ఖమ్మం/కూసుమంచి, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే పాలేరుకు న్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గ పరిధిలోని జీళ్లచెర్వులో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలన్నీ పాలేరును నిర్లక్ష్యం చేశాయన్నారు. మంచినీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాయని మండిపడ్డారు. బీఆర్ఎస్వచ్చాక భక్తరామదాసు ప్రాజెక్ట్పూర్తిచేయడంతో నీళ్లు అందుతున్నాయన్నారు.
భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తికాక ముందు ఇక్కడ ఎకరం రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండేదని, నేడు ఎకరా రూ.30లక్షల నుంచి రూ.50 లక్షలు పలుకుతోందని చెప్పారు. మిషన్ కాకతీయతో పాలేరు నియోజకవర్గంలో ఎండా కాలంలోనూ చెరువులు నిండు కుండల్లా ఉంటున్నాయన్నారు. లంబాడీ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని గుర్తుచేశారు. బీఆర్ఎస్హయాంలో పాలేరులోని 40 తండాలు పంచాయతీలుగా మారాయని చెప్పారు.
లంబాడీ బిడ్డలు తండాల్లో రాజ్యం చేస్తున్నారని చెప్పేందుకు గర్వంగా ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందని, పాలేరుకు కనెక్ట్ చేస్తామన్నారు. దాంతో సాగర్ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న ఖమ్మం జిల్లాలోని భూములకు నీళ్ల పీడ పోతుందని చెప్పారు.
ఉపేందర్‌రెడ్డిపై ప్రశంసలు
జీళ్లచెర్వులో ప్రసంగం సందర్భంగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే హుజూరాబాద్ నియోజకవర్గం మాదిరిగా పాలేరులో పూర్తిస్థాయిలో దళితబంధు ఇచ్చే బాధ్యత తనదన్నారు. కొత్తగా రెండు మండలాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఉపేందర్ రెడ్డి మాట్లాడుతుంటే సొంత మనుషులతో మాట్లాడుతున్నట్లు ఉందని, తన సెల్ ఫోన్ నంబరు మీ దగ్గర ఉందా అంటూ సభకు హాజరైన జనాన్ని అడిగారని, రాజకీయాల్లో ఇంత చొరవగా, చనువుగా ప్రజల్లో కలిసిపోయి మాట్లాడే నాయకులు తక్కువగా ఉంటారని చెప్పారు. ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడం అదృష్టవంతులు అని కేసీఆర్ అన్నారు. సభలో మంత్రి పువ్వాడ అజయ్, ఖమ్మం ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, దేశపతి శ్రీనివాస్, మధుసూదనచారి తదితరులు పాల్గొన్నారు.
మాయమాటలు చెప్పేవారిని నమ్మొద్దు: కందాల
ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చెప్పారు. సీఎం ప్రసంగానికి ముందు ఎమ్మెల్యే మాట్లాడారు. ‘‘ఇది ఎన్నికల వేళ జరుగుతున్న సభ అయినా, నేను ప్రత్యేకంగా ఎన్నికల గురించి చేప్పేది ఏమి ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు మీతో ఉండేవాడిని. మన పాలేరులో ఉన్న ప్రతి ఊరికి ఎన్నోసార్లు వచ్చిన వాడిని.
పాలేరు బిడ్డను. రాజకీయం కంటే, ప్రజల సంక్షేమం గురించే ఎక్కువ ఆలోచించేవాడిని”అని చెప్పారు. పాలేరు నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఇప్పటివరకు నియోజక వర్గంలోని దళితులకు రూ.120 కోట్లు కేటాయించగలిగామన్నారు. డబ్బు లేదని పిల్లల చదువుని ఆపొద్దన్నారు. మీలో ఒక్కడినైన తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు వేదికపై సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే కందాల కూతురు దీప్తి బొట్టు పెట్టారు. వేదిక వద్ద ఇసుకతో తయారు చేసిన ఎమ్మెల్యే సైతక శిల్పం ఆకట్టుకుంది.