రాష్ట్రంలో ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్డు లీజు, భూముల అమ్మకం, వైన్స్ టెండర్లు ఇలా ఏ అమ్మకం చేస్తున్నా అవి ఎన్నికల వరాల కోసమే. రైతు రుణమాఫీ, బీసీలకు లక్ష రూపాయలు, మైనార్టీలకు లక్ష రూపాయలు, గృహలక్ష్మి పేరుతో మూడు లక్షలు, ఆర్టీసీ విలీనం, ఉద్యోగులకు పీఆర్సీ, వీఆర్ఏ, పంచాయతీ జూనియర్ కార్యదర్శుల క్రమబద్ధీకరణ, జిల్లాల్లో కారుణ్య నియామకాలు.. ఇలా రోజుకు ఒకటి ఈ మధ్య కాలంలో పత్రికల్లో హెడ్ లైన్స్, టీవీల్లో బ్రేకింగ్‌లు చూస్తున్నాం. ఇదంతా ఎన్నికల కోసమే అని అనుకోని వారుంటారా? ప్రభుత్వ అధినేత కేసీఆర్ కు ఎక్కడో భయం పుట్టింది. ఎన్నికల్లో ప్రజలు ప్రశ్నిస్తారన్న విషయాన్ని కేసీఆర్ పసిగట్టారు. తాను ప్రజలకు ఇచ్చిన హమీలు ఇప్పటిదాకా మరచి పోయారు, ఇప్పడే గుర్తొచ్చినట్లు
హంగామా చేస్తున్నారు.
ఎన్నికల ముందు ఆఖరి సమయంలో కేసీఅర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాఉన్నాయి? ఈ తొమ్మిది ఏండ్లలో ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్న ప్రతిఓటరుకు వచ్చేదే. ఉదాహరణకు రైతుల విషయంలో రుణమాఫీ మొదటనే మాఫీ చేసి ఉంటే.. మాపై ఇంట్రెస్ట్ భారం ఉండకపోవు అని రైతులు అంటున్నారు. కేసీఆర్ తీసుకున్న ఆలస్య నిర్ణయం వల్లనే మేము నష్టపోయామని రైతులు స్పష్టంగా చెపుతున్నారు. మరోవైపు 2018 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న కొత్త రుణాలు అలాగే ఉన్నాయి. ఇక గృహలక్ష్మి పేరుతో ఇండ్లు లేని వారికి మూడు లక్షలు ఇవ్వాలనే నిర్ణయంతో ..18 లక్షల మంది ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు.
ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వం లబ్ధిదారులకు అందరికీ మూడు లక్షలు ఇవ్వడం అసలు సాధ్యమే కాదు. నియోజకవర్గానికి మూడు వేల మందికి ఇచ్చినా మిగతా అసంఖ్యాకుల సంగతేమిటి? కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే అరకొర ఇండ్లు కూడా ఎన్నికల లోపు పూర్తి కావు. డబుల్ బెడ్రూమ్ పథకంలో విఫలమైన ప్రభుత్వం, ఇపుడు కొత్తగా దాన్ని మూడు లక్షల నగదు పథకంగా మార్చింది. ఈ పథకాన్నైనా తొమ్మిదేండ్ల నుంచి విడతల వారీగా పూర్తి చేసి ఉంటే బాగుండేది కదా అని ప్రజల అభిప్రాయం.
ఆర్టీసీ విలీనమూ అంతే..
ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే నిర్ణయం ఎన్నికల సమయంలో తీసుకోవడం వల్ల దాని ఫలితాలు గ్రౌండ్ కావు. వీఆర్ఏల క్రమబద్ధీకరణ నిర్ణయాల ఫలాలు కూడా అనుభవించలేని సమయంలో ఎన్నికలు వస్తున్నాయి. హామీల అమలు ఎలా ఉంది? సంపద సృష్టించి అమలు చేస్తున్నారా.. లేక సంపదను అమ్మి చేస్తున్నారా అనేది ప్రజలు గమనిస్తున్నారు.
హైదరాబాద్ లో కోకాపేట, బుద్వేల్ లాంటి ఏరియాల్లో భూములు అమ్మి ఎన్నికల హామీలు నెరవేర్చాలని రూ. రూ.15 వేల కోట్లు సమకూర్చుకోవాలని అంచనాతో ప్రభుత్వం రంగంలోకి దిగడం, మరోవైపు హైదరాబాద్ కు మణిహారం లాంటి అవుటర్ రింగ్ రోడ్డును రూ.7500కోట్లకు30 ఏండ్లు లీజుకు ఇవ్వడం, ఇక వైన్స్ టెండర్లకు సమయం ఉన్నా ముందే ఎన్నికల కోసం దరఖాస్తుల ద్వారా రూ. 2600 కోట్లు సమకూర్చుకోవడం. ఈ అంశాలన్నింటినీ ప్రజల గమనిస్తున్నారు. మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడితే అప్పుల కుప్పగా మారడమే కాకుండా భూముల అమ్మకం ఎన్నికల సమయంలో తనకు అనుకూలమైన వారికి కట్టబెడుతున్న నిర్ణయాలు చూస్తున్నాం.
ఓట్ల ఎరలు
ఓట్ల ఎరలకు ఎంత ప్రయత్నించినా ఇలాంటి ఆఖరి నిర్ణయాలు గతంలోనూ పనిచేయలేదు. ఉదాహరణకు, 2004లో చంద్రబాబు నాయుడు తిరిగి గెలవడానికి కోటి వరాలు అంటూ కులాలవారీగా లబ్ది చేకూరే విధంగా ప్రయత్నం చేశారు. కానీ తాను నిర్ణయం తీసుకున్నా అది ప్రజలను సంతృప్తి పరచలేదు. 2019లో కూడా పసుపు కుంకుమ పేరుతో డబ్బులు ఇచ్చారు. అయినా తిరిగి అధికారంలోకి రాలేదు. కేసీఆర్ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అలాంటివే. కేసీఆర్ తాత్కాలిక ఓటు ఎరలు ప్రజల గమనంలో ఉంటున్నాయి. కాబట్టి తీసుకునే నిర్ణయాలు అంధకారంగా మారకూడదు.
- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక