కేసీఆర్​ వెనక్కి రావడంపై సందేహాలు !

హైదరాబాద్‌‌, వెలుగు: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. షెడ్యూల్‌‌ కన్నా ముందే అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈనెల 26 వరకు ఆయన ఢిల్లీలోనే ఉండి, అక్కడి నుంచే బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. కానీ మూడు రోజుల ముందే కేసీఆర్‌‌ తిరుగు పయనమవడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌‌ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం.. శని, ఆదివారాల్లో బిజీబిజీగా గడిపారు. అయితే సోమవారం పొద్దంతా దేశ రాజధానిలోనే ఉన్నా.. ప్రముఖ అగ్రికల్చర్‌‌ ఎకనామిస్ట్‌‌ అశోక్‌‌ గులాటీ మినహా ఇంకెవ్వరూ ఆయన్ను కలిసేందుకు రాలేదు. పలువురు ప్రముఖులకు రాయబారం పంపినా ఏ ఒక్కరూ రాకపోవడంతో ఢిల్లీలో ఉండి ఉపయోగం లేదని ఆయన హైదరాబాద్‌‌కు తిరిగి బయల్దేరినట్టు తెలుస్తోంది.

పంజాబ్‌‌కు రావాలంటే కేజ్రీవాల్‌‌ షరతు!

కేసీఆర్‌‌తో కలిసి పంజాబ్‌‌కు రావాలంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌‌తో కలిసి వేదిక పంచుకోవడానికి ఆయన విముఖంగా ఉన్నారని, రైతులకు చెక్కులు ఇస్తామని పలుమార్లు కేజ్రీవాల్‌‌ను సంప్రదించడంతో తమ ప్రభుత్వం చేపట్టిన సర్వోదయ స్కూళ్లు, మోహల్లా క్లినిక్‌‌లకు కచ్చితంగా సందర్శించాలని ఆయన కండిషన్ పెట్టినట్టు ఢిల్లీ సర్కిల్స్‌‌లో ప్రచారం జరుగుతోంది. 

అందుకే సర్వోదయ స్కూల్‌‌, మొహల్లా క్లినిక్‌‌ను కేసీఆర్‌‌ సందర్శించారని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఘనతను కీర్తిస్తూ ప్రత్యేకంగా స్లాట్‌‌లు బుక్‌‌ చేసి మరీ నేషనల్‌‌ ఎలక్ట్రానిక్‌‌ మీడియాలో ప్రచారం చేయించుకున్నారు. కానీ తన ఢిల్లీ, చండీగఢ్‌‌ టూర్‌‌ను నేషనల్‌‌ ఎలక్ట్రానిక్‌‌ మీడియా పట్టించుకోకపోవడంపైనా ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని తెలంగాణ సీఎంవో పీఆర్‌‌ వర్గాలు ప్రయత్నించినా నేషనల్‌‌ ఎలక్ట్రానిక్‌‌ మీడియా కేసీఆర్‌‌ కార్యక్రమాల కవరేజీకి అంతగా ఆసక్తి చూపలేదని సమాచారం. 

సోమవారం పలువురు ప్రముఖులతో సమావేశం కావాలని సీఎం అనుకున్నా.. అశోక్‌‌ గులాటీ ఒక్కరే ఆయన్ను కలిసేందుకు వచ్చారు. మిగతా వారికి ఫోన్లు చేసినా వారి నుంచి పాజిటివ్‌‌గా రెస్పాన్స్‌‌ రాలేదని తెలిసింది. శనివారం భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుదామని కేసీఆర్‌‌ సూచించినా అఖిలేశ్‌‌ యాదవ్‌‌ ఆసక్తి చూపలేదని సమాచారం. కేసీఆర్‌‌ ఢిల్లీకి వెళ్లడానికి ముందు ఆయన నేషనల్‌‌ మీడియా ప్రముఖులు, ఆర్థికరంగ నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులతో భేటీ అవుతారని సీఎంవో నుంచి ప్రెస్‌‌ నోట్‌‌ రిలీజ్‌‌ చేశారు. కేజ్రీవాల్‌‌తో కలిసి సర్వోదయ స్కూల్‌‌ను సందర్శించిన తర్వాత దేశ రాజకీయాల్లో సంచలనం జరుగుతుందని ప్రకటించారు. ఇంతలోనే ఆయన ఢిల్లీ నుంచి వచ్చేయడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

26న బెంగళూరుకు..

ఈనెల 26న కేసీఆర్‌‌ బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. షెడ్యూల్‌‌ ప్రకారం కేసీఆర్‌‌ ఆ రోజు బెంగళూరులోనే బస చేసి.. మరుసటి రోజు మహారాష్ట్రలోని రాలేగావ్‌‌ సిద్ధికి వెళ్లి అన్నాహజారేతో సమావేశం కావాల్సి ఉంది. తర్వాత షిర్డీ సాయిబాబాను దర్శించుకొని హైదరాబాద్‌‌కు తిరిగి రానున్నారు. కేసీఆర్ బెంగళూరు, మహారాష్ట్ర టూర్‌‌ యథావిధిగా కొనసాగుతుందని టీఆర్‌‌ఎస్‌‌ నేతలు చెప్తున్నారు. బీహార్‌‌, పశ్చిమబెంగాల్‌‌కు ఏ రోజు వెళ్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉందని పేర్కొంటున్నారు.