ప్రధానే నా ప్రభుత్వాన్ని కూలగొడ్త అంటడు:సీఎం కేసీఆర్

ప్రధానే నా ప్రభుత్వాన్ని కూలగొడ్త అంటడు:సీఎం కేసీఆర్
  • తెలంగాణ లెక్కనే దేశాన్ని మార్చేద్దాం
  • మీరు ఆశీర్వదిస్తే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తం
  • కృష్ణా నీటి వాటాను కేంద్రం తేలుస్తలేదు
  • ప్రధానే నా ప్రభుత్వాన్ని కూలగొడ్త అంటడు
  • భావోద్వేగాలను రెచ్చగొడ్తున్నరు 
  • మేలైన నాయకులను ఇబ్బంది పెడ్తున్నరు
  • ప్రతిపక్ష లీడర్లపై దాడి చేస్తున్నరని ఫైర్​

మహబూబ్​నగర్​, వెలుగు: ఖాళీ జాగా ఉన్న పేద కుటుంబాలు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఇస్తామని, రానున్న పది, పదిహేను రోజుల్లో అవసరమైన నిధులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఈ స్కీము కింద పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లు అదనంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో నాణ్యమైన రైతులు ఉన్నారని దేశం మొత్తం చర్చించుకుంటున్నదని.. కర్నాటక, మహారాష్ట్రకు చెందిన రైతులు, ప్రజలు, సర్పంచులు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని ఆయన అన్నారు. దేశాన్ని బాగు చేసుకునేందుకు తెలంగాణ తరఫున జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తామని చెప్పారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్​ భవనాన్ని, టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసును ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎంవీఎస్​ కాలేజ్​ గ్రౌండ్​లో ఏర్పాటుచేసిన పబ్లిక్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు.  కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్​సాగర్​ ప్రాజెక్టులను గత పాలకులు దశాబ్దాలుగా పెండిగ్​ పెట్టారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే  కంప్లీట్​ చేశామని చెప్పారు.మిషన్​ కాకతీయ పథకంతో చెరువులను మంచిగా చేసుకొని, చెక్​ డ్యామ్​లను కట్టుకున్నామని తెలి పారు.  24 గంటలు కరెంటు ఇస్తున్నామని, ఇప్పు డు పాలమూరు జిల్లా అంటే కరువు జిల్లా కాదని, పచ్చపడ్డ పచ్చని జిల్లా అని తెలిపారు. 

గుజరాత్​లో సరైన నీళ్లు, కరెంట్​ లేవు

గుజరాత్​లో సరైన నీళ్లు, కరెంటు లేదని కేసీఆర్​ విమర్శించారు. ఈ విషయాలను చెబితే సిగ్గుపోతోందని ఎద్దేవా చేశారు. 75 ఏండ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశ రాజధానిలో కరెంటు కోతలు, మంచి నీటి ఇబ్బందులు ఉన్నాయని, రోజుకు నాలుగైదు ట్యాంకర్లు కొంటున్నట్లు అక్కడి నుంచి కొంతమంది తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. 

కేంద్రం కృష్ణా వాటా తేలుస్తలే 

కాంగ్రెస్​ లీడర్లు, ప్రధాని మోడీ పాలమూరు వచ్చి తెలంగాణను హం బనాయేంగే అంటే హం బనా యేంగే అంటున్నారని, అబ్​ కిదర్​ గయారే బై అని కేసీఆర్​ ప్రశ్నించారు. కేంద్రం తీరు పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉందని విమర్శించారు. కరువు జిల్లా పాలమూరు, ఫ్లోరైడ్​ జిల్లా నల్లొండ, ఎండిపోయిన జిల్లా రంగారెడ్డి జిల్లాలు కృష్ణాజలాల్లో నీటి హక్కు కలిగి ఉన్నాయని, ఈ నదిలో తెలంగాణ వాటా తేల్చమంటే కేంద్రం 8ఏండ్లుగా నానుస్తున్నదని మండిపడ్డారు. 150 సార్లు దరఖాస్తులు ఇచ్చినా స్పందించడం లేదని అన్నారు. ‘‘కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చకుంటే ప్రాజెక్టులకు పర్మిషన్లు ఎప్పుడు రావాలి? ప్రాజెక్టులు ఎప్పుడు కట్టాలి? నీళ్లు ఎప్పుడు రావాలి? అసలు మా వాటా తేలుస్తరా? లేదా?’’ అని ప్రశ్నించారు. పాలమూరు–--రంగారెడ్డి స్కీంకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం లేదని ఆరోపించారు. కృష్ణా నీటి వాటాలను తేల్చకపోవడం వల్లే నారాయణపేట్, మక్తల్​, కొడంగల్​ కెనాల్స్​ పూర్తి చేయలేకపోతున్నామని, కాల్వలు పూర్తయితే 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయని అన్నారు. 

