- అందుకోసం సైనికుడిలా పనిచేస్త: కేసీఆర్
- సీఎంలను గుంపు చేసుడు, పార్టీలను కలుపుడుతోటి లాభం లేదు
- బీజేపీని గద్దె దించుడు చెత్త ఎజెండా.. ప్రజలను గద్దెనెక్కించాలె
- మన లెక్క పని చేస్తే దేశం చీకట్లలో మగ్గే ఖర్మ తప్పేది
- ఒక్క మంత్రిపై కూడా అవినీతి ఆరోపణలు లేవు
- అన్ని రంగాల్లో రాష్ట్రం నంబర్ వన్‌గా ఉన్నది
- 13 తీర్మానాలు ఆమోదించిన ప్లీనరీ
- అన్నింటిలో కేంద్రమే టార్గెట్
హైదరాబాద్, వెలుగు: దేశానికి కావాల్సింది ఫ్రంట్లు, టెంట్లు కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని, దాని కోసం తాను ముందుకు వెళ్తానని టీఆర్ ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీజేపీని గద్దె దించుడు అనేది చెత్త ఎజెండా అని, ప్రజలను గద్దెనెక్కించడమే ముఖ్యమని చెప్పారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదని, ప్రజల జీవితాలని ఆయన పేర్కొన్నారు. ‘‘కావాల్సింది రావాల్సింది.. రాజకీయ ఫ్రంట్లు కాదు.. ఇప్పటికే చానా వచ్చినయ్. సెకండ్ ఫ్రంట్, ఫస్ట్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, మన్ను ఫ్రంట్ అని వచ్చినయ్.. ఏం సాధించినయ్.. ఏం జరిగింది? కావాల్సింది రాజకీయ పునరేకీకరణలు కాదు.. డొల్ల మాటలు, కల్ల మాటలు కాదు. దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా. అద్భుతమైన ప్రగతిపథంలో తీసుకుపోయే ఎజెండా కావాలి” అని అన్నారు. దేశానికి కొత్త ఎజెండాను సెట్ చేయడానికి ఒక సైనికుడిలాగా తాను పనిచేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో 90కిపైగా అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ గెలవబోతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయన్నారు.
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లామని, అన్నిరంగాల్లో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. ఎల్లయ్యనో, మల్లయ్యనోప్రధానిని చేసేందుకు కాదు దేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందని, దీనిపై చర్చ జరగాల్సి అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి, దేశ గతిని, స్థితిని మార్చడానికి, దేశాన్ని సరైన పంథాలో నడిపించడానికి ఒక కొత్త ఎజెండా, సిద్ధాంతం రూపొందాలని ఆయన అన్నారు. ‘‘ఏదో చిల్లర మల్లర రాజకీయాలు, ఇద్దరు ముఖ్యమంత్రులను గుంపు చేయడం, నాలుగు పార్టీలకు ఒకటి చేయడం, దోస్తానా కట్టడం వల్ల ప్రయోజనం లేదు. కావాల్సింది ప్రత్యామ్నాయ కూటమి కాదు.. గుంపు కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి. ఆ దారులు వెతకాలి” అని పేర్కొన్నారు. ఎల్లయ్యనో, మల్లయ్యనో ప్రధానమంత్రిని చేయడం కోసం ఫ్రంట్లు అవసరం లేదన్నారు. నూతన వ్యవసాయ విధానం, ఆర్థిక, పారిశ్రామిక విధానాలు అవసరమని చెప్పారు. తనను కొన్ని కమ్యూనిస్టు పార్టీల జాతీయ నాయకులు వచ్చి కలిసినప్పుడు దేశం కోసం అందరం ఒక్కటి కావాలని అడిగారని, తాను ఎందుకోసమని ప్రశ్నించానని కేసీఆర్ తెలిపారు. ‘‘బీజేపీని గద్దె దించాలని, అదే మన లక్ష్యం కావాలని ఆ లీడర్లు చెప్పినారు. దానికి నేను అది చెత్త ఎజెండా అని చెప్పి కలవనన్న. ఎవరినో గద్దె దించేందుకు, ఎవరినో గద్దె ఎక్కించేదుకో కలువాల్నా? గద్దె దించాల్సింది రాజకీయ పార్టీలను కాదు... గద్దెనెక్కించాల్సింది భారత దేశ ప్రజలను” అని ఆయన పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ ఫ్రంట్ ప్రకటిస్తడా, ఇంకోటి ప్రకటిస్తడా అన్నది కాదిప్పుడు. తెలంగాణ కోసం జరిగినట్లు ఒక ప్రాసెస్ జరగాలి’’ అని అన్నారు. తాను జార్ఖండ్ వెళ్లినప్పుడు బీజేపీకి యాంటీగా ఫ్రంట్ ఎప్పుడు పెడతారని విలేకరులు అడిగారని, ఎవరికీ వ్యతిరేకంగా ఏ ఫ్రంట్ అవసరం లేదని తాను చెప్పానని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలకు అనుకూలంగా ఉండే ఫ్రంట్ ఉంటదని, దేశాన్ని బాగు చేసే ఆల్టర్నేటివ్ ఎజెండా రూపకల్పన జరగాలని అన్నానని తెలిపారు. దేశం బాగు పడడానికి ఆ ప్రయత్నం మన రాష్ట్రం నుంచి జరిగితే గర్వకారణమన్నారు. హైదరాబాద్ అందుకు వేదిక అయితే ఇంకా సంతోషమని చెప్పారు. ఈ ప్రాసెస్‌లో టీఆర్ఎస్ తప్పకుండా పాల్గొంటుందని కేసీఆర్ ప్రకటించారు.
మతం పేరుతో పెడధోరణులు
దేశంలో మతం పేరుతో పెడధోరణులు బాగా ప్రబలి పోతున్నాయని కేసీఆర్ అన్నారు. ‘‘భారత దేశ సమాజం శాంతికి ఆలవాలంగా ఉన్న దేశం. ఆదరించే సమాజం. అలాంటి దేశంలో కొన్ని దుర్మార్గమైన, సంకుచిత విధానాలు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి వెళ్తున్నది” అని తెలిపారు. కర్నాటకలో హిజాబ్ పేరు మీదనో ఇంకో పేరు మీదనో ఘర్షణలు లేవదీస్తున్నారన్నారు. దేవుడి ఊరేగింపులో కత్తులు, తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారన్నారు.
ఒక్క అవినీతి మంత్రి లేడు
తెలంగాణ సర్కారులో ఒక్క అవినీతి మంత్రి కూడా లేడనీ, మిగతా రాష్ట్రాల్లో మాత్రం మంత్రులు అవినీతిలో తేలుతున్నారని కేసీఆర్ అన్నారు. కర్నాటకలో ఒక మంత్రి అలాంటి ఆరోపణలతోనే తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. కానీ తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నమన్నారు. అందరూ ప్రజల బాగోగులు, వాళ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టి పని చేస్తారన్నారు.
అన్నీ ఉన్నయ్.. కానీ బుర్రలేదు..
మన దేశంలో అన్ని రకాల వనరులు ఉన్నాయని, యువ శక్తి కూడా ఉందని, అయినా వెనకబడి ఉండడానికి కారణమేమిటని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘సింగపూర్‌లో ఏమీ లేదు. మన్ను కూడా లేదు. మట్టి కావాలన్నా పక్క దేశం నుంచి షిప్పులల్ల తెచ్చుకుంటరు. మంచి నీళ్లను మలేషియా నుంచి తెప్పించుకుంటరు. మళ్లా ట్రీట్మెంట్ చేసి వాళ్లకే అమ్ముతరు. వాళ్లు ఎత్తే అన్నం ముద్ద, కూరగాయ వాళ్లది కాదు. మరి సింగపూర్ ఆర్థిక పరిస్థితి ఏంది, మనది ఏంది”అని అన్నారు. వాళ్ల దగ్గర ఏముంది, మన దగ్గర లేనిదేందని అడిగారు. ‘‘అక్కడ ఏమీ లేదు. కానీ బుర్ర ఉంది. మన దగ్గర అన్నీ ఉన్నయ్ కానీ బుర్ర లేదు’’ అని పేర్కొన్నారు. దేశం పురోగమించాలంటే అభ్యుదయ పథంలో వెళ్లాల్సిన అవసరం ఉందని, అందుకు అనుసరించాల్సిన మార్గాన్ని అన్వేషించాలన్నారు.
