బంగారు తునకగా మారుస్తా..ఏడాదిన్నరలో సాగు నీళ్లు తెచ్చే బాధ్యత నాది : కేసీఆర్

  •    కేసీఆర్​ ఒక్కడే రాడు.. వెంట చాలా వస్తాయ్​
  •     బహిరంగ సభలో కేసీఆర్​

కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని, కామారెడ్డిని అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ​పేర్కొన్నారు. కామారెడ్డి నుంచి బీఆర్ఎస్​ తరఫున పోటీ చేస్తున్న నేపథ్యంలో గురువారం సీఎం ఇక్కడ నామినేషన్​ వేశారు. అనంతరం డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్​ మాట్లాడారు. ‘కేసీఆర్​వస్తే ఒక్కడే రాడు కదా.. కేసీఆర్​ వెంట చాలా వస్తయ్. కామారెడ్డి జిల్లా అభివృద్ధి చెందుతుంది. 

కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు యాడాదిన్నర, రెండేళ్లలో సాగు నీరు అందిస్తం. పెండింగ్​లో ఉన్న  కాళేశ్వరం పనులను త్వరగా పూర్తి చేస్తం. విద్య సంస్థలు, పరిశ్రమలు వస్తాయి, ఊహకందని విధంగా అభివృద్ధి జరుగుతుంది’ అని కేసీఆర్​ పేర్కొన్నారు. ఇప్పుడే అన్ని చెబితే గొప్పలు చెప్పినట్లు ఉంటదని, కామారెడ్డి నియోజకవర్గాన్ని బంగారు తునకలా మార్చి అప్పగిస్తానన్నారు. ఇక్కడ అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయని, రైల్వే లైన్​, హైవే లాంటి అనేక సౌలత్​లు ఉన్నాయన్నారు.

గంపకు ఎలాంటి ఢోకా లేదు

‘గంప గోవర్ధన్​తన పదవిని త్యాగం చేసి నన్ను నిలబెడుతున్రు, మరింత అభివృద్ధి కావాలని నన్ను ఇక్కడ పోటీచేయాలని కోరారు.  ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని’ కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మరింత పెద్ద పదవిలో కూర్చొబెట్టే బాధ్యత తనదన్నారు. అంతకు ముందు కేసీఆర్, గంప గోవర్ధన్​ ఇంట్లో స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి,  మంత్రి ప్రశాంత్​రెడ్డిలతో  సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. 

కామారెడ్డి నియోజక వర్గముఖ్య నేతలు, సమన్వయ కమిటీ సభ్యులతో మాట్లాడారు. పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలని సూచించారు. బీఆర్ఎస్​ జిల్లా ప్రెసిడెంట్​ ముజీబోద్దీన్, స్టేట్​లైబ్రరీ చైర్మన్​ శ్రీధర్, మున్సిపల్ చైర్​పర్సన్​ నిట్టు జాహ్నవి, లీడర్లు నిట్టు వేణుగోపాల్, పున్న రాజేశ్వర్, నర్సింగ్​రావు, మామిండ్ల అంజయ్య, నల్లవెల్లి అశోక్​ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్​ను కలినిన రెడ్డి సంఘం ప్రతినిధులు

కామారెడ్డికి వచ్చిన కేసీఆర్​ను రెడ్డి సంఘానికి చెందిన ప్రతినిధులు కలిసి రెడ్డి కార్పొరేషన్​ను ఏర్పాటు చేయాలని విన్నవించారు.   రెసిడెన్షియల్​ స్కూల్స్​ఏర్పాటు చేయాలన్నారు. కామారెడ్డిలో నిర్మిస్తున్న స్కూల్​కు ఫండ్స్​కేటాయించాలని కోరారు. ప్రతినిధులు రాంరెడ్డి, మోహన్​రెడ్డి, వెంకటేశ్వర్​రెడ్డి, భీమ్​రెడ్డి ఉన్నారు.