భారీ మెజార్టీతో గెలిపించండి... అన్ని పనులు చేస్తా : కేసీఆర్

  • పోచారం శ్రీనివాస్​రెడ్డిని లక్ష ఓట్లతో  గెలిపించాలేఆయనకు మళ్లీ పెద్ద పదవే వస్తది
  • బాన్సువాడ బంగారువాడగా మారింది
  • హన్మంత్​షిండే సౌమ్యుడు, వివాదాలో జోలికిపోడు
  • జుక్కల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
  • పోచారం, హన్మంత్​షిండే, బీబీపాటిల్​లను పొగడ్తలతో ముంచెత్తిన సీఎం​
  • బాన్సువాడ, జుక్కల్​సభల్లో సీఎం కేసీఆర్​

పిట్లం, బాన్సువాడ, బీర్కుర్, వెలుగు: జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో సోమవారం బీఆర్ఎస్​ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ ​నింపాయి. సభలకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, జనం తరలివచ్చారు. సీఎం ఆయా నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూనే ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు.

స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి, జుక్కల్​ఎమ్మెల్యే హన్మంత్​షిండే, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్​లను పొగడ్తలతో కేసీఆర్ ​ముంచెత్తారు. బాన్సువాడ సభలో పోచారం శ్రీనివాస్​రెడ్డిని లక్ష్మీపుత్రుడిగా, జుక్కల్​లో సభలో హన్మంత్​షిండేను సౌమ్యుడిగా, ప్రజల మనిషిగా అభివర్ణించారు. జుక్కల్​ఎమ్మెల్యే హన్మంత్​షిండే నెలలో 25 నియోజకవర్గంలోనే ఉంటారని, తనను ఎప్పుడు కలిసినా, నియోజకవర్గ అభివృద్ధి గురించే అడుగుతారే తప్పా, సొంత పనుల గురించి ఎప్పుడూ అడగలేదన్నారు.

గతంలో జుక్కల్ ​కు పిల్లనిచ్చేందుకు భయపడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ వెళ్లే  పరిస్థితి ఉండేదని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తాగునీటి గోస తీర్చామన్నారు. జుక్కల్ ​నియోజకవర్గాన్ని త్రివేణి సంగమంగా పోలుస్తూ, ఇక్కడి ప్రజలు పండరీపూర్ ​వార్కరీ సంప్రదాయాన్ని ​పాటిస్తారని గుర్తు చేశారు. జుక్కల్​ నియోజకవర్గంలోని నిజాంసాగర్​ మండలంలో కుటుంబాలకు దళితబంధు ఇచ్చామని, మిగతా ఏరియాల్లో కూడా అందరికి ఇస్తామని, దీనికి  కొంత సమయం పడుతుందన్నారు.

దళితులను కాంగ్రెస్ ​ఓటు బ్యాంకు కోసం వాడుకుందే తప్ప, వారి సంక్షేమం కోసం ఆలోచించలేదన్నారు. బీఆర్ఎస్ కులమతాలకు అతీతంగా అన్నివర్గాల అభివృద్ధి కోసం పని చేస్తుందన్నారు. బాన్సువాడ బాగా అభివృద్ధి చెంది బంగారువాడలా మారిందని కొనియాడారు. మంత్రి ప్రశాంత్​రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, జడ్పీ చైర్​పర్సన్ ​దఫేదర్ ​శోభ, క్రిస్టియన్​ కార్పొరేషన్ ​స్టేట్ ​చైర్మన్ ​రాజేశ్వర్, డీసీసీబీ చైర్మన్ ​పోచారం భాస్కర్​రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జి​పోచారం సురేందర్​రెడ్డి,  స్థానిక లీడర్లు పాల్గొన్నారు. 

సీఎం హామీలు

జుక్కల్​ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలను ఎన్నికల తర్వాత వాటిని నేనే స్వయంగా వచ్చి పరిష్కరిస్తా.

నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు ​సాగు నీటికి ఢోకా ఉండదు.  
జుక్కల్ ​నియోజకవర్గానికి సంబంధించిన లెండి ప్రాజెక్ట్​పై ఎన్నికలు కాగానే మహారాష్ట్ర గవర్నమెంట్​తో మాట్లాడుతా. పనులు జరిగేలా చూస్తా.
జుక్కల్ ​నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తాం.
బిచ్కుందలో వంద పడకల హాస్పిటల్​పనులు కొనసాగుతున్నాయి. వీటిని కంప్లీట్ ​చేయించడమే కాకుండా హాస్పిటల్​లో అధునాతన సౌలత్​లు కల్పిస్తాం.
అర్హులైన వారందరికీ దళితబంధు ఇస్తాం
 ఇప్పటికే బాన్సువాడ బాగా డెవలప్​అయిందని, పోచారంను మళ్లీ లక్ష మెజార్టీతో గెలిపిస్తే  బంగారు బాన్సువాడగా మారుస్తా.

ఒక కూలికి ముగ్గురం పని చేస్తున్నాం

బాన్సువాడలో పోచారం గెలిస్తే మళ్లీ ముగ్గురు ఎమ్మెలేలు అవుతారని ప్రతిపక్ష లీడర్లు విమర్శిస్తున్నారు. కానీ ఒక్క కూలికే  మేం ముగ్గురం పనిచేస్తున్నాం. నాతో పాటు నా కొడుకులు ఇద్దరు కూడా ప్రజా సేవా చేస్తున్నారు. ప్రజల కోసం వారి జేబుల్లో నుంచి ఖర్చు పెడుతున్నారు తప్ప, ఎవరినీ మోసం చేయడం లేదు. బాన్సువాడలో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవు.

కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. సీఎం కేసీఆర్​కాదనకుంట మాకు నిధులు ఇచ్చారు. నేను చాలా మంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశా. కానీ సీఎం కేసీఆర్ ​అందరి కంటే ప్రత్యేకం. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 11 వేల డబుల్ బెడ్​రూమ్​ఇండ్లు నిర్మించాం. సీఎం కేసీఆర్​ మరో 5000 ఇండ్లు మంజూరు చేస్తే, నియోజకవర్గంలో ఇల్లు లేని వారే ఉండరు.


– స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి 

రూ.5,500 కోట్లతో అభివృద్ధి పనులు

గడిచిన తొమ్మిదిన్నర  ఏండ్లలో నియోజకవర్గంలో రూ.5,500 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. 40 వేల ఆయకట్టుకు నీళ్లందించే నాగమడుగు పనులు 80 శాతం పూర్తయ్యాయి. నియోజకవర్గంలో రోడ్లను బ్రహ్మండంగా అభివృద్ధి చేసుకున్నాం. కౌలాస్​నాలా ప్రాజెక్ట్​, కౌలాస్​కోటను, పిట్లం మండలంలోని రామలింగేశ్వర ఆలయం, సలాబత్​పూర్ ​హనుమాన్ ​మందిర్​లను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎంను కోరుతున్నా.

పిట్లంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి. నియోజకవర్గంలో కొన్ని చోట్ల గిరిజనేతలు పోడు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమస్యను కూడా పరిష్కరించాలి.  హన్మంత్​షిండే, జుక్కల్​ ఎమ్మెల్యే