తెలంగాణ పోరాట పంథాలో రావి స్ఫూర్తి ఉంది

తెలంగాణ పోరాట పంథాలో రావి స్ఫూర్తి ఉంది
  • తొలి సార్వత్రిక ఎన్నికల్లో రావి చరిత్ర సృష్టించారు
  • గొప్ప ప్రజాస్వామిక వాది రావి
  • రావి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్

తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు, ప్రజాస్వామికవాది, రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు ఆయనకు ఘన నివాళులర్పించారు.  తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించిన రావి నారాయణ రెడ్డి, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల కూడా ప్రదర్శించిన సానుకూల స్ఫూర్తి,  గొప్పదని సీఎం స్మరించుకున్నారు. ‘స్వాతంత్ర్యం వచ్చినంక  దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాయుధ పోరాటాన్ని విరమించిన గొప్ప ప్రజాస్వామిక వాది రావి’ అని సీఎం అన్నారు. దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించినారని సీఎం కొనియాడారు. ప్రజా పోరాటాలు విజయవంతం కావాలంటే నిర్దిష్ట పరిస్థితులకు, నిర్దిష్ట కార్యాచరణను అనుసరించాలనే సూత్రాన్ని రావి నారాయణ రెడ్డి ఆచరించి చూపారన్నారు. ఆయన అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము అనుసరించిన పార్లమెంటరీ పోరాట పంథాలో ఇమిడివున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.