కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి మరో రూ.1000 కోట్లు ఇచ్చేందుకైనా సిద్ధమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. యాదాద్రి తరహాలో కొండగట్టును సైతం అభివృద్ది చేయాలని నిర్ణయించారు. ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి.. భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే గొప్ప ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడంటే కొండగట్టు పేరు వినిపడేలా చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి అనుగుణంగా సేకరించాల్సిన భూములు, సంబంధించిన అంశాలపై లొకేషన్ మ్యాపుతో కేసీఆర్ పరిశీలించారు. ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి.. గర్భాలయం మినహా ఆలయాన్ని విస్తరించాలని సీఎం ఆదేశించారు.
వాస్తు నియమాల ప్రకారం ఏ నిర్మాణాన్ని ఎక్కడ చేపట్టాలో ముందే ప్లాన్ చేయాలని కేసీఆర్ చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండే మంగళ, శని, ఆదివారాలతో పాటు హనుమాన్ జయంతి, ఇతర పండుగల సమయంలో భక్తుల తాకిడికి తగ్గట్లుగా నిర్మాణం జరపాలని సూచించారు. క్యూలైన్ల నిర్మాణం, ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాలు, విశాలమైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలని, కాళేశ్వరం నీటిని కొండగట్టుకు తరలించాలని ఆదేశించారు. నిర్మాణానికి సంబంధించి శిల్పులను సమకూర్చాలని ఆనంద్ సాయికి సూచించారు. ఆలయం పూర్తి కావడానికి సుమారు 3 ఏండ్ల సమయం పడుతుందన్నారు. కొండగట్టు చుట్టూ ఉన్న చెరువుల గురించి సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.