మహిళా హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడిన మహనీయురాలు సాయిత్రీబాయి పూలే అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా భారత జాతికి ఆమె అందించిన సామాజిక సమానత్వ జ్జానాన్ని, చారిత్రక కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. కుల, లింగ వివక్షలతో కూడిన విలువలు, మూఢ విశ్వాసాలతో కునారిల్లుతున్న నాటి సమాజాన్ని, సమ సమాజం దిశగా నడిపించేందుకు సావిత్రీబాయి ఫూలే తన జీవితాన్ని ధారపోశారని సీఎం అన్నారు. ఈ క్రమంలో భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహం మహోన్నతమైందని, నేటి తరానికి స్పూర్తిదాయకమని కేసీఆర్ కొనియాడారు.
బడుగు బలహీన వర్గాలు, మహిళల సమాన హక్కుల సాధన కోసం తాను ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఛీత్కరింపులు అవమానాలు ఎదురైనా, మొక్కవోని దీక్షతో ప్రతిఘటిస్తూ సావిత్రీబాయి ముందుకు సాగారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. విధ్వేషాలకు వ్యతిరేకంగా తన ఆశయాల సాధన కోసం ధృఢ చిత్తంతో మహా సంకల్పంతో.. సావిత్రిబాయి పోరాడారని ఆయన కీర్తించారు. సంఘసంస్కర్తగా, రచియిత్రిగా సామాజిక సంస్కరణలకై నడుం బిగించిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశాభ్యున్నతికి సావిత్రీబాయి అందించిన స్పూర్తిని నేటితరం కొనసాగించాలని సీఎం పిలుపునిచ్చారు. భారత దేశ ప్రగతికి సామాజికాభ్యున్నతికి వారి ఆలోచనలు నేటికీ ఆచరణ యోగ్యమైనవేనని సీఎం తెలిపారు. జీవితపు చివరి క్షణం వరకు పీడిత ప్రజల సేవకోసమే అంకితమైన సావిత్రిభాయి ఫూలే సేవాతత్పరత, యావత్ భరతజాతికి ప్రాత:స్మరణీయమని సీఎం కేసీఆర్ తెలిపారు.