రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్న స్థానాలకు మించి మరో ఏడెనిమిది అధికంగా గెలుస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. 2018 ఎన్నికల్లో స్వంతంగా గెలిచిన 88 స్థానాలకు తోడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూడా చేర్చుకోవడంతో ఆ సంఖ్య 103కు చేరింది. అంటే 103కు అధికంగా ఏడెనిమిది సీట్లు గెలిచి 110 సీట్లు సాధిస్తారా..? లేక సొంతంగా గెలిచిన 88 స్థానాల కంటే అధికంగా గెలుస్తారా అని స్పష్టత ఇవ్వలేదు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటనలో ఆత్మవిశ్వాసం మితిమీరిందని చెప్పవచ్చు. 2018 ఎన్నికల్లో వచ్చినన్ని స్థానాలు ఎట్టిపరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్ అధికార బలం, ఆర్థిక బలం, కొన్ని సంక్షేమ పథకాలతో ముందున్నది. అయినా కేసీఆర్‌కు మ్యాజిక్ ఫిగర్ సాధించడం కంటే టికెట్ కేటాయింపులే పెద్ద సమస్యగా మారవచ్చు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.
అదే సమయంలో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా సీఎం కేసీఆర్‌పై సుమారు 40% మంది ఓటర్లు విశ్వాసం కలిగుండడం ఆ పార్టీకి కలిసొచ్చే ప్రధానాంశం. దీంతోపాటు ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో ఐక్యత లేకపోవడం బీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశాలు. జనం నాడి, తెలంగాణ ప్రజల మనోభావాలు తెలిసిన కేసీఆర్.. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, సింగరేణి కార్మికులకు ప్రయోజనాలు, రైతు రుణ మాఫీలతోపాటు మరిన్ని అస్త్రాలు తమ అమ్ములపొదిలో ఉన్నాయని, మరిన్ని ప్రజారంజక పథకాలను మేనిఫెస్టోలో పెడుతామని అసెంబ్లీలో ప్రకటించి ప్రతిపక్షాలపై మైండ్ గేమ్ ప్రారంభించారు. 2018 ఎన్నికల్లో రైతు బంధు ఆదుకున్నట్టే, 2023లో ఈ వరాలు గట్టెక్కిస్తాయనే విశ్వాసంతో కేసీఆర్ ఉన్నారు.
బీజేపీ పరిస్థితి ఇదీ!
బీజేపీలో కిషన్‌రెడ్డికి సారథ్య బాధ్యతలు అప్పగించినా పార్టీలో స్తబ్దత కొనసాగుతూనే ఉంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ సన్మాన కార్యక్రమానికి కొందరు సీనియర్లు దూరంగా ఉండడం పార్టీలో కొనసాగుతున్న విభేదాలకు తార్కాణం. బీజేపీ నాయకత్వానికి ముందున్న అతిపెద్ద సవాల్ 119 స్థానాలకు గట్టి అభ్యర్థులను నిలబెట్టడమే. గెలుపోటములు చూడకుండా కష్టపడి పనిచేయడమే ఆ పార్టీకి మిగిలిన పని.
ఎంఐఎం, కమ్యూనిస్టులు ఎటువైపు?
ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉండే నియోజకవర్గాల్లో వీలైన ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి పరోక్షంగా కేసీఆర్‌కు మేలు చేసే దిశగా ఓవైసీ సోదరులు అడుగులేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి ‘బి’ టీమ్‌గా మారిందనే వార్తలతో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపకుండా ఓట్లను చీల్చి కేసీఆర్‌కు కలిసొచ్చేలా చేయడమే ఎంఐఎం లక్ష్యమనే ప్రచారం ఉంది. రాష్ట్రంలో పొత్తు లేనిదే మనుగడ లేదనే నిర్ణయానికి వచ్చిన సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు వీలైతే బీఆర్‌ఎస్‌తో లేదంటే కాంగ్రెస్‌తో దోస్తీ కోసం తాపత్రయపడుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికల్లో వీరితో జతకలిసి లాభపడిన కేసీఆర్ అనంతరం వ్యూహాత్మక మౌనంతో వామపక్షాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి.
క్షేత్రస్తాయిలో పరిశీలిస్తే బీఆర్‌ఎస్‌కు మెరుగైన పరిస్థితి ఉన్నా, కాంగ్రెస్ తీవ్రమైన పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీది మూడో స్థానమే కనిపిస్తోంది. రాజకీయాల్లో రెండవ స్థానానికి బహుమతి లేదంటారు. కాంగ్రెస్‌పార్టీకి ఈసారి కూడా రెండో స్థానమేనా? వేచిచూడాల్సిందే. బీఆర్‌ఎస్ గ్రామస్థాయి నుంచి సంస్థాగతంగా బలంగా ఉండడంతోపాటు పార్టీ ఆశావహ అభ్యర్థులు ఆర్థికంగా కూడా బలంగా ఉండడం, కాంగ్రెస్, బీజేపీలు ఆ విషయంలో వెనుకబడి ఉండడం బీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అంశం. ఈ పరిణామాలు గమనిస్తే బీఆర్‌ఎస్ కారు వేగాన్ని ప్రతిపక్షాలు అందుకోగలవా..? లేవా...? వేచి చూడాలి.
