1,592 కిలోమీటర్లకు తీసుకెళ్లింది పువ్వాడ అజయ్​ కాదా? గోళ్లపాడు కట్టల మీదున్న వాళ్లను కూడా మేం వెలుగుమట్లలో పునరావాసం కల్పించాం. గోళ్లపాడు ఛానల్, లకారం చెరువు ఒక చిటికేస్తే పూర్తి కాలే. ఏడు సంవత్సరాలు నిరంతరంగా కష్టపడితే ఇవాళ ఉన్న రూపు కనపడుతుంది. మున్నేరుపైన తీగల వంతెన కట్టి ఆహ్లాదకరంగా చేయాలని చూస్తున్నాం. మీరు మంచి చెడు విచారించి ఓటేస్తే తప్పకుండా ఇంకా మంచి జరుగుతుంది” అని కేసీఆర్ అన్నారు.

పువ్వుల్లో పెట్టి చూసుకుంటడు

‘‘పువ్వాడ అజయ్​ను గెలిపిస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటడు.. తుమ్మల తుప్పలు తెచ్చుకుంటే మీకు ముండ్లు గుచ్చుకుంటయ్. తుమ్మ ముండ్లు కావాల్నా? పువ్వాడ పూలు కావాల్నా? ఏది కావాలో తేల్చాల్సింది ఖమ్మం ప్రజలే” అని కేసీఆర్ అన్నారు. ‘‘ఖమ్మం నగరంలో ఐటీ టవర్‌‌ను కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని పట్టుబట్టి తెచ్చింది అజయే. రవాణా మంత్రిగా బ్రహ్మాండంగా అడ్వాంటేజీ తీసుకున్నడు. కొత్త హైటెక్​ బస్టాండ్ కట్టేసిండు. రూ.40 కోట్లతో ఆర్టీసీ కల్యాణ మండపాన్ని కడుతున్నడు. కమిట్​మెంట్ తో, కన్విక్షన్ తో చేస్తేనే ఇవన్నీ పనులు పద్ధతి ప్రకారం అయ్యాయి. 75 వేల ట్యాప్ కనెక్షన్లు ఒక్క రూపాయికే ఇచ్చినం. రఘునాథపాలెంలో రూ.300 కోట్లతో అభివృద్ధి చేశారు. ఒక్క మట్టి రోడ్డు కూడా లేకుండా తీర్చిదిద్దిండు అజయ్. ప్రభుత్వానికున్న విజన్, ఇక్కడ అజయ్ మిషన్ తోడైతేనే ఈ పనులు జరిగాయి’’ అని తెలిపారు. ఖమ్మం సిటీలో ఉన్న ముస్లిం ఓటర్ల కోసం కేసీఆర్ ఉర్దూలో కాసేపు ప్రసంగించారు. తమకంటే ముందున్న ప్రభుత్వాలు మైనార్టీల కోసం కేవలం రూ.900 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలోనే మైనార్టీల సంక్షేమం కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ముస్లింలను ఓటు బ్యాంక్ గా మార్చుకొని గత ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకు సెక్యులర్ ప్రభుత్వం ఉంటుందని హామీనిచ్చారు. ‘‘మీరు ప్రేమగా అజయ్ ఖాన్ అని పిల్చుకునే అజయ్‌ని భారీ మెజార్టీతో గెలిపించండి” అని కోరారు. 

మాటలకు పరిమితి ఉండాలే

ఎలక్షన్లు వస్తే బూతులు తిట్టుకోవడం, అబద్ధాలు చెప్పడం, సిగ్గు లజ్జా లేకుండా మాట్లాడటం, అభాండాలు వేయడం, మోసపూరిత వాగ్దానాలు చేయడం మన దేశంలో జరిగే తంతు అని, ఇది మారాలని అన్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో మాటలకు కూడా పరిమితి ఉంటది. తిట్టాలంటే తిట్లు తక్కువున్నయా. అది కాదుకదా రాజకీయమంటే. అరాచకంగా మాట్లాడొద్దు కదా. ‘బీఆర్ఎస్ పార్టీ వాళ్లను ఒక్కడ్ని కూడా అసెంబ్లీ గడప తొక్కనియ్య’ అని ఒక అర్భకుడు మాట్లాడుతున్నడు. అరె నువ్వేంది ఖమ్మం ప్రజలందరినీ గుత్త పట్టినవా? కొనేసినవా జిల్లాకు జిల్లానే? ఖమ్మం జిల్లా ప్రజలు దీన్ని సహిస్తరా? ప్రజాస్వామ్య వాదులు సహిస్తారా? చైతన్యవంతమైన జిల్లా ఇది. పోరాటాల ఖిల్లా. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు ఎంతో చైతన్యం తెచ్చాయి. ఎవరు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదో, ఎవరి చేతుల్లో ఉంటే తెలంగాణ సురక్షితంగా ఉంటదో మీ అందరికీ బాగా తెలుసు” అని అన్నారు.

ALSO READ : మునుగోడు బీఆర్ఎస్‌‌‌‌లో ముసలం .. సంస్థాన్​నారాయణ్​పూర్​ ఎంపీపీ గుత్తా ఉమాపై వేటు

సింగరేణి నడక మార్చినం

‘‘సీతారాములు కొలువుదీరిన జిల్లాకు ఆ స్వామి పేరునే భద్రాద్రి కొత్తగూడెం అని పెట్టినం. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండి ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడేదేనా? కరెంట్ ఉత్పత్తి చేసే కొత్తగూడెంలో ఒకప్పుడు కరెంట్ సక్కగా ఉండలే. ఇప్పుడే కరెంట్ కోతలే లేవు. వాటర్ ప్రాబ్లం లేదు. రోడ్లన్నీ బాగు చేసుకున్నాం. జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చాం. పోడు భూములకు పట్టాలిచ్చాం. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా బంగారు తునకగా మారుతది. 134 ఏండ్ల సింగరేణి.. తెలంగాణకు కొంగు బంగారం. కాంగ్రెస్ హయంలో సింగరేణిలో 49 శాతం వాటాను అప్పనంగా కేంద్రానికి అప్పగించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి నడక మారింది. తెలంగాణ రాకముందు రూ.11 వేల టర్నోవర్ ఉంటే, ప్రస్తుతం అది రూ. 33 వేల కోట్లకు చేరింది. రూ.700 కోట్లను కార్మికులకు లాభాల్లో వాటాగా ఇచ్చాం. సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ పొగొట్టింది కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలకు చెందిన యూనియన్లే. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ లో డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ద్వారా దాదాపు 15,256 మందికి ఉద్యోగాలిచ్చాం. సొంతింటి కలలో భాగంగా కార్మికులకు రూ.10 లక్షలు వడ్డీలేని రుణం ఇస్తున్నాం. సింగరేణి వ్యాప్తంగా 76 జీవో ద్వారా దాదాపు 22 వేల మందికి పట్టాలిచ్చాం. ఎప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాపత్రాయ పడే వ్యక్తి వనమా వెంకటేశ్వరరరావును గెలిపించండి” అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.