జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రేపు ఉదయం 6గంటలవరకు అన్నీ బంద్
నేడు సాయంత్రం 5 గంటలకు ఎవరి ఇండ్లల్లోంచి వాళ్లు చప్పట్లు కొట్టి ఐక్యతను చాటుదాం
ఆ టైంలో రాష్ట్ర మంతటా సైరన్లు మోగిస్తం
కరోనాకు స్వాభిమానం ఎక్కువ.. మనం ఇన్వైట్ చేస్తేనే వస్తది
మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్
కరోనాపై యుద్ధానికి యావత్ దేశం సిద్ధమైంది. నువ్వు.. నేను.. వాళ్లు.. వీళ్లు.. అన్న తేడా లేదు. అందరూ ఒక్కటయ్యారు. మన ఆరోగ్యం కోసం, మనందరి ఆరోగ్యం కోసం ‘జనతా కర్ఫ్యూ’కు జైకొట్టారు. పాలిటిక్స్ పక్కకుపోయాయి.. సరిహద్దులు చెదిరిపోయాయి.. అన్ని రాష్ట్రాలు ముక్త కంఠంతో కరోనాపై పోరాటానికి రెడీ అయ్యాయి. ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపును అందుకొని ‘జనతా కర్ఫ్యూ’కు దేశ ప్రజలు నడుం బిగించారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అంతా ఇండ్లకే పరిమితం కానున్నారు. రాష్ట్రంలో మాత్రం ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు అంటే 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికి మనం ఇట్లున్నం. రేపటికి ఏముంటదో, ఎట్లుంటదో మనకు తెల్వదు. రేపు వైరస్ విజృంభించవచ్చు కూడా.. విజృంభించకూడదంటే మనం నియంత్రణ పాటించాలె. అదే శ్రీరామ రక్ష. 24 గంటలు… అందరికందరం యాడున్నోళ్లం ఆడుందం. చీమ చిటుక్కుమనొద్దు. ప్రతి తెలంగాణ బిడ్డకు చేతులెత్తి దండం పెట్టి రెక్వెస్ట్ చేస్తున్న. మన జాతి ఐక్యతను చూపే తరుణం ఇది. జనతా కర్ఫ్యూ పాటిద్దాం. ‑ సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రజలంతా ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల దాకా 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప అన్నీ బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. మన కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం, ప్రపంచ మానవాళి కోసం స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కరోనా నియంత్రణ, ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూపై శనివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ సూచించారు. ‘‘ఆదివారం చీమ చిటుక్కుమనొద్దు. తెలంగాణ మొత్తం దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా జనతా కర్ఫ్యూ పాటించాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘24 గంటలు యాడున్నోళ్లం ఆడనే ఉందాం.. ఏమైతది సచ్చిపోతమా.. భూకంపం వస్తదా.. ఆటోలేదు.. బీటో లేదు.. ఎవరి ఇంట్లో వాళ్లుండండి. స్టాండ్ దేర్’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే తప్పకుండా నియంత్రణ పాటించాలని, చాలా దేశాల్లో ఎక్కడైతే నియంత్రణ పాటించలేదో.. అక్కడ అనేక ఇబ్బందులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.
దేశానికే ఆదర్శంగా ఉందాం
‘‘మన తలెంగాణ జాతి చాలా గొప్ప జాతి. 60 ఏండ్లు ఆలస్యమైనా.. కోల్పోయిన రాష్ట్రాన్ని తిరిగి తెచ్చుకున్న గొప్ప జాతి మనది. పట్టుబట్టి రాష్ట్రాన్ని తెచ్చుకున్నం. గొప్ప చరిత్ర మనకు ఉంది కాబట్టి అదే స్ఫూర్తిని ఇప్పుడు చూపెట్టాలె. ఈ కరోనా దేశంలో ఎవల్ని ఏం చేసినా తెలంగాణ వాళ్లను ఏం చేయలేకపోయిందనేది తెలియజేయాలె. 100 శాతం ఇందులో ఏం ఇబ్బంది లేదు. ప్రతి తెలంగాణ బిడ్డకు చేతులెత్తి దండం పెట్టి అప్పీల్ చేస్తున్నా. దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా జనతా కర్ఫ్యూ పాటించాలి’’ అని సీఎం కోరారు. 60 ఏండ్లు దాటిన వాళ్లు, పదేండ్లలోపు పిల్లలు రెండుమూడు వారాలపాటు బయటకు రాకపోవడమే మంచిదన్నారు. ప్రపంచం వ్యాప్తంగా కూడా కరోనా వల్ల 60 ఏండ్లు దాటినవాళ్లే ఎక్కువగా చనిపోతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
షాపులు, మాల్స్ మూసేయాలి
‘‘జనతా కర్ఫ్యూ సందర్భంగా వర్తక, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలి. షాపులు, మాల్స్ అన్నీ బంద్ చేసుకోవాలి. జబర్దస్తీగా బంద్ చేయించుడు కాదు. ఎవరికి వారే బంద్ చేయాలి. నిత్యావసర సరుకుల కొరత రాకుండా.. చిన్న వ్యాపారులు ఇబ్బంది పడొద్దని ఇన్నాళ్లు వాటిని బ్యాన్ చేయలేదు. ఆదివారం ఒక్కరోజు అంతా బంద్ చేయాలి. ఎమర్జెన్సీ సర్వీసులైన హాస్పిటళ్లు, మెడికల్ షాపులు పనిచేస్తయ్. అంబులెన్స్‌లు నడుస్తయ్. పాలు, పండ్లు, కూరగాయలు అమ్ముకోవచ్చు. పెట్రోల్ బంకులు తెరిచి ఉంటయ్. ఫైర్ సిబ్బంది, డ్రింకింగ్ వాటర్, సీవరేజీ సిబ్బంది, ఇతర ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది పనుల్లో ఉంటారు. మీడియా కవరేజీ కోసం తిరగవచ్చు. వారిని ఎవరూ ఆపొద్దు” అని సీఎం తెలిపారు.
సీసీఎంబీలో కరోనా టెస్టులు
హైదరాబాద్‌లో ఉన్న సీసీఎంబీని కరోనా టెస్టుల కోసం ఉపయోగించుకునే అవకాశమివ్వాలని తాను వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానిని కోరానని, కేంద్రం నుంచి అనుమతిస్తూ హెల్త్ సెక్రటరీకి లెటర్ వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్ రీసోర్సెస్ వాడుకోవడానికి ప్రధాని అనుమతించారని ఆయన అన్నారు. కరోనా ప్రభావం పెరిగితే సీసీఎంబీని ఉపయోగించుకుంటామని తెలిపారు. ప్రధాని పది మంది సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే తన ఒక్కడికే పీఎం రెస్పాండ్ అయ్యారని కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రంలో 21 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో 700 మందికి పైచిలుకు కరోనా అనుమానితులున్నారని, వారిలో 21 మందికి పాజిటివ్ వచ్చిందని సీఎం తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారేనని, స్థానికంగా ఎవ్వరికీ ఇది సోకలేదని స్పష్టం చేశారు. ఇందులో ఒక్కరికి కూడా వెంటిలేటర్ పెట్టే పరిస్థితి రాలేదన్నారు. ‘‘కరోనా నియంత్రణకు రాష్ట్రంలో 5,274 సర్వేలైన్స్ టీంలు పనిచేస్తున్నయ్. విదేశాల నుంచి వచ్చిన వారిపై ఈ టీంలు నిఘా పెడుతున్నయ్. ఉదయం, సాయంత్రం ఈ టీం సభ్యులు.. విదేశాల నుంచి వచ్చిన వారి ఇండ్లకు వెళ్లి వారిని పరీక్షిస్తరు. ఎవరికైనా తీవ్రత ఎక్కువ ఉంటే వెంటనే గాంధీ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేస్తరు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినం. 78 జాయింట్ టీంలు అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నయ్.” అని సీఎం పేర్కొన్నారు.
మనల్ని మనం బచాయించుకోవాలి
‘‘ఇప్పుడు ప్రెస్మీట్లో ఫస్ట్ టైం రిపోర్టర్‌కు రిపోర్టర్‌కు మధ్య మూడు ఫీట్ల దూరం ఉంచాం. కరోనాను నివారించేందుకు మన వంతు ప్రయత్నాలు చేస్తున్నం. హెల్త్ మినిస్టర్ నేతృత్వంలో సీఎంవో, ఇతర అధికారులతో కూడిన ఫైవ్ మెంబర్స్ ఎక్స్‌పర్ట్ టీం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, దేశంలో నెలకొన్న స్థితి, ఇప్పటికైతే రాష్ట్రంలో పరిస్థితి మన కంట్రోల్‌లోనే ఉంది” అని సీఎం తెలిపారు. అత్యవసరంగా బయటికి పోవాల్సి వస్తే మనిషికి మనిషికి మధ్య ఒక మీటర్ దూరంలో ఉండటానికి ప్రయత్నించాలని, మనల్ని మనం బచాయించుకోవాల్నంటే ఇలాంటిది చేయాల్సిందేనన్నారు.
కరీంనగర్‌లో 50వేల మందికి టెస్టులు.. అంతా సేఫ్
ఇండోనేషియా నుంచి వచ్చినోళ్లు రామగుండం నుంచి కరీంనగర్ వరకు ఆటోలో వచ్చారని, ఆటోడ్రైవర్ సహా ఎవరికీ అక్కడ ఎవరికీ పాజిటివ్ రాలేదని సీఎం తెలిపారు. కరీంనగర్‌లో 50 వేల మందికి టెస్టులు చేశామని, వారిలో ఎవరికీ పాజిటివ్ రాలేదన్నారు. కరీంనగర్‌లో ఇండోనేషియావాళ్లు ఎక్కువగా తిరిగినందున ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ‘‘కరీంనగర్ ఈజ్ సేఫ్’’ అని సీఎం స్పష్టం చేశారు. కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియావాళ్లు చొరబాటు దారులు కాదని చెప్పారు.
ఇండ్లకే పరిమితమవ్వాలి
జనతా కర్ఫ్యూ సందర్భంగా ఎవరిండ్లలో వాళ్లు ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. కూలీలు, కార్మికులు కూడా ఒక్క రోజుకు ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. ధనవంతులు కూడా తమ ఇంట్లో పనిని తామే చేసుకోవాలని ఆయన అన్నారు. పనిమనుషులకు సెలవు ఇవ్వాలని సూచించారు.
డాక్టర్లకు అభినందనలు
‘‘రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు రేయింబవళ్లు పని చేస్తున్న డాక్టర్లకు అభినందనలు. ఆ డాక్టర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తీవ్రత పెరిగితే వాళ్లను కాపాడుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. డాక్టర్లకు ఇన్‌ఫెక్షన్ వస్తే, వారి స్థానంలో పనిచేయడానికి వేరే ప్రాంతాల నుంచి డాక్టర్లు రారు. అందుకే వాళ్లకు అవసరమైన సామగ్రి అంతా తెప్పించినం. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని సీఎం అన్నారు.
ప్రధానిని అవహేళన చేస్తరా?.. ఇడియట్స్..
ఇలాంటి పరిస్థితుల్లో ఐక్యత పాటించాలని, అందరూ ఇండ్లల్లో నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రధాని పిలుపునిస్తే కొందరు సంస్కారం లేకుండా అవహేళన చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ‘‘ప్రైమినిస్టర్ ఒక ముచ్చట చెప్పిండ్రు. దీని మీద కూడా కొందరు దరిద్రులు.. ప్రైమినిస్టర్ను కూడా అవహేళన చేస్తూ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నరు. ఇష్టమున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడ్తున్నరు. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా కొన్ని వందల పిలుపులనిచ్చిన. అప్పుడు బెల్స్ కొట్టమన్నం.. అవి లేకపోతే ఇండ్లల్లకెంచి ప్లేట్లు, చెంచెలు తీసుకొచ్చి కొట్టమన్నం. అది ఐక్యతను ప్రదర్శిచండానికి చేసే పద్ధతి. దాన్ని ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ అంటరు. ఆదివారం సాయంత్రం 5గంటలకు ఎక్కడివాళ్లక్కడ ఇండ్ల బాల్కానీలకు, గడపల దగ్గరకు వచ్చి రెండు చేతులతోటి చప్పట్లుకొట్టాలని ప్రధాని చెప్పిండ్రు. ఆయనేమి రూపాయి ఖర్చు పెట్టమనలేదు కదా.. మొద్దులు మోయాలని చెప్పలేదు కదా! మన రెండు చేతులు జోడించి 5 నిమిషాలు చప్పట్లు కొట్టమంటే తప్పేముంది? దానికి కొంత మంది వెధవలు, ఇడియట్స్, వాళ్లకేం పనుండదు. వాళ్లు ప్రైమినిస్టర్ను కూడా అవహేళన చేసేటట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడ్తున్నరు. ఇట్ ఈజ్ టూ మచ్. ఇట్ వెరీ బ్యాడ్. ఇలాంటి వాళ్లను అరెస్టు చేయండని డీజీపీకి చెప్తున్న. ఒక ప్రధాన మంత్రి దేశంలో పెద్ద సమస్య ఎదుర్కొనే టైంలో కాల్ఇవ్వడమంటే అది మన ఐక్యతకు ప్రతీక. సమస్య వస్తే ఎదుర్కొంటం అనే సంఘీభావం తెలిపేందుకే ఆ పిలుపు. దాన్ని హేళన చేస్తరా? ఇదెక్కడి పద్ధతి. అవర్ ప్రైమినిస్టర్ఈ జ్ అవర్ ప్రైమినిస్టర్.. ప్రతి దాన్ని వ్యంగ్యం చేయడం మంచిది కాదు. దీనికో లిమిట్ ఉంటది” అని సీఎం చెప్పారు.
బస్సులు, మెట్రో రైళ్లు నడుపం
‘‘ఆదివారం వంద శాతం బస్సులు నడుపబోం. ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే ఉపయోగించుకునేందుకు డిపోకు 5 బస్సులు, పది మంది సిబ్బందిని రెడీగా ఉంచుతం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను బోర్డర్‌లోనే ఆపేస్తం. ఇలాంటి పరిస్థితుల్లో కఠినంగానే ఉంటం. ఇప్పుడు నియంత్రణే అందరినీ కాపాడుతుంది. దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లను బంద్ చేశారు. మన హైదరాబాద్‌లో కూడా బంద్ చేస్తున్నం. ఎమర్జెన్సీ అవసరాలకు ఐదు ట్రైన్లను అందుబాటులో ఉంచుతం. అత్యవసరమైతే హెల్త్, మున్సిపల్, ఎమర్జెన్సీ సిబ్బంది ట్రాన్స్‌పోర్టేషన్ కోసం వీటిని ఉపయోగిస్తం” అని సీఎం వివరించారు.
నేను కూడా చప్పట్లు కొడుత
ఆదివారం సాయంత్రం 5గంటలకు ఎవరి ఇండ్ల బాల్కానీల నుంచి వాళ్లు చప్పట్లు కొట్టి కరోనా కట్టడిలో భాగస్వాములవుతున్న డాక్టర్లకు, ఎమెర్జన్సీ సిబ్బందికి అభినందలు చెప్పాలన్న ప్రధాని మోడీ పిలుపును పాటించాలని సీఎం సూచించారు. ఇలా సాలిడారిటీ చెప్పడం ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటుందని అన్నారు. ‘‘ఆ టైంలో తెలంగాణ సమాజం కూడా చప్పట్లు కొట్టాలె. నేను, నా భార్య, నా కుటుంబసభ్యులు ఎక్కడ ఉన్నా బయటికి వచ్చి చప్పట్లు కొడుతం. మా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కొడుతరు. ప్రధానమంత్రి పిలుపుమేరకు సాయంత్రం 5 గంటలకు ఎక్కడ ఉన్నోళ్లు అక్కడ్నే బయటకు వచ్చి రెండు, మూడు నిమిషాలు నాలుగు చప్పట్లు చరిచి ఐక్యతను చాటి చెప్పాలి. ఈ ఐక్యతతో మహమ్మారి పారిపోవాలె. రెడీ టు ఫైట్ అని చాటి చెప్పాలె. సాయంత్రం 5గంటలకు రాష్ట్రం నలుమూలల సైరన్ వినపడేటట్లు ఏర్పాట్లు చేస్తున్నం” అని వివరించారు.
కరోనాకు బాగా స్వాభిమానం
కరోనాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ జోక్ తిరుగుతోందని సీఎం చెప్పారు. ‘‘కరోనా బాగా స్వాభిమానం ఉన్న జబ్బు. అది ఉన్నకాడనే ఉంటది. మనం దాని దగ్గరకు పోయి ఇన్వైట్ చేస్తే కానీ దగ్గరికి రాదు. అది బాగా అభిమానం ఉన్న జబ్బు. దాని దగ్గరకు పోయి ఇన్వైట్ చేద్దామా? వద్దు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వం ఎంత చెప్పినా ప్రజల సహకారం చాలా అవసరం. అందరూ సంయమనం పాటించాలె” అని ఆయన అన్నారు. అందరూ చేతులు శుభ్రంగా కడుక్కుంటే ఆ వైరస్ సోకే ఆస్కారం ఉండదని చెప్పారు. వీలైనంత వరకు చేతులతో ముఖంపై తాకవద్దని, స్వీయ నియంత్రణ, వ్యక్తిగత శుభ్రతతోనే వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని సూచించారు.