కాంగ్రెస్ కు సవాళ్లే ఎక్కువ
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సమర్పించిన నివేదిక పార్టీ నేతలను షాక్‌కు గురిచేస్తోంది. ఈ నివేదిక ప్రకారం కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే 41 స్థానాలను ‘ఏ’ కేటగిరీలో, కష్టపడితే గెలిచే 42 స్థానాలను ‘బి’ కేటగిరీలో, ఎక్కువ శ్రమపడాల్సిన 36 స్థానాలను ‘సి’ కేటగిరీలో పెట్టారు. ‘బి’ కేటగిరిలో ఉన్న 42 స్థానాల్లో పైచేయి సాధిస్తేనే రాష్ట్ర పగ్గాలు అందుకోగలమని నివేదిక సారాంశం. గెలిచిన వారు కూడా పార్టీలో కొనసాగుతారా లేక పార్టీ మారుతారా అనే చర్చ ప్రజల్లో ఉంది. గెలిచిన అభ్యర్థులు పార్టీలోనే ఉంటారని ప్రజలకు భరోసా కల్పించడమే కాంగ్రెస్‌కు పెద్ద సవాలు. ఓటర్లలో ఆ నమ్మకం కలిగించేందుకు పార్టీ మారబోమని అభ్యర్థుల నుంచి ముందస్తుగానే హామీ పత్రాలు తీసుకోవాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్టు వార్తలున్నాయి. కర్ణాటక గెలుపుతో వచ్చిన ఉత్సాహం ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో కనిపించట్లేదు. పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో వాస్తుతోపాటు ఆధునీకరణకు చర్యలు తీసుకున్నారు. తీరా ఇప్పుడు పార్టీలో చేరికలతో సహా ఇతర కీలక నిర్ణయాలను ఆయన ఇంటి నుండే నిర్వహిస్తున్నారు. తమ సొంత జిల్లాల్లో ఇతర జిల్లా నేతలు జోక్యం చేసుకోవద్దంటూనే, ఇతర జిల్లాల్లో కూడా తమ వారికి ప్రాధాన్యతివ్వాలని సీనియర్ నేతలు కోరుతుండడం పార్టీలో విభేదాలను పెంచుతున్నాయి.
అసెంబ్లీలో ప్రతిపక్షాల వైఫల్యం
అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ముందు తేలిపోయారు. వంద రోజులకుపైగా వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన పాదయాత్రలో గుర్తించిన ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రతిబింబించలేకపోయారు. కేటీఆర్ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలపై పరుషజాలంతో దూషించినా, ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసినా వాటికి ధీటుగా జవాబు చెప్పడంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం పూర్తిగా విఫలమయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తే, అదే స్థాయిలో ప్రతిపక్షాలు స్పందించలేకపోయాయి. గత కాంగ్రెస్ పాలనను, కేంద్రంలోని బీజేపీని లక్ష్యంగా చేసుకొని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేసినా సభలో ధీటుగా ఎదుర్కోలేని ప్రతిపక్షాలు కనీసం సభ వెలుపలైనా అవి తప్పని ఎదురుదాడి చేయలేకపోయాయి.
తెలంగాణ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల రణరంగానికి రాజకీయ పార్టీలు అసెంబ్లీ సమావేశాల వేదికగా అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. బరాబర్ మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ఇప్పుడున్న వాటికంటే ఏడెనిమిది సీట్లు ఎక్కువగానే గెలుస్తామని సీఎం కేసీఆర్ ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తే, బీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదని ఆ పార్టీ పాతిక సీట్లను మించి గెలవదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ చెబుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాను మళ్లీ శాసనసభలో అడుగుపెడతానో, లేనో అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి క్షేత్రస్థాయిలో వారి పార్టీ పరిస్థితిని ప్రతిబింబించారు. ఈ అంశాలను పరిశీలిస్తే రాజకీయపార్టీలన్నీ ఓటరు మనస్సులో ఏముందో, ప్రజాక్షేత్రంలో పరిస్థితులు ఏలా ఉన్నాయో అని అంచనా వేయడంలో పూర్తిగా వైఫల్యం చెందినట్టు స్పష్టమౌతోంది.
- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, పొలిటికల్ ఎనలిస్ట్