కేంద్రం తీరుతో 3 లక్షల కోట్లు నష్టం

కేంద్రం తీరు వల్ల తెలంగాణ 3లక్షల కోట్లు నష్టపోయిందని కేసీఆర్ అన్నారు. కష్టపడి అవినీతి రహితంగా తాము పని చేస్తుంటే, కేంద్రం అడ్డు కుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులివ్వకుండా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నదన్నారు. ‘‘మేం పని చేసినట్లు కేంద్ర ప్రభుత్వం చేసి ఉంటే.. తెలంగాణ జీఎస్డీపీ 11.5 లక్షల కోట్లు కాకుండా 14.5 లక్షల కోట్లకు పెరిగేది” అని అన్నారు. మహబూబ్​నగర్​లోని సమీకృత కలె క్టరేట్​ ప్రారంభోత్సవం అనంతరం ఆయన జిల్లా ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్​ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర బడ్జెట్​ 62 వేల కోట్లు ఉందని, ప్రస్తుతం రెండున్నర లక్షల కోట్లు చేరిందని అన్నారు. ‘‘రాష్ట్ర ఏర్పాటు సమయంలో జీఎస్​డీపీ ఐదు లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 11.5 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం దేశంలో మొదటి స్థానంలో ఉంది. మలిదశ కంటి వెలుగు కార్యక్రమం త్వరలో ప్రారంభం అవుతది. దీనిని  విజయవంతం చేసి జిల్లాలో దృష్టి సమస్యలు లేకుండా చూసుకోవాలి” అని తెలిపారు. 

ఏ కారణంతో ప్రభుత్వాన్ని కూలగొడ్తవ్​

‘‘కేంద్రం తీరు మాకు చేతకాదు.. మీరు చేస్తే కాళ్లు అడ్డు పెడతాం అన్నట్లు ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే.. మీ ప్రభుత్వాలను కూల్చేస్తామని బెదిరిస్తున్నరు. ప్రధానే స్వయంగా కేసీఆర్​ నీ ప్రభుత్వాన్ని కూలగొడతా అంటడు. ఏ కారణంతో ప్రభుత్వాన్ని కూలగొడతవ్​? మీరు ఎట్ల గెలిచిన్రో మేమూ అట్లనే గెలిచినం. చిల్లర రాజకీయాల లక్ష్యాల కోసం ఉన్మాదాన్ని, భావోద్వేగాలను రెచ్చగొడుతున్నరు.  మేలైన నాయకులను ఇబ్బంది పెడ్తున్నరు. ప్రతిపక్ష లీడర్ల మీద దాడులు చేస్తున్నరు.. బెబ్బులిలాగా పంజా లేపి, దెబ్బకొట్టాలె..’’ అని కేసీఆర్​ పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్​లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వస్తే, దొరకబట్టి జైల్లో పెట్టించామని అన్నారు. దేశంలో ఎక్కడో ఒకచోట నుంచి తిరుగుబాటు చేయాలని, ఇక్కడే తిరుగుబాటు మొదలుపెట్టామని, మీ ఆశీర్వాదం కావాలని ప్రజలను కేసీఆర్​ కోరారు. దేశాన్ని బాగు చేసుకునేందుకు తెలంగాణ తరఫున జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని, బీఆర్​ఎస్​కు పోదామని అన్నారు. ‘‘తెలంగాణలో మీరు గట్టిగా చూసుకుంటే, కేంద్రంలో నేను గట్టిగా చూసుకుంట. తెలంగాణ రాష్ట్రం మాదిరిగా దేశాన్ని మార్చేసి, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేద్దాం” అని ఆయన చెప్పారు. 


తెలంగాణలో మీరు గట్టిగా చూసుకుంటే, కేంద్రంలో నేను గట్టిగా చూసుకుంట. తెలంగాణ రాష్ట్రం మాదిరిగా దేశాన్ని మార్చేసుకుందాం. మేం పని చేసినట్లు కేంద్ర ప్రభుత్వం చేసి ఉంటే తెలంగాణ జీఎస్డీపీ 11.5 లక్షల కోట్లు కాకుండా 14.5 లక్షల కోట్లకు పెరిగేది. వాళ్లకు మంచి చేసుడు శాతకాదు.. పేదలను ఆదుకునుడు శాతకాదు.. ఆర్థికంగా అభివృద్ధి చేసుడు శాతకాదు.. ఉన్నయన్నీ ప్రైవేటు కార్పొరేట్​ గద్దలకు అమ్మేసుడే తెలుసు.. ఇదేనా దేశం? ఈ దేశమేనా మనం కోరుకున్నది. ఎక్కడ్నో ఓ కాడ దీనికొక బెబ్బులిలాగా పంజా లేవాలె. - సీఎం కేసీఆర్​

పల్లె పల్లెలో పల్లేర్లు మొలిసే పాలమూరులోనా.. అనే పాట ఉండేది. ఈ రోజు పాలమూరులో పల్లేర్లు మాయమైనయ్​.. ముంబై బస్సు బందైంది.. వలసపోయినోళ్లు వాపస్​​ వస్తున్నరు. మారిన పాలమూరు పరిస్థితులపై పాటలు రాయాలని గోరటి వెంకన్న, సాయిచంద్​, ఇతర రచయితలను కోరిన.  వలసలతో వలవల విలపించు పాలమూరు.. పెండింగ్​ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి.. చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి.. పాలమూరు తల్లి పచ్చని పైట కప్పుకున్నది.. అని రాయాలని  చెప్పిన. - కేసీఆర్​