తెలంగాణ బాగుపడ్డది..ఇగ దేశం మారాలె : కేసీఆర్

  • కేంద్రం అంటున్న ‘‘మేకిన్ ఇండియా’’ 
  • ఎక్కడుంది?.. జగిత్యాల సభలో కేసీఆర్  
  • కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్త.. 
  • దేశం నోరు వెళ్లబెట్టేలా నిర్మాణం చేయిస్త 
  • బండలింగాపూర్​ను మండలం చేస్తం
  • కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని నియోజకవర్గాలకు అదనంగా 10 కోట్ల చొప్పున నిధులిస్తం
  • గోల్ మాల్ గోవిందంగాళ్లు తిరుగుతున్నరని కామెంట్​

కరీంనగర్/ జగిత్యాల, వెలుగు: తెలంగాణ బాగుపడ్డదని, రాష్ట్రం లెక్క దేశం కూడా మారాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ‘‘మేకిన్ ఇండియా’’ ఎక్కడుందని ప్రశ్నించారు. “ప్రధాని సొంత రాష్ట్రంలో కరెంటు ఉండదు. ఢిల్లీలో తాగునీటికి తిప్పలు, కరెంటు కోతలు ఉంటాయి. ఇలాంటి దేశమా మనకు కావాల్సింది? దీని కోసమేనా స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాలు చేసింది? తెలంగాణ బాగు పడింది.. కానీ ఇది సరిపోదు. దేశం కూడా మారాలి’’ అని అన్నారు. 

‘‘తెలంగాణ జీఎస్​డీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.11.5 లక్షల కోట్లకు పెరిగింది. తెలంగాణ పని చేసినట్లు కేంద్రం చేస్తే  మన జీఎస్​డీపీ రూ.14 లక్షల కోట్లు కావాలి. మేధావులతో చర్చించండి.. ప్రచార హోరులో కొట్టుకుపోతే ఇబ్బందులు పడుతాం. ఒక్కసారి దెబ్బతింటే వందేళ్లు వెనక్కి పోతం. గతంలోనే తెలంగాణ నాయకులు చేసిన పొరపాటు వల్ల 60 ఏండ్లు గోసపడ్డం” అని అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ పర్యటించారు. కొత్త కలెక్టరేట్ బిల్డింగ్, టీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించారు. మెడికల్ కాలేజ్ బిల్డింగులకు శంకుస్థాపన చేశారు. తర్వాత మోతె గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గతంలో జగిత్యాల జిల్లాగా ఏర్పడుతుందని ఎవరూ అనుకోలేదని, తెలంగాణ ఏర్పడడం, టీఆర్ఎస్ అధికారంలోకి రావడం వల్లే ఇది సాధ్యమైందని కేసీఆర్ అన్నారు. 

ఎల్ఐసీ ప్రైవేటీకరణపై ఉద్యమించాలె.. 

కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం చెబుతున్న మేకిన్ ఇండియా ఎక్కడా కనిపిస్తలేదని.. కోరుట్ల మిషిన్ దవాఖాన పక్కన, కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ దగ్గర చైనా బజార్లు మాత్రమే కనిపిస్తున్నాయని కేసీఆర్ విమర్శించారు. మేకిన్ ఇండియా అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ఊరూరికీ చైనా బజార్లు ఎందుకొచ్చాయో జనం తెలుసుకోవాలన్నారు. ‘‘గోర్లు కత్తిరించుకునే కట్టర్లు, గడ్డం గీసుకునే బ్లేడ్లు, కూసునే కుర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు.. ఇలా అన్నీ చైనా నుంచే వస్తున్నాయి. ఇదో పెద్ద మోసం. దీన్ని లైట్ తీసుకోవద్దు. నేను భారత్ భవిష్యత్ గురించి మాట్లాడుతున్నాను. గోల్‌‌మాల్‌‌ గోవిందంగాళ్లు, అడ్డగోలుగా మాట్లాడేవాళ్లు, ఈ రోజు మనమధ్య తిరుగుతున్నారు. మనం అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంటది. ఆనాడు తెలంగాణ వస్తదని నెనెలాగ చెప్పిన్నో .. ఈ రోజు దేశంలో కూడా అట్లాగే మార్పు రావాలె.. భారత రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలె. తప్పకుండా ఈ దుష్ట సంప్రదాయాలు పోవాలె” అని అన్నారు. దేశంలోనే  పెద్దదైన ఎల్ఐసీని అమ్ముతామని అంటున్నారని, ఇదేమన్నా వాళ్ల జాగీరా? అని ప్రశ్నించారు. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులంతా పిడికిలెత్తి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 

మద్దుట్ల వద్ద లిఫ్ట్ స్కీమ్.. 