మన లెక్క పని చేస్తే దేశం చీకట్లలో మగ్గే ఖర్మ తప్పేది
ఏడేండ్ల కింద తెలంగాణలో అంధకారం ఉండేదని, కానీ ఇప్పుడు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోందని కేసీఆర్ చెప్పారు. ‘‘ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహించే గుజరాత్లో కూడా విద్యుత్ లేక అంధకారం నెలకొంది. పంటలు ఎండిపోయి రైతులు ఆందోళనలు చేస్తున్నరు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, కర్నాటకలో అంధకారం నెలకొంది. చుట్టూ అంధకారం ఉన్నా.. ఒక్క తెలంగాణ మాత్రమే మణిదీపంలా వెలుగుతున్నది. దానికి కారణం సొంత రాష్ట్రం సాకారమయ్యాక టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని తీరే” అని ఆయన పేర్కొన్నారు. ‘‘మన పరిస్థితి కూడా ఘోరంగా ఉండే. కానీ మారింది. మనం పని చేసినం. కృషి చేసినం. పూనుకున్నం. అందుకే 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నం. తెలంగాణ తీరులో కేంద్రంలోని బీజేపీ పర్ఫార్మ్ చేస్తే కరెంట్ కొరత ఉండేది కాదు. జనం చీకట్లో మగ్గాల్సిన ఖర్మ దేశ ప్రజలకు తప్పేది” అని అన్నారు. దేశంలో నీళ్లుండీ వాడుకోలేక పోవడం వల్ల నీటి యుద్ధాలు జరుగుతున్నాయని, రాష్ట్రాలు నీళ్ల కోసం కొట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. కావేరీ జలాల కోసం రెండు రాష్ట్రాలు ఘర్షణకు దిగాల్సి వచ్చిందన్నారు.
గవర్నర్ వ్యవస్థ దుర్మార్గం..
గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించి స్వచ్ఛమైన పాలన చేస్తున్నోళ్లను కేంద్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు దేశంలో చాలా ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం 12 మందిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసి గవర్నర్‌కు పంపిస్తే.. ఏడాది నుంచి ఆ ఫైల్ ఆయన దగ్గరే పెట్టుకున్నారని తెలిపారు. ‘‘అప్పట్లో ప్రజలకు మంచి చేయాలని నిష్కల్మషంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. ఆ రోజు యువకులుగా మేమందరం అందులో పని చేశాం. కిరికిరి లేకుండా రెండొందల మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చారు. అయితే అప్పుడు ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించి, స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీఆర్‌ను పదవి నుంచి తొలగించారు. చాలా కుటిలంగా, దుర్మార్గంగా చేశారు” అని ఆయన వివరించారు. ఇప్పటికీ ఉల్టాగా, చాలా వక్రమార్గంగా వ్యవస్థ నడుస్తోందని మండిపడ్డారు. ప్రజల కోసం రాజ్యాంగమా? రాజ్యాంగం కోసం ప్రజలా? అన్నట్టుగా పరిస్థితి ఉందన్నారు. రాజ్యాంగం ఉన్నది ఉన్నట్టు అమలు కావాలన్నా? అంబేద్కర్ కలలు కన్న రాజ్యాంగ స్ఫూర్తి నిజం కావాలన్నా? అవసరమైన మార్పులు చేర్పులు చేసుకొని కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాలని కేసీఆర్ అన్నారు.