మేం ఎవరికి ఏటీం కాదు.. ప్రజల టీం, రైతుల టీం: కేసీఆర్

బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న విమర్శలకు సీఎం కేసీఆర్ కౌంటర్ వేశారు. తాము బీజేపీకి బీ టీం కాదు.. కాంగ్రెస్ కు ఏ టీం కాదని.. తమది రైతుల టీం, పేదల టీం అని చెప్పారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్‌ఎస్‌  భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు కేసీఆర్ హాజరయ్యారు. పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా మాట్లాడిన కేసీఆర్.. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన పార్టీ అని అన్నారు.  బీఆర్ఎస్ తెలంగాణకు పరిమితమైన పార్టీ కాదని.. ఎవరెన్ని విమర్శలు చేసినా బీఆర్ఎస్ విస్తరణ కొనసాగుతుందన్నారు. బీఆర్ఎస్ దేశ మార్పు కోసం ప్రయత్నిస్తుందన్నారు.  

ALSO READ:సెన్సార్ బోర్డుకు బుద్దుందా.. ఆదిపురుష్ లో డైలాగ్స్ పై హైకోర్టు ఆగ్రహం

దేశంలో 60 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారని కేసీఆర్ అన్నారు.ప్రస్తుత దేశ జలవిధానాన్ని బంగాళాఖాతంలో కలపాలన్నారు. కేంద్రానికి దమ్ముంటే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లందించాలని తెలిపారు కేసీఆర్.  మోడీ చెప్పిన మేకిన్ ఇండియా  ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ,బీజేపీ వల్ల దేశానికి  ఒరిగేదేంలేదన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదని..ప్రజలు గెలవాలన్నారు కేసీఆర్.