వరద కాలువ నుంచి సూరమ్మ చెరువు నింపి వేములవాడ నియోజకవర్గంలో కథలాపూర్‌‌, భీమారం తదితర మండలాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ స్కీమును త్వరలోనే చేపడతామని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండలం మద్దుట్ల గ్రామం వద్ద లిఫ్ట్​ స్కీమ్​ఏర్పాటు చేస్తామన్నారు. పోతారం, నారాయణపూర్‌‌ రిజర్వాయర్‌‌ను కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రోళ్లవాగు పనులు  పూర్తిచేస్తామన్నారు. కరీంనగర్‌‌, జగిత్యాల జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలకు అదనంగా రూ.10 కోట్లు ఇస్తామని ప్రకటించారు.

పది పన్నెండు రోజుల్లో రైతు బంధు.. 

పది, పన్నెండు రోజుల్లో రైతు బంధు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. తాను‌ బతికున్నంత వరకు రైతు బీమా, రైతు బంధు ఆగవని చెప్పారు. తన కంటే ముందు ఎంతోమంది సీఎంలు పని చేశారని.. కానీ కోరుట్ల, మెట్‌‌పల్లి, జగిత్యాల, సిరిసిల్ల, బాల్కొండ ప్రాంతాల్లో ఉన్న బీడీ కార్మికులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన  ఇక్కడ నెలకు రూ.2016 పెన్షన్ , రేషన్‌‌ బియ్యం, పిల్లలకు చదువు, కల్యాణలక్ష్మిలాంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. తలసరి విద్యుత్‌‌ వినియోగం, తలసరి ఆదాయంలో, ఆర్థిక వనరుల సముపార్జనలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌‌ వన్​గా ఉందన్నారు.

అద్భుతంగా కొండగట్టు..

జగిత్యాల జిల్లాలో కొండగట్ట, ధర్మపురి లాంటి ఆలయాలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. గతంలో వేములవాడ దేవస్థానానికి స్థలం లేకపోతే అక్కడి ఎమ్మెల్యే రమేశ్‌‌రావు, ఎంపీ వినోద్‌‌రావు ఆధ్వర్యంలో 35 ఎకరాల స్థలాన్ని ఇప్పించారని చెప్పారు. కొండగట్టు అంజన్న దేవస్థానానికి కూడా కేవలం 20 ఎకరాలు ఉండేదని, దీంతో పక్కనే ఉన్న 384 ఎకరాల స్థలాన్ని  సేకరించి, దేవస్థానానికి అప్పగించామన్నారు. కొండగట్టు క్షేత్రానికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నామని, తానే స్వయంగా వచ్చి ఆగమ శాస్త్రం ప్రకారం అద్భుతమైన పుణ్యక్షేత్రం నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే దీక్షాపరులు దీక్ష వదిలే విధంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.  

కాళేశ్వరం నీళ్లతో వరద కాలువ కళకళ.. 

ఒకప్పుడు వరద కాల్వలో నీళ్లు ఉండకపోయేవని, కాళేశ్వరం నీళ్ల వల్ల వరదకాలువ కాస్తా రిజర్వాయర్ గా, సజీవ జలధారగా మారిందని కేసీఆర్ అన్నారు. కరీంనగర్‌‌ రూరల్‌‌ మండలంలో వరద కాలువకు తూములు పెట్టుకొని వందల చెరువులు నింపుతున్నామన్నారు. ప్రస్తుతం వరద కాలువ పొడువునా సుమారు 13 వేల కరెంట్‌‌ మోటార్లు ఉన్నాయని, వాటితో రైతులు పంటలు పండించుకుంటున్నారని, ఏడాదికి రూ.14 వేల కోట్లు కరెంట్ బిల్లు కింద ప్రభుత్వమే చెల్లిస్తోందని చెప్పారు. కానీ ఆ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం అంటోందని మండిపడ్డారు. ధర్మపురిలోని లక్ష్మీనర్సింహ స్వామి చాలా మహిమాన్వితమైన దేవుడని, గతంలో సమైక్య పాలకులు ఇక్కడ గోదావరి పుష్కరాలు జరపకపోతే తాను కొట్లాడానని తెలిపారు. ‘‘ఉద్యమం జరిగే టైంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటే ‘ఉద్యమ విజయోస్తు, తెలంగాణ ప్రాప్తిరస్తు’ అంటూ నిండు మనసుతో దీవించారు. వచ్చిన తెలంగాణలో చాలా వైభవంగా, అద్భుతంగా గోదావరి పుష్కరాలు జరుపుకున్నాం” అని అన్నారు. ప్రజల కోరిక మేరకు ప్రస్తుతం మెట్​పల్లి మండలం పరిధిలో ఉన్న బండలింగాపూర్‌‌ గ్రామం కేంద్రంగా కొత్త మండలం కొత్త మండలం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.