వడ్లను కొనడం చేతకాని బీజేపీకి..వంద కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం చేతనైతదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని పన్నాగం పన్నిన బీజేపీకి మునుగోడు ప్రజలు ఓటు ద్వారా బుద్దిచెప్పాలని కోరారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగింది..గ్రాస్ , పెట్రోల్ ధరలు పెరిగాయని అంటున్న ప్రజలు..వాటిపై పోరాడాలంటే టీఆర్ఎస్కు బలం ఇవ్వాలని కోరారు. కత్తి ఒకడి చేతిలో పెట్టి..యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎలా అని ప్రశ్నించారు.
వాళ్లు ఒక్క క్షణం కూడ పదవుల్లో ఉండడానికి వీల్లేదు
ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక ఎవరున్నారో వాళ్లు ఒక్క క్షణం కూడ పదవుల్లో ఉండడానికి వీల్లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలును మోడీ ఎందుకు ప్రోత్సహిస్తున్నరో చెప్పాలి. మోడీ అండదండలు లేకుండా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు హైదరాబాద్ కు వచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారా ? ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు వందల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి ? ఇంకా మీకు ఏం కావాలి ?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. రెండు సార్లు ప్రధానిగా బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో చెప్పాలని ఆయన అన్నారు. ఇంత అరాచకం జరుగుతుంటే మౌనంగా ఉందామా అని మునుగోడు ప్రజలను కేసీఆర్ అడిగారు. 20,30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్ ను పడగొట్టాలని చూశారన్నారు. మునుగోడులో బీజేపీకి డిపాజిట్ వస్తే కేసీఆర్ ను పక్కకు జరుపుతారన్నారు. అందుకే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని తమ పార్టీ ఎమ్మెల్యేలు నిరూపించారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో వచ్చి చంచల్ గూడ జైలులో ఉన్నారని కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహరంలో మీరు చూసింది చిన్నదేనన్నారు. చూడాల్సింది ఇంకా చాలా ఉందని కేసీఆర్ చెప్పారు. అయితే మొయినాబాద్ ఫాం హౌస్ వ్యవహారంతో సంబంధమున్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వేదికపైకి పిలిచి మునుగోడు ప్రజలకు కేసీఆర్ చూపించడం గమనార్హం.
జీఎస్టీతో నేతన్న నడ్డివిరిచింది..
నేతన్న సంక్షేమం కోసం టీఆర్ఎస్ కృషి చేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో రూ. 70 కోట్లు ఉన్న చేనేత బడ్జెట్ను టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 1200 కోట్లు పెంచామన్నారు. అలాగే చేనేత బీమా పథకాన్ని తెచ్చామని చెప్పారు. రైతుల కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. దేశంలో రైతు బీమా ఎక్కడా లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే..కేంద్రం ఉచిత పథకాలు ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తే ఏడాదికి లక్షా 45 వేల కోట్లు ఖర్చవుతాయన్నారు. కానీ రూ. 14 లక్షల కోట్లు కార్పొరేట్ గద్దలకు ఇచ్చిన మోడీ...రైతులకు ఉచిత కరెంట్ మాత్రం ఇవ్వడం లేదన్నారు.
తడిబట్టలతో ప్రమాణం చేస్తే తప్పు ఒప్పు అవుతుందా..?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తడిబట్టలతో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారని..తడిబట్టలతో ప్రమాణం చేస్తే ఒప్పవుతుందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దొంగలు అడ్డంగా దొరికారని..వాళ్లు జైళ్లో ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో తాను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. టీవీల్లో చూసింది కొంతే..అని ఇంకా వ్యవహారం చాలా ఉందని వెల్లడించారు. ఇలాంటి దుర్మార్గులను కూకటివేళ్లతో పీకి..బంగాళాఖాతంలో పడేయాలన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ప్రభుత్వాలను పడగొట్టాలని కుట్రలు చేస్తున్నారన్నారు. ఇలాంటి కుట్రలకు ఓటుతో సమాధానం చెప్పాలని కోరారు.
జగదీష్ రెడ్డి ఏం తప్పు చేశాడు...?
మంత్రి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో ఉన్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఉద్యమంలో..తెలంగాణ ఏర్పాడ్డాక ప్రభుత్వంలో తనకు అండగా నిలిచారన్నారు. కానీ కుట్రలు చేసి జగదీష్ రెడ్డిని సభలో లేకుండా ..ప్రచారంలో పాల్గొనకుండా చేశారని మండిపడ్డారు. బలవంతంగా రుద్దబడ్డ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలను నూకలు తినమని హేళన చేసిన వాళ్లు..ఇవాళ ఓట్లు ఎలా అడుగుతారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నూకలు తినమని చెప్పినోళ్ల తోకలు కట్ చేయాలన్నారు. ఎన్నికలు రాగానే ప్రజలు గత్తర గత్తర కావద్దని..గోల్ మాల్లో చిక్కుకోవద్దన్నారు. మునుగోడు ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత తాను తీసుకుంటానని...ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు.