కాంగ్రెస్​ వస్తే ధరణి ఉండదు.. కరెంట్​ రాదు : సీఎం కేసీఆర్

  • ఆ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ దళారుల రాజ్యం: కేసీఆర్
  • ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెసోళ్లు
  • ఏండ్లపాటు రాష్ట్రాన్ని పాలించినోళ్లు సాగునీరు ఎందుకియ్యలే 
  • రాష్ట్రంలో రైతులకు 3 గంటల కరెంటు చాలంటున్నడు..
  • 30 లక్షల మందికి 10 హెచ్​పీ మోటార్లు వీని అయ్య కొనిస్తడా?
  • గోదావరికి వెయ్యి కోట్లతో కరకట్టలు కడ్తం 
  • దమ్మపేట, బూర్గంపహాడ్, నర్సంపేట సభల్లో సీఎం
  • పినపాక, భద్రాచలంలో 100 శాతం దళితబంధు అమలు చేస్తమని హామీ

భద్రాద్రికొత్తగూడెం / భద్రాచలం, వరంగల్‍ /నర్సంపేట, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్‍ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదు, ధరణి ఉండదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘3 గంటలు మాత్రమే కరెంట్‍ ఇస్తామని ఆ పార్టీ నేతలు ఖుల్లం ఖుల్లా చెప్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటికే మూడుసార్లు ఈ మాట చెప్పారు.  రైతులకు బీఆర్‍ఎస్‍   ఇచ్చే 24 గంటల కరెంట్‍ అవసరం లేదని, 10హెచ్‍పీ మోటార్‍ ఉంటే  3 గంటల్లో పొలమంతా పారుతుందని అంటున్నారు. మన రైతులు 3హెచ్‍పీ లేదంటే  5 హెచ్‍పీ మోటార్‍ వాడుతున్నారు.10 హెచ్‍పీ మోటార్‍ వీని అయ్య కొనిస్తడా? కాంగ్రెసోళ్లు అన్న మాట ప్రకారం ఇప్పుడు 30 లక్షల 10 హెచ్‍పీ మోటార్లు కొనాల్నా”అని సీఎం కేసీఆర్​మండిపడ్డారు. సోమవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, బూర్గంపహాడ్, వరంగల్‍ జిల్లా నర్సంపేటలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్‍ ఇక్కడికి వచ్చి తమ రాష్ట్రంలో 5 గంటల ఉచిత కరెంట్‍ ఇస్తున్నామంటున్నారని, తెలంగాణలో 24 గంటల కరెంట్‍ ఇస్తున్నామనే విషయం ఆ సన్నాసికి చెప్పానని ఆయన అన్నారు.  

అవగాహన లేని మాటలవి.. 

ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామంటూ రాహూల్ గాంధీ, రేవంత్​రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్​ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్​ మండిపడ్డారు. ధరణిని తీసేస్తే దళారుల రాజ్యం వస్తుందన్నారు. ధరణి ద్వారానే రైతుల కడుపులో సల్ల కదలకుండా డబ్బులు పంపిస్తున్నామని ఆయన గుర్తుచేశారు. మునుపు వీఆర్వో కానీ, గిర్దావర్ కానీ, తహసీల్దార్‍ కానీ.. ఎవ్వనికి ఒక్కనికి కోపమొచ్చినా జుట్లుజుట్లు ముడేసీ తాకులాట పెట్టేవాళ్లని, ఆఫీసుల చుట్టు తిప్పి లంచాలు గుంజేవాళ్లను సీఎం అన్నారు. ధరణి పోర్టల్‍ ఉంది కాబట్టి  రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు  నేరుగా రైతుల ఖాతాల్లో పడుతున్నాయని చెప్పారు. ధరణిని తీసేస్తే మళ్లీ పహానీ నకళ్లు పట్టుకుని ఎమ్మార్వో ఆఫీసులు, అగ్రికల్చర్‍ ఆఫీసర్ల చుట్టూ తిరగాలని, ప్రభుత్వం నుంచి రూ.70 వేలొస్తే.. అందులో 30 వేలు లావో అంటారని చెప్పారు. ‘‘ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‍, మనల్ని కరువుకు గురిచేసిందే కాంగ్రెస్‍,  కృష్ణా, గోదావరి నదులు రాష్ట్రాన్ని ఆనుకుని పారుతుంటే గుక్కెడు మంచినీరు, సాగునీరు ఇవ్వకుండా సావకొట్టి ఇబ్బందులు పెట్టిందే కాంగ్రెస్‍ పార్టీ” అని  కేసీఆర్ విమర్శించారు. కేసీఆర్‍ కంటే ఎత్తు, దొడ్డు ఉన్నోళ్లు రాష్ట్రంలో సీఎంలు అయినా కరెంట్‍, నీళ్లు ఎందుకియ్యలేదో ఆలోచించాలని సూచించారు. 

రైతు బంధు దుబారా ఎట్లయితది?

రైతుబంధు  ఇచ్చి కేసీఆర్​ ప్రజల సొమ్ము  దుబారా చేస్తున్నాడని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అంటున్నారని,  రైతుబంధు దుబారా ఎట్లయితదని కేసీఆర్ ప్రశ్నించారు. మణుగూరులో పెట్టవలసిన థర్మల్ పవర్​ ప్లాంట్​ను విజయవాడకు తీసుకెళ్లారన్నారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం మణుగూరులో భద్రాద్రి పవర్​ ప్లాంట్​ ఏర్పాటు చేసిందన్నారు. బీఆర్​ఎస్​ క్యాండిడేట్లను అసెంబ్లీ గేటు​ దాటనీయమని కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారని, వారి తాట తీసి బుద్ది చెప్పాల్సిన టైం వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చాక తాగు, సాగు నీరు, కరెంట్, రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్, సీతమ్మ సాగర్​తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఇంచు భూమికి సాగునీరు అందుతోందన్నారు. ‘‘24 గంటల కరెంట్​ ఉండాలంటే మెచ్చా నాగేశ్వరరావు గెలవాలె. అశ్వారావుపేటలో ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తది” అని కేసీఆర్ అన్నారు.

గెలిచాక భద్రాచలం వచ్చి రెండ్రోజులు ఉంటా.. 

‘‘అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలు గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. ఇక్కడ దళిత వర్గాల బతుకులు బాగాలేవు, వాళ్లకు భూములు లేవు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లయినా దళితుల బతులకు మారలె. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక దళితబంధు తెచ్చినం’’  అని కేసీఆర్ అన్నారు. ‘గెలిచిన తర్వాత  భద్రాచలం వచ్చి రెండ్రోజులు ఇక్కడే ఉంటా. గోదావరి వరద నివారణ పనుల కోసం శంకుస్థాపన చేస్తా. రూ.1000 కోట్లతో గోదావరికి కరకట్టలు కడతాం. దళితబంధును పినపాక, భద్రాచలం సెగ్మెంట్లను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి 100% దళితులకు పంపిణీ చేస్తం’ అని అన్నారు.

ALSO READ : సుమన్​కు కమీషన్లపై ఉన్న సోయి ప్రజల మీద లేదు : వివేక్​ వెంకటస్వామి

నర్సంపేట మీద షర్మిల పగబట్టిందట

‘సమైక్యవాదులు నర్సంపేటలో చెంచాగిరి చేస్తామంటే సుదర్శన్‍రెడ్డి అడ్డుపడ్డాడని షర్మిల పగ పట్టిందంట. ఆమె ఇప్పుడు డబ్బులు కట్టలు పంపిస్తోందట. పరాయి రాష్ట్రమోళ్లు డబ్బు సంచులు పంపించి మిమ్మల్ని ఓడిస్తామంటే ఓడిపోదామా?. మనకు సమైక్యవాది షర్మిల కావాల్నా.. మన నీళ్లు, మన పథకాలు కావాల్నా?’ అంటూ కేసీఆర్ తొలిసారి షర్మిల గురించి ప్రశ్నించారు. పోయినసారి కంటే ఎక్కువ సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు.