భూపాలపల్లి, ములుగు అభివృద్ధి బాధ్యత నాదే.. బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ ‌‌

  • రెండు జిల్లాల్లో మెడికల్ ‌‌ కాలేజీలు ఏర్పాటు చేశాం
  • ములుగులో 48,160 ఎకరాలకు పోడు పట్టాలిచ్చాం

జయశంకర్ ‌‌  ‌‌భూపాలపల్లి, వెలుగు : మూడోసారి అధికారంలోకి రాగానే భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటానని సీఎం కేసీఆర్ ‌‌ హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ములుగు, భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. రెండు జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే మెడికల్ ‌‌ ‌‌ కాలేజీలు ఏర్పాటు చేసినట్లుగా గుర్తు చేశారు. ములుగు జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కరించేందుకు 48,160 ఎకరాలకు పట్టాలు ఇచ్చామని, పోడు రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేశామని చెప్పారు.

రైతుబంధు పెట్టినం.. రైతు బీమా ఇస్తున్నం.. గిరిజన గ్రామాల్లో త్రీ ఫేజ్ ‌‌ కనెక్షన్లు ఇస్తున్నాం’ అని తెలిపారు. గిరిజనేతురులకు పోడు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. పోయిన ఎలక్షన్లలో కూడా ఇక్కడే మాట్లాడానని, అప్పుడు తమ క్యాండిడేట్ ‌‌ను ఓడించినా తాను అలగలేదని, రెండోసారి సీఎం కాగానే ఇచ్చిన మాట ప్రకారం ములుగును జిల్లా చేశానని గుర్తు చేశారు. ములుగులో మెడికల్ ‌‌ కాలేజీతో పాటు, 350 పడకల హాస్పిటల్‌, ఏటూరునాగారంలో డయాలిసిస్ ‌‌ సెంటర్ ‌‌ ఏర్పాటు చేశామన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క తమ దగ్గరికి రాదని, ఏం అడగదని చెప్పారు. కాంగ్రెస్ ‌‌కు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు.

వర్షం వల్ల ఇబ్బందులు

ములుగు, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో శుక్రవారం ఉదయం నుంచి వర్షం పడింది. దీంతో బీఆర్ ‌‌ఎస్ ‌‌ బహిరంగ సభా ప్రాంగణాలు బురదమయంగా మారాయి. ప్రజలంతా బురదలోనే నడుచుకుంటూ సభకు వచ్చారు. ములుగులో సీఎం కేసీఆర్ ‌‌ మాట్లాడుతున్న టైంలో చిరుజల్లులు పడడంతో ప్రజలు ప్లకార్డులు పట్టుకొని తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భూపాలపల్లిలో వర్షం పడుతుండడంతో కేవలం 10 నిమిషాల్లో ప్రసంగం ముగించారు.