వచ్చే వందేండ్ల దాక సిటీలో తాగునీటి సమస్య రాదు

జంటనగరాల తాగునీటి కోసం తీసుకొచ్చిన 111 జీవోపై కేసీఆర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.  111 జీవో అర్థ రహితం.. ఈ జీవోను ఎత్తేస్తామని పేర్కొన్నారు. ‘హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజల తాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ జీవో విడుదల చేశారు. ఈ జీవో కింద లక్షా 32 వేల 600 ఎకరాల స్థలముంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లేక్‎లు కలుషితం కాకుండా అప్పట్లో ఈ జీవో పెట్టారు. ఇప్పుడు అసలు ఆ నీళ్లే వాడటం లేదు. మరో 100 సంవత్సరాల వరకు హైదరాబాద్‎కు తాగునీటి సమస్య రాదు. ఎక్స్‎పర్ట్ కమిటీ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాం. ఆ రిపోర్టు రాగానే గ్రీన్ జోన్, మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ 111 జీవోను ఎత్తివేస్తాం’ అని సీఎం తెలిపారు.

అస‌లు ఈ 111జీవో అంటే ఏంటీ?
జంట నగరాల‌కు తాగునీటి అవ‌స‌రాలు తీర్చే ప్ర‌ధాన రిజ‌ర్వాయ‌ర్లు అయిన ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్ లను కాపాడటం కోసం 1996లో ఆనాటి ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. ఆ రెండు జ‌లాశ‌యాల‌కు 10కి.మీ దూరం వ‌ర‌కు బఫర్‌ జోన్‌గా ప్రకటించి.. ఆ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌రాదని జీవోలో తెలిపారు.  దాంతో ఈ జీవో కిందకు దాదాపు 84 గ్రామాలు వచ్చాయి. అప్పటినుంచి ఈ గ్రామాలలో ఎలాంటి అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయింది.